ఆమెకు అవస్థలు ! | Women Protection Cells Not Found in Government Offices | Sakshi
Sakshi News home page

ఆమెకు అవస్థలు !

Mar 8 2026 5:38 AM | Updated on Mar 8 2026 5:38 AM

Women Protection Cells Not Found in Government Offices

ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించని ఉమెన్‌ ప్రొటక్షన్‌ సెల్‌లు 

ప్రత్యేక చట్టం ఉన్నా ఆచరణ శూన్యం 

ప్రత్యేక మరుగుదొడ్లు లేవు 

వెయిటింగ్‌ రూముల జాడే లేదు  

కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రభుత్వ ఉద్యోగాల్లో  పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరి సంఖ్య పెరుగుతోంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు తగిన వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం కూడా చేసింది. అయితే  ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కనిపించడం లేదు. 

విధి నిర్వహణలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  బయటికి చెప్పుకోలేని బాధలతో అల్లాడుతున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ మహిళా ఉద్యోగులను పనిసమయం ముగిసినప్పటికీ గంటల తరబడి పనులు చేయిస్తుండటంపై  సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాగేనా మహిళలను గౌరవించేది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌లు ఏవీ? 
ప్రభుత్వ కార్యాలయాల్లో విధిగా మహిళా రక్షణ సెల్‌ (ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌) ఉండాలని కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం చెబుతోంది. కలెక్టరేట్‌ కాంప్లెక్స్, సంక్షేమభవన్, సర్వజనవైద్యశాల, జిల్లా పరిషత్, నగరపాలకసంస్థ, ఆర్‌డీవో కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు.  వీటిలో ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ కనిపించడం లేదు. వాటి బాధ్యతలను మహిళలకే అప్పగించాల్సి ఉంది. 

సంబంధిత కార్యాలయాల్లో మహిళలు ఏ విధంగా వేధింపులకు గురైనా, మహిళలకు సంబంధించిన పైళ్లు పెండింగ్‌లో పెట్టినా.. మహిళల హక్కులు, ప్రయోజనాలకు భంగం కలిగించినా ఈ సెల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. మహిళల నుంచి ఫిర్యాదులు వస్తే ఈ విభాగం ఇన్‌చార్జ్‌లు సంబందిత హెచ్‌ఓడీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే వీలుంది. ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఏర్పాటులో ప్రభుత్వం చేసిన చట్టం కాగితాల మీద ఉంది తప్ప కార్యరూపం దాల్చడం లేదు. 

పస్తులే దిక్కు  
ప్రభుత్వ మహిళ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు వేతనంలో కూడిన 180 రోజుల మెటర్నటీ లీవ్‌లు ఉన్నాయి. అయితే  అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల్లో మహిళలు 50 శాతం వరకు ఉన్నారు. మహిళ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆరు నెలల పాటు మెటర్నటీ లీవ్‌లు ఇస్తున్నప్పటికీ ఈ కాలానికి వేతనాలు చెల్లించడం లేదు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు అంతంతమాత్రంగా రూ.20 వేలలోపు  ఉన్నాయి.  

వేతనంతో కూడిన సెలవులు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.  ఆరు నెలలు మెటర్నటీ లీవ్‌ల్లో ఉన్న సమయానికి ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వీరికి వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్‌లు ఇవ్వాలని ఉద్యోగసంఘాలు డిమాండ్‌ చేస్తున్న ప్రభుత్వం స్పందిచడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  

సౌకర్యాలు కను‘మరుగు’ 
కర్నూలు జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టరేట్‌లోనే మహిళా ఉద్యోగులకు కనీస సదుపాయాలు లేవు. కలెక్టరేట్‌లో 30 ప్రభుత్వ శాఖల జిల్లా అధికారుల కార్యాలయాలు ఉన్నాయి. రెవెన్యూ, పౌరసరఫరాలు, సర్వే, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, డీఆర్‌డీఏ, డ్వామా, సహకార శాఖ, ప్రణాళిక విభాగం తదితర కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం కావడంతో మహిళా ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి.  రన్నింగ్‌ వాటర్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెస్ట్‌ రూములు లేవు. కొన్ని శాఖల్లో ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌లు కాగితాల మీదనే కనిపిస్తున్నాయి.  

రెస్ట్‌ రూములు ఏర్పాటు చేయాలి 
మహిళా ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు సానుభూతితో వ్యవహించాలి. ప్రధానంగా వార్డు, గ్రామ సచివాయాల్లో పనిచేసే వారికి పని ఎక్కువగా ఉంటోంది. ఉదయం 8 గంటలకే విధులకు వెళ్లి రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పనిచేయాల్సి వస్తోంది. మొత్తంగా 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు కచ్చితమైన పని వేళలు అమలు చేయాలి. మహిళలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రెస్ట్‌ రూములు ఏర్పాటు చేయాలి. –  ఎస్‌.చందన,  ఏపీ ఎన్‌జీజీవోస్‌ అసోసియేషన్‌ మహిళా విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షురాలు 

సమస్యలను పరిష్కరించాలి 
ప్రభుత్వ శాఖల్లో మహిళా ఉద్యోగులు సంఖ్య భారీగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులు మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్లకుండా ఆఫీసుల్లోనే భోజనాలు చేస్తున్నారు. ఇటువంటి వారికి తగిన వసతి కల్పించాలి. ఉమన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌లను మరింత పకడ్బందీగా అమలు చేయాలి. మరుగుదొడ్లను ఆధునీకరించాలి. మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి.  – సరస్వతి, మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం నేత

ప్రత్యేక సదుపాయాలు నిల్‌
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉండాలి.  పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇవి కనిపించడం లేదు. అంతేగాకుండా మహిళలకు ప్రత్యేక వెయిటింగ్‌ రూమ్‌ ఉండాలి. మధ్యాహ్నం భోజనం చేయడానికి, అరగంటపాటు విశ్రాంతి తీసుకోవడానికి వెయిటింగ్‌ రూమ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. 

కాని ఎక్కడా మహిళలకు వెయిటింగ్‌ రూములు లేవు. ప్రస్తుతం గ్రామస్థాయి కార్యాలయం నుంచి మండలం, డివిజన్, జిల్లా స్థాయి కార్యాలయాల వరకు  మహిళా ఉద్యోగులు ఉన్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో చెప్పుకోలేని బాధలతో సతమతం అవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement