హోటళ్ల మూసివేతల వేళ కేంద్రం గుడ్‌న్యూస్‌ | Centre says some commercial LPG cylinders ‘will be released’ | Sakshi
Sakshi News home page

హోటళ్ల మూసివేతల వేళ కేంద్రం గుడ్‌న్యూస్‌

Mar 12 2026 8:43 PM | Updated on Mar 13 2026 10:06 AM

Centre says some commercial LPG cylinders ‘will be released’

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇంధన కొరతతో హోటళ్ల మూసివేతలు జరుగుతున్న నేపథ్యంలో పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది. కొంత మొత్తంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లను విడుదల చేస్తామని తెలిపింది. లబ్ధిదారుల గుర్తింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది.

అంతేకాదు, ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలకు అదనంగా 40,000 కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపు కూడా చేశామని తెలిపింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. రోజూ దాదాపు 50 లక్షల సిలిండర్ల పంపిణీ జరుగుతోందని చెప్పారు.  ఎక్కడా సరఫరా పూర్తిగా నిలిచిన ఘటన నమోదు కాలేదని తెలిపారు.

కానీ భయాందోళనల కారణంగా బుకింగ్‌లు అనేక రెట్లు పెరిగాయని సుజాత శర్మ చెప్పారు. భయంతో బుకింగ్ చేయవద్దని పౌరులను కోరారు. ప్రాధాన్యం ఆధారంగా కమర్షియల్ సిలిండర్లు పంపిణీ జరిగేందుకు లబ్ధిదారుల జాబితా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యర్థన పంపినట్టు తెలిపారు.

ప్రతి త్రైమాసికంలో రాష్ట్రాలకు దాదాపు లక్ష కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపును ప్రభుత్వం చేస్తుందని ఆమె తెలిపారు. ఇవాళ ఉత్తర్వు విడుదల చేసి మరో 48,000 కిలోలీటర్ల కిరోసిన్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తున్నామని చెప్పారు.

ఇప్పుడు ఎల్పీజీ ఉత్పత్తి 28 శాతానికి పెరిగిందని శర్మ తెలిపారు. దేశవ్యాప్తంగా భారీ రిటైల్ అవుట్‌లెట్ నెట్‌వర్క్ ఉందని చెప్పారు. దాదాపు లక్ష రిటైల్ అవుట్‌లెట్లు దేశంలో పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిలో ఎక్కువ భాగం ప్రజా రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధీనంలో ఉన్నాయని చెప్పారు. ఏ రిటైల్ అవుట్‌లెట్ వద్ద కూడా సరఫరా పూర్తిగా నిలిచిన ఘటన నమోదు కాలేదని తెలిపారు.

భయంతో సిలిండర్ బుకింగ్‌లు
ఎల్పీజీ కొరతపై భయాందోళనలు దేశవ్యాప్తంగా రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నాయి. వినియోగదారులు భయంతో గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి సిలిండర్లు బుక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వంట గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయ ప్రయత్నాలు అరికట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు, గ్యాస్‌ కొరత కారణంగా దేశంలో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూసేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. దేశంలో ఇంధన కొరత లేదని ఇవాళ లోక్‌సభలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement