నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఈ సందర్భంగా స్ఫూర్తిదాయక మహిళలను గుర్తుచేసుకోవడం మన కర్తవ్యం. కేరళకు చెందిన రేవతి విజయన్ ఓ వైపు ఉన్నత చదువుల కోసం ‘పరిశోధన’ సాగిస్తూ, మరోవైపు కుటుంబాన్ని ఆదుకునేందుకు అర్ధరాత్రి వరకు ఇడ్లీల వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఒట్టపాలం మయన్నూర్ వంతెన సమీపంలో రాత్రిపూట రోడ్డు పక్కన ఆమె నడుపుతున్న చిన్నపాటి ఇడ్లీ స్టాల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది.
త్రిస్సూర్ జిల్లా పజయన్నూర్ నివాసి అయిన 30 ఏళ్ల రేవతికి చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో మక్కువ. తండ్రి విజయన్ టైలర్ కాగా, తల్లి ప్రియ పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తున్నారు. త్రిస్సూర్‌లోని విమల కళాశాలలో మలయాళంలో డిగ్రీ, అనంతరం ఒట్టపాలం ఎన్ఎస్ఎస్ కళాశాలలో రేవతి బీఈడీ పూర్తి చేశారు. తన చదువు ఖర్చుల కోసం కుటుంబంపై భారం పడకూడదనే ఉద్దేశంతో రేవతి ట్యూషన్లు చెబుతూ, ఆర్థిక స్వాలంబన సాధించారు.
వివాహం, ఇద్దరు పిల్లల బాధ్యతల మధ్య తన విద్యాభ్యాసం ఆగిపోతుందేమోనని రేవతి ఆందోళన చెందారు. అయితే తిరిగి పుస్తకం చేత పట్టి, పీజీ పూర్తి చేయడమే కాకుండా, గోల్డ్ మెడలిస్ట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొదటి ప్రయత్నంలోనే ‘నెట్’ (NET) అర్హత సాధించారు. అనంతరం రేవతికి పీహెచ్‌డీ చేసే అవకాశం లభించింది. అయితే ఇందుకోసం ప్రతిరోజూ పజయన్నూర్ నుంచి త్రిస్సూర్ వరకు ప్రయాణించడం ఆర్థికంగా భారమైంది. దీంతో రాత్రిపూట ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న రేవతి మయన్నూర్ వంతెన వద్ద ‘ఫ్రెష్ మూన్’ పేరుతో ఇడ్లీ స్టాల్ ప్రారంభించారు.
కేవలం సాధారణ ఇడ్లీలే కాకుండా.. తట్టు ఇడ్లీ, మసాలా ఇడ్లీ, ఎగ్ ఇడ్లీ, మటన్ ఇడ్లీ, చికెన్ ఇడ్లీ, పొడి ఇడ్లీ వంటి దాదాపు 10 రకాల వైవిధ్యమైన రుచులతో వినియోగదారుల మనసు గెలుచుకుంటున్నారు. రేవతి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కళాశాలలో పరిశోధన పనుల్లో నిమగ్నమై, సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12:30 గంటల వరకు స్టాల్ దగ్గర కష్టపడుతుంటారు. ఈ ప్రయాణంలో ఆమె భర్త అనూప్, సోదరి గౌరీ నంద ఆమెకు సాయంగా నిలుస్తున్నారు.
ఇది కూడా చదవండి: రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం


