న్యూఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో ఈవీఎంల వినియోగానికి స్వస్తిపలికి మళ్లీ బ్యాలెట్ పేపర్ విధానాన్ని పునరుద్ధరించాలని మంగళవారం ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో జరిగిన చర్చలో విపక్షాలు డిమాండ్‌చేశాయి. ఈ మేరకు పలు విపక్షపార్టీల ఎంపీలు మాట్లాడారు. ‘‘ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు చాంతాడంత క్యూ లైన్లలో నిల్చునే ప్రతి ఒక్క ఓటరులో తమ ఓటు సద్వినియోగం అవుతోందన్న భరోసాను కల్పించాలి. ఈవీఎంలతో మోసగిస్తున్నారని నేను చెప్పడంలేదు. కానీ ఈవీఎంలను దుర్వినియోగం చేయొచ్చు అనేది మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలను.
ఈవీఎంలపై ఓటర్లలో గూడుకట్టుకుపోయిన అపోహలను తొలగించాలంటే రెండే మార్గాలున్నాయి. ఈవీఎం ఓట్లకు సరిసమానంగా వీవీప్యాట్ చిట్టీలను అన్నింటినీ లెక్కించాలి. లేదంటే ఈవీఎంలను పక్కనపడేసి మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానానికి వెళ్లాలి. పేపర్ బ్యాలెట్ విధానమే అత్యంత ఉత్తమం. ఎందుకంటే సాంకేతికంగా ఎంతో పురోగమించిన జపాన్, అమెరికా సైతం ఈవీఎంలాంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాలను పక్కనబెట్టేసి పేపర్‌బ్యాలెట్‌కు జై కొట్టాయి. ఎంతకాదన్నా ఈవీఎంలు అనేది మెషీన్లు. ఎలాంటి మెషీన్‌లో అయినా మార్పులు చేయొచ్చు’’ అని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ అన్నారు. ‘‘ పేపర్ బ్యాలెట్ పట్ల ఓటర్లలో ఎంతో విశ్వసనీయత, నమ్మకం ఉన్నాయి. బ్యాలెట్ విధానం మంచిది’’ అని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు.
‘‘మీట అయితే ఓటరు నొక్కుతున్నాడుగానీ తన ఓటు ఎటు పోతుందనేది ఇప్పటికీ అతనికి ఇక చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈవీఎంలో ఇదే స్పష్టత కరువైంది. ఓటరు మదిలో సూక్ష్మస్థాయి అనుమానం ఉన్నాసరే దానిని నివృత్తిచేయాల్సిందే. అనుమానాలతో ఎన్నికల క్రతువును కొనసాగించడం నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకోదు’’ అని శివసేన (యూబీటీ) నేత అనిల్ దేశాయ్ అన్నారు. సీపీఐ(ఎం) నేత ఆమ్రా రామ్, రాష్ట్రయ జనతాదళ్ ఎంపీ అభయ్ కుమార్ సిన్హా సైతం ఇదే వాదనకు తమ మద్దతు ప్రకటించారు. 2004 ఏడాది నుంచి ఐదు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించిన విషయం విదితమే.


