ఏఐ పిటిషన్.. వ్యాపారికి సీజేఐ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ | SC junks AI drafted PIL of Ludhiana cloth trader | Sakshi
Sakshi News home page

ఏఐ పిటిషన్.. వ్యాపారికి సీజేఐ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Mar 11 2026 11:23 AM | Updated on Mar 11 2026 11:36 AM

SC junks AI drafted PIL of Ludhiana cloth trader

న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసి, కోర్టులో కనీస న్యాయ పరిభాషను చదవలేకపోయిన ఒక వస్త్ర వ్యాపారికి సుప్రీంకోర్టులో పరాభవం ఎదురైంది. ‘వెళ్లి లూధియానాలో మరో రెండు మూడు స్వెటర్లు అమ్ముకో.. ఇలాంటి పిటిషన్లు వేస్తే భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది’ అంటూ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఆ పిటిషన్‌ను కొట్టివేశారు.

పంజాబ్‌లోని లూధియానాకు చెందిన హోజరీ వ్యాపారి రజనీష్ సిద్ధూ 'పీఎం కేర్స్' (PM CARES) నిధికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో సిద్ధూ స్వయంగా వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు. అయితే ఆయన ఇంగ్లీష్‌లో ఉన్న పిటిషన్‌ను చూసి చదువుతుండటం గమనించిన ధర్మాసనం ఆయన నేపథ్యంపై ఆరా తీసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌తో పాటు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన బెంచ్, సిద్ధూ చదువు గురించి ప్రశ్నించింది.

గతంలో ఎప్పుడూ పిటిషన్ వేయలేదని, నేరుగా సుప్రీంకోర్టుకే వచ్చానని ఆయన చెప్పడంతో సీజేఐ వ్యంగ్యంగా స్పందించారు. ‘చాలా ధైర్యవంతుడివి.. నేరుగా లూధియానా నుండి సుప్రీంకోర్టుకు వచ్చావా? నీకు ఇక్కడే ఇంగ్లీష్ పరీక్ష పెడతాను. అందులో కనీసం 30 శాతం మార్కులు సాధించినా నువ్వే ఈ పిటిషన్ రాశావని నమ్ముతాను’ అని వ్యాఖ్యానించారు. పిటిషన్‌లో పేర్కొన్న 'ఫిడ్యూషియరీ రిస్క్ ఆఫ్ కార్పొరేట్ డోనర్స్' (Fiduciary Risk of Corporate Donors) అనే పదానికి అర్థం చెప్పాలని సీజేఐ కోరగా, సిద్ధూ నీళ్లు నమిలాడు.

తన నోట్స్ చూసి చెప్పడానికి ప్రయత్నించగా.. ‘మిస్టర్ సిద్ధూ, ఇది ఎవరో న్యాయవాది రాసి ఇచ్చింది. నువ్వు కేవలం స్క్రిప్ట్ చదువుతున్నావు’ అని సీజేఐ అడ్డుకున్నారు. దీనిపై పంజాబ్ విజిలెన్స్ బ్యూరోతో విచారణ జరిపిస్తామని హెచ్చరించడంతో సిద్ధూ అసలు విషయం బయటపెట్టారు. సుప్రీంకోర్టు ఆవరణలోని ఒక టైపిస్ట్ తనకు సహాయం చేశాడని, అతనికి గంటకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తూ, నాలుగు జాకెట్లు బహుమతిగా ఇచ్చానని చెప్పారు. తాను న్యాయవాదిని పెట్టుకోలేక, మూడు నాలుగు రకాల ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ టూల్స్‌ ఉపయోగించి ఈ పిటిషన్‌ను రూపొందించానని అంగీకరించాడు.

సాంకేతికతను తప్పుగా వాడుకుంటూ, కోర్టు సమయాన్ని వృథా చేసే పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు ఆర్థిక జరిమానాలు కూడా తప్పవని హెచ్చరిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కాగా, సోమవారం కూడా ఇదే బెంచ్.. ఉల్లి, వెల్లుల్లిలో ‘తామసగుణం’ ఉంటుందా అనే అంశంపై వచ్చిన పిటిషన్‌తో సహా ఐదు  ఉపయుక్తంకాని వ్యాజ్యాలను కొట్టివేసింది.

ఇది కూడా చదవండి: మధ్యవర్తిత్వంపై ఖతార్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement