అమెరికాకు ఇరాన్ షాక్‌: 12 రోజుల్లో వేల కోట్ల సైనిక సంపత్తి బుగ్గి | How Much Damage Has Iran Inflicted On US In 12 Days Of War, US Bases Struck, Hundreds Wounded And Billion Dollar Losses Reported | Sakshi
Sakshi News home page

అమెరికాకు ఇరాన్ షాక్‌: 12 రోజుల్లో వేల కోట్ల సైనిక సంపత్తి బుగ్గి

Mar 12 2026 11:15 AM | Updated on Mar 12 2026 11:57 AM

How much damage has Iran inflicted on US in the 12 day war

వాషింగ్టన్: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై 12 రోజులు గడుస్తున్న తరుణంలో, అగ్రరాజ్యానికి భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యుద్ధం మొదలైన తొలిరోజే ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని అమెరికా మట్టుబెట్టినప్పటికీ, ఆ తర్వాత ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడులు అమెరికా రక్షణ వ్యవస్థలను కలవరపెడుతున్నాయి. గడిచిన 12 రోజుల్లో ఇరాన్ జరిపిన ఎదురుదాడుల్లో 8 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా, సుమారు 140 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పశ్చిమాసియాలో అమెరికాకు ఉన్న 22కు పైగా సైనిక, విమానయాన కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ వేల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ‘ది న్యూయార్క్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. అమెరికాకు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ, 11 ప్రధాన సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, కువైట్‌లోని అలీ అల్ సలేం, బహ్రెయిన్‌లోని యూఎస్ నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఖతార్‌లోని ‘అల్ ఉదైద్’ ఎయిర్ బేస్ సైతం ఇరాన్ ప్రతీకారేచ్ఛ నుంచి తప్పించుకోలేకపోయింది. టర్కీలోని ఇంసిర్లిక్ వైమానిక కేంద్రంపైకి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని నాటో దళాలు అడ్డుకున్నప్పటికీ, ఇరాన్ మాత్రం తాము టర్కీపై దాడి చేయలేదని ఖండించడం గమనార్హం.

సైనిక కేంద్రాలే కాకుండా, ఇరాన్ తన దాడులను అమెరికా రాయబార కార్యాలయాల వైపు మళ్లించింది. ఇజ్రాయెల్ సహా ఆరు దేశాల్లోని అమెరికా ఎంబసీలపై డ్రోన్ దాడులు జరిగాయి. కువైట్, ఇరాక్‌లోని కార్యాలయాలు స్వల్పంగా దెబ్బతినగా, భద్రతా కారణాల దృష్ట్యా ఆరు దేశాల్లోని దౌత్య కార్యాలయాలను అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. ఈ యుద్ధంలో అమెరికా మూడు ఎఫ్-15ఈ (F-15E) స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలను కోల్పోయింది. అయితే ఇవి ఇరాన్ దాడుల్లో కాకుండా, కువైట్ వాయుసేన చేసిన పొరపాటు వల్ల కూలిపోవడం గమనార్హం. ఇరాన్ విమానాలుగా భ్రమపడి కువైట్ ఎఫ్-18 విమానాలు వీటిని పేల్చివేశాయి.

వీటితో పాటు 11 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు కూడా ధ్వంసమయ్యాయి. ఒక్కో డ్రోన్ విలువ సుమారు రూ. 250 కోట్లు కావడం గమనార్హం. మరోవైపు సుమారు రూ. 22 వేల కోట్ల విలువైన థాడ్ (THAAD) రక్షణ వ్యవస్థల్లోని రాడార్ కేంద్రాలను కూడా ఇరాన్ డ్రోన్లు విజయవంతంగా లక్ష్యం చేసుకున్నాయి. యుద్ధం కారణంగా అమెరికా ఖజానాపై పెను భారం పడుతోంది. 'పొలిటికో' నివేదిక ప్రకారం, అగ్రరాజ్యం ఈ యుద్ధం కోసం రోజుకు సుమారు 2 బిలియన్ డాలర్లు (రూ. 17 వేల కోట్లు) ఖర్చు చేస్తోంది. కేవలం మొదటి వారంలోనే రూ. 51 వేల కోట్లు ఖర్చయినట్లు అంచనా. ఒకవైపు ఆయుధ సంపత్తి తరిగిపోతుండటం, మరోవైపు పెరుగుతున్న వ్యయం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ ప్రయోగించే చౌకైన 'షాహెద్' డ్రోన్లను అడ్డుకోవడానికి లక్షల డాలర్ల విలువైన క్షిపణులను వాడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో నిరాకరించిన ఉక్రెయిన్ యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఇప్పుడు అమెరికా కోరుతుండటం గమనార్హం.

ఇది కూడా చదవండి: అమెరికాపై ఇరాన్ డ్రోన్ పంజా?
 

Advertisement
 
Advertisement
Advertisement