ఇరాన్ యుద్ధంలో ఇప్పుడు సముద్రపు మందుపాతరలు కీలకపాత్ర పోషించబోతున్నాయా? అమెరికా నౌకాదళం కోసం ఇరాన్ సముద్రంలో మైన్లు అమర్చిందా? హోర్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ఇరాన్ ఈ నయా బాంబులపైనే ఆధారపడిందా? అందుకే ట్రంప్ ఇప్పుడు సముద్రపు మందుపాతరల గురించి మాట్లాడుతున్నారా?
అమెరికా కాంగ్రెస్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఇరాన్ వద్ద 5,000 నుంచి 6,000 వరకు నౌకాదళ మైన్లు ఉన్నాయని ఈ రిపోర్ట్ బాంబు పేల్చింది. అవసరమైతే ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిలో నౌకాయానాన్ని అడ్డుకునే సామర్థ్యం ఇరాన్‌కు ఉందని ఆ నివేదిక చెబుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రపంచ చమురు సరఫరాను అడ్డుకోవడానికి ఇరాన్ క్షిపణుల కంటే నౌకాదళ మైన్లపైనే ఎక్కువగా ఆధారపడిందని తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధి చాలా తక్కువ లోతుతో ఉండటంతో పాటు, అక్కడి నౌకాయాన మార్గాల వెడల్పు 2 మైళ్లు మాత్రమే. దీంతో ఈ మార్గంలో మందుపాతరలు అమరిస్తే.. నౌకల రాకపోకలు సులభంగా నిలిచిపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
మూడు రకాల సముద్రపు మందుపాతరలు
అమెరికన్ కాంగ్రెస్ నివేదిక ప్రకారం… ఇరాన్ వద్ద ప్రముఖంగా మూడు రకాల సముద్రపు మందుపాతరలు ఉన్నాయి. ఇందులో లింపెట్ మైన్లు ముఖ్యమైనవి. వీటిని నౌకల గోడలకు అతికిస్తారు. టైమర్ సెట్ చేస్తే ఇవి తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ఇక సముద్రంలో తేలియాడుతూ… నౌకలు తాకగానే పేలపోయే మూర్డ్ మైన్లు మరింతప్రమాదకరమైనవి. ఇవిఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి అంతకంటే చాలా చవకైనవి.
ఇక నీటి అడుగు భాగంలో ఉండి… నౌక వీటిపైనుంచి వెళ్లగానే సెన్సార్‌ల సహాయంతో పేలిపోయేవి బాటమ్ మైన్లు. ఇవి శబ్దం, ఒత్తిడితో పాటు అయస్కాంతం తరంగాలను పసిగట్టి వెంటనే పేలిపోతుంది. వీటిని ఎలాంటి రాడార్‌లు పసిగట్టలేవు. వీటితో పాటు అత్యంత ప్రమాదకరమైన కొన్ని మైన్లు నౌక కింద నుంచి రాకెట్ వార్‌హెడ్‌ను పైకి కాల్చి నౌక బాడీని దెబ్బతీయగలవు అని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ మూడు రకాల మైన్లతో హోర్ముజ్ జలసంధిని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఇరాన్ యోచిస్తోంది.
హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ సీ మైన్లు
ఈ మైన్లు చౌకగా తయారవుతాయి, గుర్తించడం చాలా కష్టం, తొలగించడం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. కీలక మార్గాల్లో కేవలం కొన్ని వందల మైన్లు వేస్తేనే ప్రపంచ సముద్ర మార్గాల ద్వారా వెళ్లే చమురు రవాణాలో 20 నుంచి 30 శాతం వరకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా గూఢచారి వర్గాల సమాచారం ప్రకారం, హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ కొంతమేర మైన్లు ఏర్పాటు చేయడం ప్రారంభించినట్లు సంకేతాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ చర్యలు పరిమిత స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ముడి చమురు రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారా జరుగుతుంది. అందువల్ల హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన మార్గంగా భావిస్తున్నారు.
చదవండి: భారత జెండాలతో ఉన్న నౌకలకు ఇరాన్ అనుమతి
ఇక ఈ పరిస్థితిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ మైన్లు వేసి ఉంటే వాటిని వెంటనే తొలగించాల్సిందే అని హెచ్చరించారు.


