మానవ మృగాల పాశవికం.. మతిస్థిమితం లేని యువతి గర్భిణి | Mentally Challenged Woman Rescued After Being Repeatedly Assaulted, Now Pregnant In Anantapur | Sakshi
Sakshi News home page

మానవ మృగాల పాశవికం.. మతిస్థిమితం లేని యువతి గర్భిణి

Mar 8 2026 10:59 AM | Updated on Mar 8 2026 11:59 AM

teacher rescues pregnant mentally ill woman in anantapur

అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న యువతితో నిర్వాహకులు కృష్ణారెడ్డి, దేవి దంపతులు (చిత్రంలో) ఉపాధ్యాయురాలు శశికళ

మానవ మృగాలు చేసిన గాయాలతో పుండుగా మారిన శరీరం 

 గర్భం దాల్చి రోడ్డున పడ్డ అనాథ
 
 గుర్తించి అనాథాశ్రమానికి చేర్చిన ఉపాధ్యాయురాలు
 
అక్కున చేర్చుకున్న ‘ఆశ్రయ’
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ కలచి వేస్తున్న అభాగ్యురాలి కన్నీటిగాథ 

కొందరు మనుషులు మృగాల కన్నా హీనంగా మారారు. మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మానవ మృగాలు చేసిన గాయాలతో శరీరం పుండుగా మారింది. అయినా వదల్లేదు. తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో గర్భం దాల్చి రోడ్డున అనాథగా     సంచరిస్తున్న  ఆమెను మానవతావాది అయిన ఓ ఉపాధ్యాయురాలు గుర్తించి పోలీసుల సాయంతో అనాథాశ్రమానికి చేర్చింది. ప్రస్తుతం ఆ యువతి నిండు గర్భిణి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఓ అభాగ్యురాలి దీనగాథ పలువురిని కలిచి వేస్తోంది.

అనంతపురం కల్చరల్‌: మతిస్థిమితం లేని యువతిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన ఘటన కళ్యాణదుర్గం ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. అయినా నేటికీ దోషులెవరో బయటపడలేదు. వారు చేసిన పాపం యువతి గర్భంలో పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి.  
అనాథగా రోడ్డుపై సంచరిస్తూ...  
కొన్ని నెలల క్రితం కళ్యాణదుర్గంలోని రహదారులపై మతిస్థిమితం లేకుండా ఒంటరిగా తిరుగుతున్న యువతిని ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శశికళ గమనించింది. పలకరించే ప్రయత్నం చేయడంతో సమాధానం ఇవ్వలేదు. ఆకలిగా ఉందా? అని ప్రశ్నించినా మౌనమే సమాధానమైంది. దీంతో అప్పటికప్పుడు ఆహారాన్ని కొనుగోలు చేసి యువతి చేతికి ఇవ్వడంతో ఎన్నాళ్లుగా ఆకలితో ఉందో తెలియదు కానీ గబగబా మొత్తం తినేసింది. ఆ సమయంలో యువతి బెదురు చూపులు గమనించిన శశికళ... ఆమె ఏదో ప్రమాదంలో ఉందని గ్రహించి, విషయాన్ని వెంటనే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సాయంతో యువతిని అనంతపురం రూరల్‌ పరిధిలోని కాట్నేకాలువలో ఉన్న ఆశ్రయ అనాథాశ్రమానికి చేర్చారు.  

శరీరమంతా పుండుగా మారి..  
మతి స్థిమితం కోల్పోయి బెదురు చూపులతో ఆశ్రమానికి చేరుకున్న యువతిని నిర్వాహకులు కృష్ణారెడ్డి, దేవి దంపతులు అప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. 25 ఏళ్ల వయస్సులోనూ ఆరేళ్ల చిన్నారిలా ప్రవర్తిస్తున్న ఆ యువతిని ఎంత ప్రశ్నించినా తన తల్లిదండ్రులెవరో చెప్పలేని స్థితిలో ఉంది. శరీరంపై గాయాలు ఉండడంతో ఆస్పత్రికి పిలుచుకెళ్లి చూపించారు. ఆ సమయంలో గాయాలను పరిశీలించిన వైద్యులు అవి మానవ మృగాలు చేసినవిగా నిర్ధారించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె గర్భంతో ఉన్నట్లుగా ధ్రువీకరించారు. ఆ సమయంలో అత్యాచారం జరిగిన విషయం గాని తెలియని స్థితిలో యువతి అమాయకంగా చూస్తుండడం గమనించిన వైద్యులు, సిబ్బంది హృదయాలు ద్రవించి పోయాయి. చికిత్స అనంతరం ఆమెను ఆశ్రమానికి చేర్చిన కృష్ణారెడ్డి దంపతులు అప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. పుండుగా మారిన శరీరాన్ని రోజూ శుభ్రం చేస్తూ ఆమెకు పౌష్టికాహారాన్ని అందజేస్తూ వచ్చారు. ప్రస్తుతం యువతి నిండు గర్భిణి. రేపో.. మాపో ప్రసవమయ్యే సూచనలు ఉన్నాయి.  

తలుచుకుంటేనే భయమేస్తోంది 
మానవత్వమున్న ఉపాధ్యాయురాలు గుర్తించి ఈ యువతిని మా ఆశ్రమానికి చేర్చారు. ఆమె ఆశ్రమానికి వచ్చేనాటికి శరీరం మొత్తం పుండుగా మారి ఉంది. మానవ మృగాలు ఎంత పైశాచికంగా పాడు చేశారో తలుచుకుంటేనే భయమేస్తోంది. కనీసం తన తల్లిదండ్రులెవరు అనే విషయం కానీ, తనపై అత్యాచారం జరిగిందనే విషయం గాని ఆమెకు తెలియదు. ఎంతో అమాయకంగా ఉంది. ఆమె భవిష్యత్తు తలుచుకుంటే భయమేస్తోంది.  ఆశ్రమంలో ఎందరో అనాథలు ఉన్నారు. వీరెవ్వరికీ ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు లేవు. వీరి దైన్య స్థితిపై అధికారులు స్పందించి ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు మంజూరు చేస్తే ఆదుకునే అనాథాశ్రమాలకు ఎంతో మేలు చేసిన వారవుతారు.  
– దేవి, ఆశ్రయ అనాథాశ్రమ నిర్వాహకురాలు

ఆమె పరిస్థితి చూసి చలించిపోయాను 
నేను ప్రస్తుతం ఆత్మకూరు మండలం పంపనూరులోని ఎంపీపీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాను. నిరాశ్రయులైన మహిళలెవరైనా కనిపిస్తే అనాథశ్రమాలకు చేరుస్తుంటాను. అలా ఒకసారి కళ్యాణదుర్గంలోని పోలీసుస్టేషన్‌ సమీపంలో డివైడర్‌ వద్ద రెండేళ్లుగా దిక్కు లేకుండా కూర్చొని ఉన్న ఓ యువతి కనిపించింది. ఆ సమయంలో ఆమె పరిస్థితి చూసి చలించిపోయాను. వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయించి, వారి సహకారంతోనే ఆశ్రయ అనాథాశ్రమానికి చేర్చాను. రోజులు గడుస్తుండగా ఆమె శరీరంలో మార్పులు గమనించి వైద్యులకు చూపిస్తే గర్భిణి అని తెలిసింది. ఈ అమానుషంపై ఎవరూ      స్పందించకపోవడం  బాధాకరం. 
– శశికళ, ఉపాధ్యాయురాలు  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement