గ్రామ సర్వేయర్లపై చంద్రబాబు సర్కారు కక్ష | 40 village surveyors suspended across the state | Sakshi
Sakshi News home page

గ్రామ సర్వేయర్లపై చంద్రబాబు సర్కారు కక్ష

Mar 8 2026 5:15 AM | Updated on Mar 8 2026 5:15 AM

40 village surveyors suspended across the state

రాష్ట్రవ్యాప్తంగా 40 మందిపై సస్పెన్షన్‌ వేటు  

హక్కుల కోసం పోరాడటమే వారు చేసిన తప్పు 

సస్పెన్షన్‌లో సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  

మరింత ముదురుతున్న సర్వేయర్ల ఆందోళన

సాక్షి, అమరావతి: న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆందోళన బాట పట్టిన గ్రామ సర్వేయర్లపై చంద్రబాబు సర్కారు కక్షసాధిస్తోంది. ఇప్పటికే 40 మంది సర్వేయర్లను సస్పెండ్‌ చేసింది. అందులో గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, గ్రామ సచివాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ మధుబాబు కూడా ఉన్నారు. ఈ చర్యల ద్వారా మిగిలిన ఉద్యోగులను భయపెట్టవచ్చని సర్కారు యోచనగా కనిపిస్తోంది. అనుమతి లేకుండా యూనియన్లు పెట్టి పోరాటం చేస్తున్నారంటూ ప్రభుత్వం సస్పెన్షన్‌ ఆర్డర్స్‌లో పేర్కొంది. 

ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యలను ప్రభు­త్వం పట్టించుకోకపోవడంతో ఈనెల 5 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సర్వేయర్లు రాష్ట్రవ్యాప్తంగా సహాయ నిరాకరణ ప్రారంభించారు. రీ సర్వే కార్యక్రమంలో పాల్గొనకుండా తమ డిమాండ్లపై చర్చించాలని కోరారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసినా ఉపయోగం లేకపోవడంతో ఆందోళనను ఉధృతం చేశారు. దీంతో ప్రభుత్వం మూడు రోజుల నుంచి వరుసగా సస్పెన్షన్లు ప్రారంభించింది. అయినా సర్వేయర్లు వెనక్కి తగ్గకుండా సర్వే శాఖ జిల్లా కార్యాలయాల వద్ద ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. 

ఇవీ డిమాండ్లు 
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఇతర ఉద్యోగుల మాదిరిగానే తమ పే రోల్‌లో మార్పు చేయాలనేది సర్వేయర్ల ప్రధాన డిమాండ్‌. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రూ.30 వేల బేసిక్‌ పే ఉండగా, సర్వేయర్లకు మాత్రం రూ.25,200 మాత్రమే ఉంది. దీన్ని అందరితో సమానంగా పెంచుతామని, ప్రమోషన్‌ ఛానల్‌ కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం యధావిధిగా ఆ హామీని తుంగలో తొక్కింది. 

కనీస వేతనం కూడా ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్న జీతాన్నే కేవలం పోస్టు పేరు మార్చి ఇచ్చేందుకు ప్రభు­త్వం నివేదిక తయారు చేసినట్లు చెబుతున్నారు. దీంతో సర్వేయర్లు ఆందోళన బాట పట్టారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన విరమించేది లేదని సర్వేయర్లు స్పష్టం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సర్వేయర్ల సంఘం సన్నాహాలు చేస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement