కల్తీ పాల ఘటనను ‘కూల్‌’ చేశారు! | Lab reports on Rajamahendravaram adulterated milk incident | Sakshi
Sakshi News home page

కల్తీ పాల ఘటనను ‘కూల్‌’ చేశారు!

Mar 8 2026 5:23 AM | Updated on Mar 8 2026 5:23 AM

Lab reports on Rajamahendravaram adulterated milk incident

రాజమహేంద్రవరం ఘటనలో చివరికి అదే తేల్చారు

ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నట్టుగానే ల్యాబ్‌ రిపోర్టులు 

కూలెంట్‌ లీకై పాలలో ఇథలీన్‌ గ్లైకాల్‌ కలవడంతోనే మృతి చెందినట్టు ప్రకటన 

ఐదుగురికి చెందిన ల్యాబ్‌ రిపోర్టుల్లో ఇదే వెల్లడైనట్టు తెలిపిన అధికారులు.. ల్యాబ్‌ రిపోర్టులు మాత్రం బహిర్గతం చేయని వైనం

అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారనే అనుమానాలు  

సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పు గోదా­వరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్తీ పాల మరణాలకు కారణం ఏమిటనే విషయమై కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు అధికారులు తెరదించారు. మంగళగిరిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌), విజయవాడలోని రీజినల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌) నుంచి శనివారం ఐదుగురి మరణాలకు సంబంధించిన ఫోరెన్సిక్‌ తుది అభిప్రాయం వెల్లడైనట్టు ఓ ప్రకటన ద్వారా అధికారులు వెల్లడించారు. 

కూలెంట్‌ నుంచి లీకైన విషపూరిత ఇథలీన్‌ గ్లైకాల్‌ కలిసిన పాలు తాగడం వల్లే పలువురు కిడ్నీలు ఫెయిలై మృతి చెందినట్టు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఆధారంగా నిర్ధారణకు వచ్చినట్టు ప్రకటించారు. ఈ నివేదిక ప్రతులను మాత్రం బహిర్గతం చేయలేదు. కేవలం ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీనినిబట్టి చూస్తే.. విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నా­యి. 

ఈ నివేదిక కాపీలను బహిర్గతం చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇథలీన్‌ గ్లైకాల్‌ కాకుండా మరేదైనా కలిసినట్టు ఆ రిపోర్టుల్లో నిర్ధారించారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నివేదికలను ఫోరెన్సిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పరిశీలించి తుది అభిప్రాయం తెలిపారని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 9 కేసులకుగాను త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 3, బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2 కేసులకు సంబంధించి ఈ నివేదికలు వచ్చాయన్నారు. 

ల్యాబ్‌ల నుంచి వచ్చిన రిపోర్టులు, ఫోరెన్సిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పరిశీలించి ఇచ్చిన ఫైనల్‌ ఒపీనియన్‌ ఆధారంగా విషపూరితమైన ఈజీ–ఇథలీన్‌ గ్లైకాల్‌ కలిసిన పాలు తాగడం వల్ల కిడ్నీ, మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో ఈ ఐదుగురూ మృతి చెందినట్టు నిర్ధారించారు. మిగిలిన వారి రిపోర్టులు ఎందుకు ఆలస్యమవుతున్నాయనే ప్రశ్నలకు జవాబు లేదు.

Advertisement
 
Advertisement
Advertisement