వైరలవుతోన్న కేరళ చిరువ్యాపారి సాయం

Noushad Is Winning Hearts In Flood Hit Kerala - Sakshi

తిరువనంపురం: సోమవారం దేశ వ్యాప్తంగా ప్రజలు సంతోషంగా ఈద్‌ పండుగ జరుపుకుంటుంటే.. కేరళ వాసులు మాత్రం సొంత ఇంటికి దూరంగా.. సహాయక శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరదల మూలానా సొంత ఇంటికి, ఊరికి దూరమయ్యారు. మరి పండుగ అంటే అందరం సంతోషంగా ఉండాలి కదా. వరద బాధితులు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని భావించాడు కొచ్చికి చెందిన నౌషద్‌. అందుకోసం అతడు చేసిన పని ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటుంది.

వరద బాధితులకు, అనాథ శరణాలయాలకు సాయం చేయాలన్నప్పుడు వాడేసిన బట్టలు, వస్తువులు ఇస్తూ ఉంటాం. కానీ నౌషద్‌ మాత్రం తన వ్యాపార నిమిత్తం తీసుకొచ్చిన కొత్త బట్టలను వరద బాధితులకు అందించి వారి ముఖాల్లో సంతోషం తీసుకొచ్చాడు. ఆ వివరాలు.. నౌషద్‌ కొచ్చిలో చిన్న బట్టల దుకాణం నడుపుతున్నాడు. ఈద్‌ పండుగ సందర్భంగా అమ్మకం నిమిత్తం కొత్త స్టాక్‌ తెచ్చాడు. ప్రస్తుతం కేరళ పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలుసు. భారీ వర్షాలతో జనం ఉన్న చోటును వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. వరద బాధితులను ఆదుకోమంటూ సామాజిక, స్వచ్ఛంద సేవా సంస్థలు బట్టలు, ఆహార పదార్ధాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నౌషద్‌ వ్యాపార నిమిత్తం తెచ్చిన కొత్త బట్టలను వరద బాధితులకు అంద జేశాడు. నౌషద్‌ చేసిన పని ప్రస్తుతం సోషల్‌​మీడియాలో తెగ వైరలవుతోంది.

ఈ విషయం గురించి నౌషద్‌ మాట్లాడుతూ.. ‘చనిపోయాక ఈ లోకం నుంచి ఏం తీసుకెళ్లం. నా లాభం కొందరి పేదల కళ్లలో సంతోషం కోసం వినియోగించాను. ఈద్‌ను ఇలా ఎందుకు జరుపుకోకూడదు అనిపించింది. అందుకే లాభనష్టాల గురించి ఆలోచించకుండా వ్యాపారం కోసం తెచ్చిన కొత్త బట్టలను వరద బాధితుల కోసం పంపించాను. ఈ ఈద్‌ నాకు సంతోషాన్ని మిగిల్చింది’ అంటున్నారు నౌషద్‌. ఫేస్‌బుక్‌లో పోస్‌ చేసిన ఈ స్టోరి ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top