సోషల్ మీడియా, యూట్యూబ్ చూసేవాళ్లకు షన్ను అలియాస్ షణ్ముఖ్ జస్వంత్ గురించి పరిచయం అక్కర్లేదు. 'వైవా' అనే షార్ట్ ఫిలింతో నటుడిగా మొదలైన ఇతడు.. ఇప్పుడు సినిమాలో హీరోగా చేసేంత వరకు వచ్చాడు. అయితే తోటి యూట్యూబర్ దీప్తి సునైనాతో ప్రేమ-బ్రేకప్, బిగ్‌బాస్ 5వ సీజన్‌లో సిరి హనుమంతుతో చేసిన రచ్చ, ఓసారి డ్రగ్స్‌తో దొరికిపోవడం.. ఇలా చాలాసార్లు సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యాడు. గత కొన్నేళ్లుగా పెద్దగా కనిపించని షన్ను.. కొన్నిరోజుల క్రితం వైష్ణవి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చాడు.
(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)
ఇప్పుడు ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన షణ్ముఖ్ జస్వంత్.. గతంలో తనకు జరిగిన చేదు సంఘటనలు, బ్రేకప్, బిగ్‌బాస్ అనుభవం, వైష్ణవితో ప్రేమ-నిశ్చితార్థం ఇలా చాలా విషయాలు గురించి మాట్లాడాడు. మిగతా వాటి సంగతేమో గానీ తనని తాను.. బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని అని చెప్పుకోవడం మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. బ్రేకప్ (దీప్తి సునైనాతో) తర్వాత నిజంగా బాధపడ్డారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ సంగతులు చెప్పుకొచ్చాడు. ఒక టీవీ షోకి వెళ్లకుండా ఉండాల్సిందని బిగ్‌బాస్ గురించి పరోక్షంగా ప్రస్తావించాడు.
'అవును బ్రేకప్ తర్వాత చాలా బాధపడ్డాను. కానీ ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించాను. నా వల్ల తనకు, ఎవరికీ బ్యాడ్ నేమ్ రాకూడదని అనుకున్నాను. పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు నడిచాను. కానీ ఎందుకు బ్రేకప్ చెప్పావ్? నాకు సమాధానం చెప్పు అని ఒత్తిడి చేయలేదు. చెప్పాలంటే నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని. బ్రేకప్ తర్వాత ఒక్కరిని కూడా టార్చర్ చేసింది లేదు ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టింది లేదు. ఎప్పుడైనా బాధ అనిపిస్తే ఫోన్ తీసి ఫొటోలు చూసుకోవడమే తప్పితే.. ఇది చేస్తా అది చేస్తా అనే బ్యాచ్ కాదు' అని షన్ను చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: గద్దర్ అవార్డ్స్-2025 విజేతలు.. ఉత్తమ నటుడు నాగచైతన్య)
'బ్రేకప్ తర్వాత తనకు ప్రేమపై పూర్తిగా నమ్మకం పోయింది. అలాంటి టైంలో తన జీవితంలోకి వైష్ణవి వచ్చిందని షన్ను చెప్పాడు. ఈమెకు చాలా దైవభక్తి. ఎప్పటికప్పుడు దేవాలయాలకు వెళ్తూనే ఉంటుంది. అలానే మాకు పరిచయమైంది. తొలుత హనుమాన్ చాలీసా లాంటివి వాట్సాప్‌లో పంపించుకునేవాళ్లం. హనుమాన్ జయంతి సందర్భంగా కరుంగళి మాలతో పాటు హనుమాన్ చాలీసా లాంటివి వైష్ణవి పంపింది. నేను కూడా రామకోటి లాంటివి శ్రీరామనవమి టైంకి పంపించాను. అలా స్నేహితులుగా ఉన్నవాళ్లం కాస్త తర్వాత స్టేజీకి వెళ్లాం'
'అయితే ప్రేమలాంటివి కాకుండా డైరెక్ట్‌గా పెళ్లి ప్రపోజల్ పెట్టాను. నా గురించి అన్ని తెలిసి కూడా వైష్ణవి, వాళ్ల అమ్మ ఒప్పుకోవడం గొప్ప విషయం. ఇక నా చేతిపై పచ్చబొట్టు గురించి వైష్ణవి చెప్పిన మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి. అది మీకో మెమొరీ. ఉంచాలనుకుంటే ఉంచుకోవచ్చు. లేదంటే ఎప్పుడు తీసేయాలన్నా సరే మీ ఇష్టం అని నాతో చెప్పింది. అది కాదండీ, ఇలా మాట్లాడండి అని పిలవడం తప్పితే ఇప్పటివరకు నన్ను షన్ను అని పిలవలేదు' అని షన్ను.. తనకు కాబోయే భార్య వైష్ణవి గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హీరోగా 'ప్రేమకు నమస్కారం' సినిమా చేస్తున్నాడు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు.
(ఇదీ చదవండి: సీరియల్ నటి చెల్లిని పెళ్లి చేసుకున్న ఆర్జే సూర్య)


