కె.శిల్పవల్లి డీసీపీ, ఖైరతాబాద్ జోన్, హైదరాబాద్
2022 ఫిబ్రవరి... సైబరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఓ హుక్కాపార్లర్ కేంద్రంగా జరుగుతున్న దందాల ఆట కట్టించడానికి ఒక ఐపీఎస్ అధికారిణి ఎస్సైతో కలిసి సాధారణ కస్టమర్స్ కపుల్‌లాగా వెళ్లారు. రెడ్‌హ్యాండెడ్‌గా చెక్ చెప్పారు.2026 ఫిబ్రవరి...రాత్రి విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారిణి సాధారణ ఫిర్యాదీగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడి సిబ్బంది పనితీరు, స్పందనను స్వయంగా పరిశీలించారు. బాధితులతోనూ మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు.
ఈ రెండు టాస్క్‌లు చేసిన ఐపీఎస్ అధికారిణి ఒక్కరే! ఆమె 2020 బ్యాచ్‌కు చెందిన కె.శిల్పవల్లి. అప్పట్లో మాదాపూర్ డీసీపీ, ఇప్పుడు ఖైరతాబాద్‌గా మారిన సెంట్రల్ జోన్ డీసీపీ. ఈ రెండు జోన్లకూ తొలి మహిళా అధికారిణి ఆమెనే కావడం విశేషం.‘పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడం అంటే మాటలా!’ అనే మాటను బొత్తిగా ఖాతరు చేయలేదు శిల్పవల్లి. నిజానికి ఆమె ఐఏఎస్ కావాలని బలంగా అనుకున్నారు. నాలుగు ప్రయత్నాల్లో సివిల్స్‌కు ఎంపిక కాకపోయినా, డీలా పడిపోలేదు.
‘పోలీసు ఉద్యోగం అంటే బోలెడు రిస్కు. ఆడవాళ్లకు చాలా ఇబ్బంది’ అనే మాట పదే పదే వినిపిస్తున్నా, ఆ సవాలును స్వీకరించి ఖాకీ యూనిఫామ్ ధరించారు.1990లలో పాఠశాలలో చదువుకున్న వారందరికీ ఒక అనుభవం అనివార్యం. ఉపాధ్యాయులు క్లాసులో విద్యార్థుల్ని నిలబెట్టి ‘పెద్దయ్యాక ఏమవుతావు?’ అని అడిగేవారు. విద్యార్థులు ఏమాత్రం సంకోచించకుండా డాక్టర్ అనో, ఇంజినీర్ అనో ఏదో ఒకటి ఠక్కున చెప్పేవాళ్లు. నా వంతు వచ్చినప్పుడు నేను చెప్పిన మాట ‘సివిల్స్ రాసి కలెక్టర్ అవుతా’. అప్పట్లో చాలామంది పిల్లలకు సివిల్స్ అంటే ఏమిటో తెలియకపోవడంతో అంతా నన్ను ఆశ్చర్యంగా చూశారు. మా నాన్న సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. నేను సివిల్స్ రాయాలనుకోవడానికి ఆయనే స్ఫూర్తి.
అలా ఐపీఎస్ అయ్యాను!
సివిల్స్ కోసం నేర్చుకున్న అంశాలు గ్రూప్–1 ద్వారా డీఎస్పీని చేశాయి. ఆపై అదనపు ఎస్పీ, నాన్–క్యాడర్ ఎస్పీల తర్వాత 2020 బ్యాచ్ ద్వారా ఐపీఎస్ అయ్యాను. నా పరిధిలోని పోలీసుస్టేషన్‌లలో నమోదయ్యే ప్రతి కేసునూ స్వయంగా పర్యవేక్షించడం నాకు అలవాటు. నేరం జరిగినప్పుడు ఫోన్ ద్వారా అక్కడ ఉన్న అధికారులను సంప్రదించి, వివరాలు తెలుసుకోవడం కంటే క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తుంటాను. నేరస్థలాలతో పాటు ఇతర ప్రదేశాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను స్వయంగా అధ్యయనం చేస్తాను.
కొండల్లో కోనల్లో...
చేవెళ్ల డీఎస్పీగా పని చేస్తున్నప్పుడు ఫామ్‌హౌస్‌లో తల్లిదండ్రుల్ని చంపిన కుమారుడి కేసు దర్యాప్తు మంచి అనుభవాన్ని ఇచ్చింది. ముగ్గురు మహిళల్ని చంపిన సీరియల్ కిల్లర్ కేసు దర్యాప్తులో భాగంగా చెంగొముల్ అడవుల్లో గుట్టల పైకి చేసిన ట్రెక్కింగ్ మర్చిపోలేనిది. షాబాద్‌లో ఓ చిన్నారి కిడ్నాప్ అయినప్పుడు శంషాబాద్‌లో కిడ్నాపర్‌ను పట్టుకుని, బాలుడిని రెస్క్యూ చేసే వరకు ఫీల్డ్‌లోనే ఉన్నాను.
ఆ బాలుడి తండ్రిని వెంట తీసుకుని, అతడి ద్వారానే కిడ్నాపర్‌ను ట్రాప్ చేసి చిన్నారిని రక్షించాం. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ)లో పని చేసినప్పుడు టెక్నికల్ అనాలసిస్ వింగ్‌ను పర్యవేక్షించాను. బీఏలో తీసుకున్న కంప్యూటర్స్ సబ్జెక్ట్ అక్కడ పని చేసింది. ఆ కోర్సులో ఆఖరి సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పేపర్ ఉంది. అలా నేర్చుకున్న విషయ పరిజ్ఞానం ఎస్‌ఐబీలో పనికి వచ్చింది.
అలాంటి ఆలోచన వద్దు
‘అమ్మాయిలకు ఐపీఎస్ ఎందుకు!’ అనే ఆలోచన అప్పుడూ ఉంది. ఇప్పుడూ ఉంది. ఆ ఆలోచన నుంచి బయటికి రావాలి. దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళా ఐపీఎస్ అధికారులు తమ సత్తా చాటుకున్నారు, చాటుకుంటున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి.
గతంతో పోల్చితే అమ్మాయిలలో ఐపీఎస్‌పై ఆసక్తి పెరుగుతోంది. ఐపీఎస్ సాధించడం ఒక సవాలు అయితే, ఆ తరువాత వృత్తిజీవితంలో ప్రతిరోజూ ఎన్నో సవాళ్లు ఉంటాయి. అయినా సరే, అమ్మాయిలు వెనకడుగు వేయడం లేదు. ‘నేను ఐపీఎస్ అవుతాను’ అనే మాట వారి నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఇది శుభసూచకం. నేను ఐపీఎస్ కావాలని అనుకోనప్పటికీ, అయిన తరువాత గర్వంగా ఫీల్ అవుతున్నాను. వృత్తిజీవితంలో విలువైన అనుభవాలు సొంతం చేసుకున్నాను.
ఆ అవసరం ఇప్పుడు మరీ ఎక్కువ
గతంలో కంటే ఇప్పుడే మహిళలు, యువతులలో ఎక్కువ సంఖ్యలో బాధితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువమంది మహిళలు పోలీస్ శాఖలోకి రావాలి. బాధిత మహిళలు విమెన్ పోలీస్ ఆఫీసర్‌లతో ఫ్రీగా, ఎలాంటి భయాలు లేకుండా మాట్లాడగలరు. సోదరితో మాట్లాడుతున్నట్లే కంఫర్ట్‌గా ఫీలవుతారు. ఇదే సందర్భంలో మహిళా అధికారుల వృత్తినిబద్ధత వల్ల బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుంది.
ఎవరికీ చెప్పుకోలేని సమస్యలను చెప్పుకునేవారు
మాదాపూర్‌లో పని చేసినప్పుడు దాదాపు 60–65 స్కూళ్లల్లో జరిగిన స్పోర్ట్స్, కల్చరల్, యాన్యువల్ డేలకు అతిథిగా వెళ్లాను. అక్కడికి వచ్చిన చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకూ డ్రగ్స్, డిజిటల్ హైజీన్, గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌తో సహా వివిధ అంశాల గురించి చెప్పే అవకాశం దక్కింది. నా మాటలు విన్న ఎంతోమంది మహిళలు, యువతులు ఆ తర్వాత ఆఫీస్‌కు వచ్చి నన్ను కలిసే వాళ్లు. బాహ్యప్రపంచంలో ఎవరికీ చెప్పుకోలేని సమస్యల్ని
నా దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు కోరేవారు. అలాంటి వారికి నా చేతనైనంతలో సాయం చేశాను.
-శ్రీరంగం కామేష్


