లోక్‌సభలో మంగళవారం కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌ను తొలగించాలంటూ ఇండియా బ్లాక్ ఎంపీలు అభిశంసన (impeachment) నోటీసులు సమర్పించారు. డీఎంకే ఎంపీ కనిమొళి ఆధ్వర్యంలోని ఎంపీల బృందం.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి నోటీసుల అందజేసింది.
మధురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రాంగణంలో కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి ఇస్తూ తాజాగా జస్టిస్ జీఆర్ స్వామినాథన్ తీర్పు ఇచ్చారు. ఈ స్థలం సమీపంలో 14వ శతాబ్దపు దర్గా ఉండటంతో సామాజిక ఉద్రిక్తతలకు దారితీస్తుందనే అభ్యంతరాలు వెల్లవెత్తాయి. డీఎంకే.. దాని మిత్రపక్షాలు ఆయన తీర్పు పక్షపాతంగా ఉందని ఆరోపించాయి.
గతంలో దీపం కొండ అడుగున ఉన్న స్తంభం వద్ద వెలిగించేవారు. కానీ, జస్టిస్ స్వామినాథన్ తీర్పు ప్రకారం దీపం కొండ మధ్యలో ఉన్న స్తంభం వద్ద వెలిగించాలి అని ఆదేశించారు. ఈ తీర్పు సెక్యులర్ విలువలకు విరుద్ధంగా ఉందంటూ మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ లోక్‌సభలో 120 ఎంపీల సంతకాలతో కూడిన అభిశంసన పిటిషన్ సమర్పించాయి. డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, ఎస్పీ అధినేత.. ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆ సమయంలో కనిమొళి వెంట ఉన్నారు.
VIDEO | Delhi: DMK leader Kanimozhi submits an Impeachment Notice to Lok Sabha Speaker Om Birla, seeking the removal of Madras High Court Judge G R Swaminathan, after obtaining signatures from more than 120 MPs.
Congress MP Priyanka Gandhi Vadra, Samajwadi Party chief Akhilesh… pic.twitter.com/yzn9gq2lio— Press Trust of India (@PTI_News) December 9, 2025
భారతదేశంలో న్యాయమూర్తులపై అభిశంసన చాలా అరుదుగా జరుగుతుంది. అయితే తాజా పరిణామాలతో తమిళనాడులో రాజకీయ-న్యాయపరమైన ఘర్షణ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో.. లోక్‌సభ స్పీకర్ నిర్ణయం కీలకంగా మారనుంది. ఆయన నోటీసును స్వీకరిస్తేనే ప్రక్రియ ముందుకు సాగుతుంది.
నెక్ట్స్ ఏం జరగొచ్చు..
స్పీకర్ నోటీసును పరిశీలిస్తారు.. అవసరమైతే విచారణ కమిటీ ఏర్పాటు చేస్తారు
లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ 2/3 మెజారిటీతో తీర్మానం ఆమోదం కావాలి
చివరగా రాష్ట్రపతి ఆమోదిస్తేనే న్యాయమూర్తి పదవి నుంచి తొలగింపబడతారు
జస్టిస్ స్వామినాథన్ నేపథ్యం..
జస్టిస్ జీఆర్ స్వామినాథన్ తమిళనాడు తంజావూర్ జిల్లా తిరువారుర్‌లో(1968లో) జన్మించారు. సేలం, చెన్నైలో న్యాయవిద్యను పూర్తి చేశారు. న్యాయవాదిగా దీర్ఘకాలం పనిచేసి, తర్వాత మద్రాస్ హైకోర్టులో మధురై బెంచ్‌కు అదనపు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా సేవలందించారు. అటుపై 2017లో హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తన పనితీరును ప్రజలకు తెలియజేయడానికి రిపోర్ట్ కార్డు విడుదల చేసిన మొదటి జడ్జి కూడా ఈయనే. గతంలో బీజేపీ అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా తిరుపరంకుండ్రం కార్తీక దీపం తీర్పు వల్ల రాజకీయ వివాదం చెలరేగింది.


