టెహ్రాన్: యుద్ధం వేళ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తాబా ఖమేనీ మొట్టమొదటిసారి అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. హోర్ముజ్ జలసంధి మూసివేతను ఒత్తిడి పెంచే సాధనంగా ఉపయోగించాలని తమ అధికారులకు చెప్పారు. గల్ఫ్, అరబ్, పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
మొజ్తాబా ఖమేనీ నియామకం తర్వాత ఆయన నుంచి వచ్చిన ఈ మొట్టమొదటి ప్రకటనను ఆ దేశ టెలివిజన్‌లో గురువారం చదివారు. ఖమెనీ కెమెరా ముందు కనిపించలేదు. యుద్ధం ప్రారంభంలో ఆయన గాయపడ్డారని ఇజ్రాయెల్ అంచనా వేసిన విషయం తెలిసిందే. ఖమేనీ ఇప్పుడు కూడా ఏ మాత్రం తగ్గకుండా గల్ఫ్, అరబ్ పొరుగు దేశాలపై దాడులు కొనసాగుతాయని చెప్పారు. అమెరికా సైనిక స్థావరాలను మూసివేయాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.
మరోవైపు, ఇవాళ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై పలు డ్రోన్ల దాడి జరిగింది. దీనిపై కువైట్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ప్రకటన చేసింది. భౌతిక నష్టాన్ని మాత్రమే కలిగించిందని చెప్పింది. పూర్తి సమన్వయంతో వ్యవహరించి సమస్యను అధికారులు పరిష్కరించారని చెప‍్పింది.
అలాగే, బహ్రెయిన్, కువైట్, యూఏఈ, సౌదీ అరేబియాపై దాడులకు ఇరాన్ యత్నించింది. విదేశీ చమురు ట్యాంకర్లనూ లక్ష్యంగా చేసుకుంటోంది. దీంతో ఇరాక్ అప్రమత్తమై పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. చమురు పోర్టు కార్యకలాపాలను మూసివేసినట్లు ప్రకటించింది.
చమురు ధరలపై ఇవాళ ఉదయం ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలో చమురు బ్యారెల్ ధర 200 డాలర్లకు చేరుకుంటుందని, ప్రపంచం దానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.


