బొల్లు రచనారెడ్డి, హైకోర్టు సీనియర్ న్యాయవాది
మహిళలు ఇంటర్ పూర్తి కాగానే మెడిసిన్, ఇంజనీరింగ్ తమ కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. డిగ్రీ తర్వాత ఎంబీఏ, ఎంసీఏ లాంటి కోర్సులవైపు మొగ్గు చూపుతున్నారు. చాలెంజింగ్‌గా ఉండే న్యాయవాద వృత్తిని ఎంచుకునే వారు చాలా తక్కువ. తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లలు ఈ కెరీర్‌ను ఎంచుకోవడానికి ఇష్టపడని వారే ఎక్కువ. కోర్టులు, కేసులు అనగానే ఓ రకమైన భయం నిండి ఉంటుంది.
అయితే, కాలం మారుతున్న కొద్ది ఇలాంటి ఆలోచనల్లో మార్పులొస్తున్నాయి. పాతికేళ్ల ముందుతో పోలిస్తే ఇప్పుడు మహిళా న్యాయవాదుల సంఖ్య పెరుగుతున్నా, మిగతా రంగాలతో పోలిస్తే తక్కువే. న్యాయవాద వృత్తి ఎంతో గొప్పది. పురుషులతో సమానంగా మహిళలు కూడా ఈ వృత్తిని ఎంచుకోవాలి.
తెలంగాణ హైకోర్టులో 32 మంది న్యాయమూర్తుల్లో ఏడుగురే మహిళలు ఉన్నారు. ఈ నిష్పత్తిలో మార్పు వచ్చేలా, సగం స్థానాల్లో మహిళలు ఉండేలా రాణించాలి. డిజిగ్నేటెడ్ సీనియర్స్‌లోనూ మహిళల శాతం అంతంతే. ఇది మారాలి. న్యాయవాద వృత్తిని ఎంచుకునే మహిళల సంఖ్య పెరుగుతున్నా, పలు కారణాల వల్ల ఉన్నత స్థానాలకు ఎదగడం లేదు.
కాని, సమరంగా కెరీర్ సాగిస్తే, అందలాలు అధిరోహించ వచ్చనడానికి స్ఫూర్తిగా నిలుస్తున్నవారు ఎందరో! వచ్చే ఏడాది సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇది ప్రతి మహిళా న్యాయవాది గర్వించదగిన సందర్భం. సమర్థతతో అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పేందుకు ఆమె నిదర్శనం.
కోర్టు మెట్లెక్కాలంటే భయపడే మహిళలకు న్యాయం అందించాలంటే, అదే వర్గానికి చెందిన వారు నల్లకోటు ధరించాలి. ప్రజాప్రతినిధి, అధికారి సహా ఎవరు తప్పు చేసినా శిక్షించే అధికారం కోర్టులకు మాత్రమే ఉంటుంది. ప్రజలకు న్యాయం చేయాలనుకునే వారు ఈ వృత్తి స్వీకరించి, రాణించాలి. తొలుత కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, నేను నిలబడి గెలిచా. అత్యంత తక్కువ మంది న్యాయవాదులకు అందించే ‘డిజిగ్నేటెడ్ అడ్వొకేట్ హోదా’ను అతి చిన్న వయసులో అందుకున్నా. ఇంకా ఉన్నత స్థానాలను పొందే అవకాశం ఉంది.
ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో కొన్ని ఆటుపోట్లు వచ్చినా పట్టుబట్టి పోరాడి సమర్థత నిరూపించు కోవాలి. కుటుంబ బాధ్యతల కారణంగా వనితలు ఎక్కువ గంటలు పనిచేయడం ఇబ్బందే! న్యాయవాదులుగా ఏటా నమోదు చేసుకుంటున్న వారిలో పురుషులే ఎక్కువ. ఆ ధోరణి మారాలి. ఒక మహిళ న్యాయవాద వృత్తిలోకి వస్తే చుట్టూ ఉన్న వందమందికి సాయం అందించగలదన్న విషయం గుర్తుంచుకోవాలి. కోర్టుల్లోనూ మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. భయాలు వదిలి నల్లకోటు ధరించి ‘న్యాయదేవత’లుగా మారే సమయం వచ్చింది. న్యాయం ఆశించే స్థాయి నుంచి అందించే స్థాయికి మగువ ఎదగాలి.
దేశంలో తొలి న్యాయవాది
1866, నవంబర్ 15న నాసిక్‌లోని పార్సీ కుటుంబంలో కార్నెలియా సొరాబ్జీ జన్మించారు. మహిళలకు, సమాజానికి ఏదో ఒకటి చేయాలన్నది ఆమె సంకల్పం. బాంబే వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు నాటి బ్రిటిష్ సర్కార్ నిరాకరించడంతో కొందరు సేకరించి ఇచ్చిన నిధులతో ఆక్స్‌ఫర్డ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సివిల్ లాలో 1892లో ఉత్తీర్ణత సాధించినా, డిగ్రీ పట్టా ఇచ్చేందుకు కాలేజీ నిరాకరించింది.1920లో లండన్ బార్ మహిళలను లా ప్రాక్టీస్ చేయడానికి అనుమతించినప్పుడు కార్నెలియా అక్కడికి వెళ్లారు. తర్వాత కలకత్తా హైకోర్టులో తొలి మహిళా న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.
దేశంలో తొలి మహిళా న్యాయమూర్తి
అన్నా చాందీ 1959 ఫిబ్రవరి 9న కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, దేశంలోనే తొలి మహిళా హైకోర్టు న్యాయమూర్తిగా అరుదైన ఘనత సాధించారు. అంతకు ముందు 1937లో తొలి మహిళా న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. ట్రావెన్‌కోర్ రాజ్యంలో (ప్రస్తుతం కేరళ) 1905 ఏప్రిల్ 5న జన్మించిన అన్నా చాందీ, తిరువనంతపురంలో పెరిగారు. చిన్నప్పటి నుంచే చదువు, సామాజిక అవగాహన, మహిళా హక్కులపై ప్రత్యేక ఆసక్తి కలిగిన ఆమె, ఆ కాలంలో మహిళలకు అరుదైన రంగమైన న్యాయ విద్యను ఎంచుకుని, 1926లో ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి కేరళలో లా డిగ్రీ పొందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.
సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి
సుప్రీం కోర్టు తొలి మహిళా న్యాయ మూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ 1989లో నియమితుల య్యారు. కేరళలోని పతనంతిట్టలో 1927 ఏప్రిల్ 30న మీరా సాహిబ్, ఖదీజా బీవీ దంపతులకు జన్మించారు. పతనంతిట్టలో పాఠశాల విద్య, తిరువనంతపురంలో బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం తిరువనంతపురంలో ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి బీఎల్ పట్టా పుచ్చుకున్న జస్టిస్ బీవీ 1950లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు.
సెషన్స్ కోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి 1983న హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1989లో సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1992 ఏప్రిల్ 29న పదవీ విరమణ చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ తొలి చైర్‌పర్సన్‌గా, ముస్లిం వర్గం నుంచి గవర్నర్‌గా నియమితురాలైన తొలి మహిళ కూడా ఆమే కావడం విశేషం.
-గండ్రాతి అరవింద్ రెడ్డి


