breaking news
cloth marchant
-
ఏఐ పిటిషన్.. వ్యాపారికి సీజేఐ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసి, కోర్టులో కనీస న్యాయ పరిభాషను చదవలేకపోయిన ఒక వస్త్ర వ్యాపారికి సుప్రీంకోర్టులో పరాభవం ఎదురైంది. ‘వెళ్లి లూధియానాలో మరో రెండు మూడు స్వెటర్లు అమ్ముకో.. ఇలాంటి పిటిషన్లు వేస్తే భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది’ అంటూ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఆ పిటిషన్‌ను కొట్టివేశారు.పంజాబ్‌లోని లూధియానాకు చెందిన హోజరీ వ్యాపారి రజనీష్ సిద్ధూ 'పీఎం కేర్స్' (PM CARES) నిధికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో సిద్ధూ స్వయంగా వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు. అయితే ఆయన ఇంగ్లీష్‌లో ఉన్న పిటిషన్‌ను చూసి చదువుతుండటం గమనించిన ధర్మాసనం ఆయన నేపథ్యంపై ఆరా తీసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌తో పాటు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన బెంచ్, సిద్ధూ చదువు గురించి ప్రశ్నించింది.గతంలో ఎప్పుడూ పిటిషన్ వేయలేదని, నేరుగా సుప్రీంకోర్టుకే వచ్చానని ఆయన చెప్పడంతో సీజేఐ వ్యంగ్యంగా స్పందించారు. ‘చాలా ధైర్యవంతుడివి.. నేరుగా లూధియానా నుండి సుప్రీంకోర్టుకు వచ్చావా? నీకు ఇక్కడే ఇంగ్లీష్ పరీక్ష పెడతాను. అందులో కనీసం 30 శాతం మార్కులు సాధించినా నువ్వే ఈ పిటిషన్ రాశావని నమ్ముతాను’ అని వ్యాఖ్యానించారు. పిటిషన్లో పేర్కొన్న 'ఫిడ్యూషియరీ రిస్క్ ఆఫ్ కార్పొరేట్ డోనర్స్' (Fiduciary Risk of Corporate Donors) అనే పదానికి అర్థం చెప్పాలని సీజేఐ కోరగా, సిద్ధూ నీళ్లు నమిలాడు.తన నోట్స్ చూసి చెప్పడానికి ప్రయత్నించగా.. ‘మిస్టర్ సిద్ధూ, ఇది ఎవరో న్యాయవాది రాసి ఇచ్చింది. నువ్వు కేవలం స్క్రిప్ట్ చదువుతున్నావు’ అని సీజేఐ అడ్డుకున్నారు. దీనిపై పంజాబ్ విజిలెన్స్ బ్యూరోతో విచారణ జరిపిస్తామని హెచ్చరించడంతో సిద్ధూ అసలు విషయం బయటపెట్టారు. సుప్రీంకోర్టు ఆవరణలోని ఒక టైపిస్ట్ తనకు సహాయం చేశాడని, అతనికి గంటకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తూ, నాలుగు జాకెట్లు బహుమతిగా ఇచ్చానని చెప్పారు. తాను న్యాయవాదిని పెట్టుకోలేక, మూడు నాలుగు రకాల ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ టూల్స్ ఉపయోగించి ఈ పిటిషన్‌ను రూపొందించానని అంగీకరించాడు.సాంకేతికతను తప్పుగా వాడుకుంటూ, కోర్టు సమయాన్ని వృథా చేసే పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు ఆర్థిక జరిమానాలు కూడా తప్పవని హెచ్చరిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కాగా, సోమవారం కూడా ఇదే బెంచ్.. ఉల్లి, వెల్లుల్లిలో ‘తామసగుణం’ ఉంటుందా అనే అంశంపై వచ్చిన పిటిషన్‌తో సహా ఐదు ఉపయుక్తంకాని వ్యాజ్యాలను కొట్టివేసింది.ఇది కూడా చదవండి: మధ్యవర్తిత్వంపై ఖతార్ కీలక వ్యాఖ్యలు -
‘బంగ్లా’పై ట్రంప్ కరుణ.. కీలక రంగానికి సుంకాల ఎత్తివేత!
ఢాకా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్‌పై అపార కరుణ చూపించారు. ఈ ఇరు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బంగ్లాదేశ్ నుండి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై సుంకాలను 19 శాతానికి తగ్గించారు. గత ఏడాది ఏప్రిల్‌లో అమెరికా తొలుత 37 శాతం సుంకాన్ని ప్రతిపాదించగా, సుదీర్ఘ చర్చల దరిమిలా గత ఆగస్టులో దానిని 20 శాతానికి తగ్గించారు. ఇప్పుడు తాజా ఒప్పందంతో ఇది మరింత తగ్గి 19 శాతానికి చేరుకుంది.ముఖ్యంగా అమెరికా ముడి పదార్థాలను (కాటన్, కృత్రిమ నూలు) ఉపయోగించి, బంగ్లాదేశ్‌లో తయారు చేసే దుస్తులకు సుంకాల నుండి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా బంగ్లాదేశ్ కూడా అమెరికా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు తమ మార్కెట్లో ప్రాధాన్యత కల్పించేందుకు అంగీకరించింది. రసాయనాలు, వైద్య పరికరాలు, యంత్రాలు, మోటార్ వాహనాలు, వాటి విడిభాగాలతో పాటు సోయా, డెయిరీ, బీఫ్, పౌల్ట్రీ వంటి అమెరికా ఆహార ఉత్పత్తులకు బంగ్లాదేశ్‌లో మార్కెట్ ఏర్పడనున్నది. అమెరికా ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్‌డీఏ) ధృవీకరణలను ఇకపై బంగ్లాదేశ్ గుర్తించనుంది.రాబోయే 15 ఏళ్లలో అమెరికా నుండి సుమారు 15 బిలియన్ డాలర్ల(రూ.1,36,063 కోట్లు) విలువైన ఇంధన ఉత్పత్తులను, 3.5 బిలియన్ డాలర్ల(రూ.31,748 కోట్లు) వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది. విమానయాన రంగంలో ‘బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్’ అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుండి 14 కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. వీటితో పాటు అదనపు ఆర్డర్లకు కూడా అవకాశం ఉంది. రక్షణ రంగంలో సైతం బంగ్లాదేశ్ అమెరికా నుండి సైనిక పరికరాలను కొనుగోలు చేయనుంది. అంతర్జాతీయ కార్మిక హక్కులు, పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలను పాటించేందుకు కట్టుబడి ఉంటున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది.సుదీర్ఘ చర్చల దరిమిలా కుదిరిన ఈ ఒప్పందాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్వాగతించారు. ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి జామీసన్ గ్రీర్ మాట్లాడుతూ, అమెరికా ఎగుమతిదారులకు కొత్త అవకాశాలను సృష్టించడంలో , వాణిజ్య అడ్డంకులను తొలగించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో 80 శాతం వాటా కలిగిన వస్త్ర రంగం ఈ ఒప్పందంతో మరింత బలోపేతం కానుంది. అమెరికా ముడిపదార్థాలు వినియోగించి తయారు చేసే వస్త్రాలకు సుంకం ఎత్తివేయడం బంగ్లాదేశ్‌కు భారీ ఊరటనిచ్చే అంశంగా మారింది. ఇది కూడా చదవండి: మమతతో కట్.. లెఫ్ట్‌తో బ్రేక్: కాంగ్రెస్ సరికొత్త గేమ్! -
‘ఈద్‌ను ఇలా ఎందుకు జరుపుకోకూడదు’
తిరువనంపురం: సోమవారం దేశ వ్యాప్తంగా ప్రజలు సంతోషంగా ఈద్ పండుగ జరుపుకుంటుంటే.. కేరళ వాసులు మాత్రం సొంత ఇంటికి దూరంగా.. సహాయక శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరదల మూలానా సొంత ఇంటికి, ఊరికి దూరమయ్యారు. మరి పండుగ అంటే అందరం సంతోషంగా ఉండాలి కదా. వరద బాధితులు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని భావించాడు కొచ్చికి చెందిన నౌషద్. అందుకోసం అతడు చేసిన పని ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటుంది. వరద బాధితులకు, అనాథ శరణాలయాలకు సాయం చేయాలన్నప్పుడు వాడేసిన బట్టలు, వస్తువులు ఇస్తూ ఉంటాం. కానీ నౌషద్ మాత్రం తన వ్యాపార నిమిత్తం తీసుకొచ్చిన కొత్త బట్టలను వరద బాధితులకు అందించి వారి ముఖాల్లో సంతోషం తీసుకొచ్చాడు. ఆ వివరాలు.. నౌషద్ కొచ్చిలో చిన్న బట్టల దుకాణం నడుపుతున్నాడు. ఈద్ పండుగ సందర్భంగా అమ్మకం నిమిత్తం కొత్త స్టాక్ తెచ్చాడు. ప్రస్తుతం కేరళ పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలుసు. భారీ వర్షాలతో జనం ఉన్న చోటును వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. వరద బాధితులను ఆదుకోమంటూ సామాజిక, స్వచ్ఛంద సేవా సంస్థలు బట్టలు, ఆహార పదార్ధాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నౌషద్ వ్యాపార నిమిత్తం తెచ్చిన కొత్త బట్టలను వరద బాధితులకు అంద జేశాడు. నౌషద్ చేసిన పని ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ విషయం గురించి నౌషద్ మాట్లాడుతూ.. ‘చనిపోయాక ఈ లోకం నుంచి ఏం తీసుకెళ్లం. నా లాభం కొందరి పేదల కళ్లలో సంతోషం కోసం వినియోగించాను. ఈద్‌ను ఇలా ఎందుకు జరుపుకోకూడదు అనిపించింది. అందుకే లాభనష్టాల గురించి ఆలోచించకుండా వ్యాపారం కోసం తెచ్చిన కొత్త బట్టలను వరద బాధితుల కోసం పంపించాను. ఈ ఈద్ నాకు సంతోషాన్ని మిగిల్చింది’ అంటున్నారు నౌషద్. ఫేస్బుక్లో పోస్ చేసిన ఈ స్టోరి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. -
బతుకుదెరువు కోసం వచ్చి మృత్యువాత
– పాముకాటుతో ప్రకాశం జిల్లావాసి మృతి పత్తికొండ టౌన్: బతుకుదెరువు కోసం ఊరూరు తిరుగుతూ దుస్తులు అమ్ముకునే ప్రకాశం జిల్లాకు చెందిన చిరువ్యాపారి గోదిన వెంకటేశ్వర్లు(44).. బుధవారం తెల్లవారుజామున పాముకాటుతో పత్తికొండలో మృతి చెందాడు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన ఇతనితోపాటు మరో నలుగురు కొన్నిరోజుల క్రితం పత్తికొండకు వచ్చారు. ఆదోనిరోడ్డులో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని వస్త్ర వ్యాపారం చేసేవారు. టీవీఎస్ మోపెడ్‌పై గ్రామాలకు వెళ్లి దుస్తులు అమ్మి.. రాత్రి పత్తికొండలోని అద్దె ఇంట్లో ఉండేవారు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న వెంకటేశ్వర్లును పాము కరిచింది. వెంటనే లేచిన వెంకటేశ్వర్లు తనను ఏదో కుట్టిందని తనతో పాటు ఉన్నవారికి చెప్పడంతో వారు చూడగా పరుపులో పాము కనిపించింది. పామును వారి చంపివేశారు. వెంకటేశ్వర్లును పక్కనే ఉన్న ఒక ప్రైవేటు నర్సింగ్‌హోంకు తీసుకెళ్లగా వైద్యసిబ్బంది సకాలంలో స్పందించలేదు. ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే వెంకటేశ్వర్లు మృతిచెందాడు. మృతుడు వెంకటేశ్వర్లుకు భార్య రమణమ్మ, ఇద్దరు కుమార్తెలు లక్ష్మీత్రివేణి, లక్ష్మీత్రిష, ఒక కుమారుడు వెంకట గోపీచంద్ ఉన్నారు. ఆయన మృతితో వారి కుటుంబం జీవనాధారం కోల్పోయింది. పోస్టుమార్టం అనంతరం వెంకటేశ్వర్లు మృతదేహాన్ని బంధువులకు అప్పగించి.. పత్తికొండ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


