కుటుంబ బాధ్యత.. ఆర్థిక భరోసా! | musapet woman vaishnavi makeup artist success story | Sakshi
Sakshi News home page

కుటుంబ బాధ్యత.. ఆర్థిక భరోసా!

Mar 8 2026 8:00 AM | Updated on Mar 8 2026 8:00 AM

musapet woman vaishnavi makeup artist success story

మూసాపేట: మహిళలు ఆర్థికంగా ఎదిగనప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుత తరంలో ఎందరో మహిళలు చిన్న ఉద్యోగాల నుంచి రైలు, విమానాలు నడిపిస్తున్నారు. ఉద్యోగాలే కాకుండా వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు. ప్రభుత్వాలు పేద, మద్య తరగతి మహిళలను, చదువురాని మహిళలు కూడా తమ కాళ్లపై నిలబడేవిధంగా ప్రోత్సహిస్తున్నాయి. మూసాపేట పరిసర ప్రాంతాల్లో సమైఖ్య మహిళ గ్రూపులో ఉండి బ్యాంకు లోన్లు తీసుకుని చిన్న, చిన్న వ్యాపారాలు ఎదుగుతూ తోటి వారికి ఆదర్శంగా ఉన్న పలువురి మహిళల గురించి అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.  

లోన్‌తో మేకప్‌ టీచర్‌గా...  
మూసాపేటలో నివాసం ఉండే భాగ్యవతి వైష్ణవి దేవి మహిళ గ్రూపులో 10 మంది మహిళల్లో ఆమె ఒక్కరు. మూడు సంవత్సరాల క్రితం గ్రూపునకు బ్యాంక్‌ లోన్‌ మంజూరైంది. తన భాగానికి వచ్చిన రూ. 60 వేలతో మేకప్‌గా శిక్షణ తీసుకుంది. అనంతరం వాటికి మరికొంత డబ్బు జమ చేసి మేకప్‌ కిట్‌ కొనుగోలు చేసింది. అనంతరం మూసాపేట భవానీనగర్‌లో ఉన్న మేకప్‌ స్టూడియోలో 12 మందికి టీచింగ్‌ చేస్తుంది. బ్యాచ్‌కు 12 మందికి టీచింగ్‌ ఇస్తూ వారిని మేకప్‌ ఆర్టిస్టులుగా తీర్చిదిద్దుతుంది. అంతేగాక ఈవెంట్‌లు, పెళ్లిలకు మేకప్‌లు వేస్తూ నెలకు రూ.50 నుంచి 70వేల వరకు సంపాదిస్తుంది. బ్యాంక్‌ లోన్‌ తానేకడుతూ మేకప్‌లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లేందేకు కృషి చేస్తుంది. ప్రముఖ సింగర్‌ గీత మాధురికి కూడా మేకప్‌ వేసి ఔరా అనిపించింది.  

గోలీసోడా వ్యాపారంలో..  
గోలిసోడా కొడుతూ వ్యాపారంలో రాణిస్తుంది భరత్‌నగర్‌కాలనీకి చెందిన ఎస్‌. సంధ్య. కాలనీలోని కల్వరి మహిళ పొదుపు సంఘంలో పది మందిలో తాను ఒక్కరు. నెలన్నర క్రితం గ్రూపునకు భ్యాంక్‌ లోన్‌ రావడంతో తన భాగం రూ.1.80 లక్షలు వచ్చాయి. వాటితో కొన్ని అప్పులు తీర్చుకుని సుమారు రూ.50వేలతో ఆరెంజ్‌ గోలి సోడా షాపును ఏర్పాటు చేసుకుంది. వేసవికాలంలో గోలిసోడకు ఆదరణ ఉండటంతో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. పిల్లలను స్కూల్‌కు పంపి, భర్తను ఉద్యోగానికి పంపి గోలి సోడా కొడుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు షాపు నడిపిస్తుంది. ఒక్కరి వద్ద ఉద్యోగం చేసే బదులు వ్యాపారం ఎంతో మేలు అని అంటుంది.  

రాజకీయాల్లో రాణిస్తూ బోటిక్‌ నడిపిస్తూ..  
గృహిణిగా పిల్లలు, భర్త బాధ్యతలు చూసుకుంటూనే రాజకీయాలపై మక్కువతో బీఆర్‌ఎస్‌ మహిళ కార్యకర్తగా, సోషల్‌ మీడియా వారియర్‌గా రాణిస్తుంది మూసాపేట జనతానగర్‌కు చెందిన శిరీష. కుట్టు మిషన్స్‌ ఏర్పాటు చేసుకుని శ్రీహర్ష పేరుతో బోటిక్‌ నడిపిస్తుంది. భర్త ఇచ్చిన డబ్బులతో పాటు మూసాపేట మాజీ కార్పొరేటర్‌ తూము శ్రావణ్‌కుమార్‌ రూ. 35వేలతో కుట్టు మిషన్‌ ఇప్పించడంతో షాపును ఏర్పాటు చేసింది. షాపులో ప్రస్తుతం ముగ్గురు పనివారు, నాలుగు కుట్టు మిషన్స్‌ ఏర్పాటు చేసుకుంది. చీరలు అమ్మడంతో పాటు సంక్రాంతికి గాలి పటాలు, దీపావళికి టపాసులు, రాఖీ పౌర్ణమికి రాఖీలు విక్రయిస్తుంది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement