అమెరికాపై ఇరాన్ డ్రోన్ పంజా? | FBI warns Iran aspired to attack California with drones | Sakshi
Sakshi News home page

అమెరికాపై ఇరాన్ డ్రోన్ పంజా?

Mar 12 2026 8:45 AM | Updated on Mar 12 2026 8:51 AM

FBI warns Iran aspired to attack California with drones

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాపై ప్రతీకార దాడులకు ఇరాన్ కుట్ర పన్నుతోందా? సముద్ర మార్గం ద్వారా డ్రోన్లతో విరుచుకుపడేందుకు ప్రణాళికలు రూపొందించిందా?.. దీనికి అవుననే సమాధానాన్ని ఇస్తున్నాయి అమెరికా నిఘా వర్గాలు. ఇరాన్ తీర ప్రాంతాల నుంచి కాకుండా, అమెరికా గడ్డకు అత్యంత సమీపంలోని అంతర్జాతీయ జలాల నుంచే డ్రోన్ దాడులు చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతోందనే సంచలన విషయాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)వెల్లడించింది. పశ్చిమ తీరంలోని కాలిఫోర్నియా లక్ష్యంగా ఈ దాడులు జరిగే అవకాశం ఉందని ఒక అంతర్గత బులెటిన్‌లో పేర్కొంది.

ఎఫ్‌బీఐ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 2026 ప్రారంభం నుంచే ఇరాన్ ఈ వ్యూహాన్ని అమలు చేయాలని భావించింది. గుర్తుతెలియని నౌకల ద్వారా అమెరికా ప్రాదేశిక జలాల సమీపానికి చేరుకుని, అక్కడి నుంచి మానవరహిత విమానాల ద్వారా కాలిఫోర్నియాలోని కీలక ప్రాంతాలపై ఆకస్మిక దాడులు చేయడమే ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇరాన్ భూభాగంపై అమెరికా దాడులు చేస్తే, దానికి ప్రతిగా ఈ ‘డ్రోన్ వార్’ను మొదలుపెట్టాలని టెహ్రాన్ యోచిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే ఈ దాడులు ఎప్పుడు జరుగుతాయి? ఖచ్చితమైన లక్ష్యాలు ఏవి? అనే అంశాలపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌బీఐ సూచించింది.

ప్రస్తుతం ట్రంప్ యంత్రాంగం ఇరాన్ లక్ష్యంగా చేపట్టిన దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. గత 12 రోజులుగా ఇరుపక్షాల మధ్య జరుగుతున్న పోరులో ఇరాన్ తన డ్రోన్ సామర్థ్యాన్ని ఇప్పటికే ప్రదర్శించింది. అయితే తాజాగా అమెరికా జరిపిన దాడులతో ఇరాన్ సామర్థ్యం కొంతమేర తగ్గినట్లు నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ, అమెరికా పశ్చిమ తీరంలో ఎల్.ఏ. షెరీఫ్ విభాగం అప్రమత్తమైంది. మతపరమైన కట్టడాలు, సాంస్కృతిక కేంద్రాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసింది.

ఇది కూడా చదవండి: ట్రంప్ మరో సంచలన నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement