కబ్జాల గీతం.. సర్కారు తాళం! | Visakha TDP MP Bharat Looted AP Govt lands worth Rs 5,000 crores | Sakshi
Sakshi News home page

కబ్జాల గీతం.. సర్కారు తాళం!

Mar 8 2026 5:06 AM | Updated on Mar 8 2026 5:06 AM

Visakha TDP MP Bharat Looted AP Govt lands worth Rs 5,000 crores

రూ.5 వేల కోట్ల విలువైన భూములు కొట్టేసిన విశాఖ టీడీపీ ఎంపీ భరత్‌

ఆక్రమిత భూమినంతటినీ చదును చేసేందుకు బరితెగింపు 

ఇప్పటికే చురుగ్గా లెవలింగ్‌ పనులు 

ప్రభుత్వ భూములంటూ పాతిన బోర్డులు పీకేసిన వైనం 

ప్రభుత్వ పెద్దల బెదిరింపులతో జీవీఎంసీలో క్రమబద్ధీకరణ తీర్మానం 

ఆపై జీవో రాకుండానే యథేచ్ఛగా పనులు.. 

రాష్ట్రంలో తన బినామీలకు, బంధువులకు బాబు భూ పందేరాలు 

పైగా 99 పైసలకే భూములిస్తామంటూ సమర్థింపు 

రెండు మూడు నెలల క్రితమే కంపెనీలు పెట్టిన వారికి సైతం భూ దోపిడీ 

ఎక్కడా లేని విధంగా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు భూములు  

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు తన బంధువులకు, బినావీులకు ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు, 99 పైసలకు కట్టబెడుతుండటంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి, వాటిని సక్రమం చేసుకునేందుకు మంత్రి లోకేశ్‌ తోడల్లుడు, సినీనటుడు బాలకృష్ణ అల్లుడు, విశాఖపట్నం టీడీపీ ఎంపీ భరత్‌కు చెందిన ‘గీతం’ సంస్థ బరితెగించి అన్ని అడ్డదారులూ తొక్కుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ అండతో జీవీఎంసీలో దౌర్జన్యం చేసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవిఎంసీ) సమావేశంలో ఎలాంటి చర్చ లేకుండానే తను ఆక్రమంచిన రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరించుకుంది. 

ఈ బరితెగింపు, దౌర్జన్యంపై యావత్‌ ప్రజా సంఘాలు, రాష్ట్ర ప్రజలు ఓ వైపు మండిపడుతుండగా.. ఆ స్థలాన్ని ‘గీతం’ తన ఆధీనంలోకి తీసుకుని చదును చేసే పనులు మొదలు పెట్టడం కలకలం రేపుతోంది. తీర్మానం మేరకు ఇంకా జీవో విడుదల కాకముందే అధికారం అండ చూసుకుని గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన భూములను సొంతం చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. జీవీఎంసీ పాలకవర్గ సమావేశంలో అధికార బలాన్ని ప్రయోగించి, దాడులకు తెగబడి ఆ భూముల క్రమబద్ధీకరణకు తీర్మానాన్ని ఆమోదించుకున్న వైనంపై ఓ వైపు ఇంకా చర్చ జరుగుతూనే ఉండగా, ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. 

పైగా గతంలో ఈ భూములు ప్రభుత్వానికి చెందినవి అంటూ ప్రభుత్వం పాతిన బోర్డులను సైతం పీకేశారు. లారీల్లో ఎర్రమట్టిని తరలించి కబ్జా భూముల్లో చదును చేసే (లెవలింగ్‌) పనులు చురుగ్గా చేస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల్లో అక్రమంగా ‘గీత’ దాటి చేపడుతున్న పనుల వైపు రెవెన్యూ యంత్రాంగం కన్నెత్తి చూడటం లేదు. కొద్దిపాటి జాగాలో వ్యాపారం చేసుకుని పొట్టపోసుకునే చిరు వ్యాపారులపై ఆపరేషన్‌ లంగ్స్‌ పేరిట ప్రతాపం చూపిన ప్రభుత్వం.. రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిలో గీతం పనులు చేస్తున్నా, అడ్డు చెప్పడానికి సాహసించడం లేదు. ఇప్పటికి ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్న ఈ భూములు తమవే అన్నట్లు గీతం వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

గత ప్రభుత్వం కాపాడితే.. ఈ ప్రభుత్వం ధారాదత్తం
అధికారికంగా గీతం యూనివర్సిటీ కోసం కేటాయించిన భూముల్లో మాత్రమే కాకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల్లోకి సైతం గీతం ఆక్రమణల పర్వం మొదలైంది. ఈ ఆక్రమణలన్నీ సక్రమం చేసుకునేందుకు 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. ‘గీతం’ పావులు కదిపింది. ఇందులో భాగంగా గీతం ఆక్రమణ చెరలో ఉన్న భూముల్ని సదరు వర్సిటీకి ఎలినేషన్‌ కింద బదలాయించేందుకు సన్నాహాలు చేశారు. తర్వాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశాఖ భూ కుంభకోణాలపై చర్యలకు ఉపక్రమించింది. 

ఇలా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకంగా 2 వేల ఎకరాల మేర భూములను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంరక్షించింది. వీటి విలువ రూ.6 వేల కోట్ల మేర ఉంటుందని అంచనా. ఇందులో భాగంగా గీతం భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. 40.51 ఎకరాలకుపైగా ఆక్రమించుకున్న స్థలాల్ని దశల వారీగా స్వాధీనం చేసుకున్నారు. భూమిని ఆక్రమించి చేపట్టిన రక్షణగోడ, గార్డెన్, గ్రావెల్‌ బండ్‌ నిర్మాణాల్ని అప్పట్లో గత ప్రభుత్వం తొలగించింది. 

ఇది ప్రభుత్వ స్థలం అంటూ బోర్డులను పాతింది. ఇంకా ఆక్రమిత భూములున్నాయని రెవెన్యూ అధికారులు చెప్పడంతో.. గీతం యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు స్టేటస్‌ కో ఇచ్చింది. మిగిలిన 14 ఎకరాలకు పైగా భూమికి సంబంధించి కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. తుది తీర్పు వచ్చే వరకు ఆ భూముల్లో ఎలాంటి కొత్త చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. గీతం చెరలో ఉన్న భూములు ఆక్రమించినవేనని చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో వేసిన ‘సిట్‌’ కూడా స్పష్టం చేసింది.  

కబ్జా భూముల్లో లెవలింగ్‌ పనులు చేపట్టిన దృశ్యం  

బోర్డులను సైతం పీకేసి.. 
బలం లేకపోయినప్పటికీ వైఎస్సార్‌సీపీకి చెందిన మేయర్‌ను అధికార చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా తొలగించింది. కేవలం గీతం భూముల కోసమే మేయర్‌ పీఠాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేజిక్కించుకుందని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. కౌన్సిల్‌ సమయం ముగుస్తున్న సమయంలో హడావుడిగా ఎజెండాలో చివరి అంశంగా గీతం భూముల విషయాన్ని చేర్చి, ఆమోదం పొందేలా ఒత్తిడి తెచ్చిందని స్పష్టం అవుతోంది. సీఎం, లోకేశ్‌ పేషీ నుంచి జీవీఎంసీపై ఒత్తిడి నేపథ్యంలో ఆ భూముల్ని గీతం వర్సిటీకి క్రమబద్ధీకరించి, బదలాయింపు ప్రక్రియ వేగవంతం చేసింది. 

ఇందుకోసం కౌన్సిల్‌ సమావేశంలో పక్కాగా రౌడీయిజానికి దిగడం.. ఎటువంటి చర్చ, ఓటింగ్‌ లేకుండానే అన్ని అంశాలు ఆమోదం పొందినట్లుగా ఎజెండాను మేయర్‌ స్వయంగా చదివి ప్రకటించడం తెలిసిందే. జీవీఎంసీ తీర్మానం తర్వాత అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) జారీ చేయాల్సి ఉంటుంది. అయితే అప్పటి వరకు వేచి చూడలేమంటూ ‘గీతం’ ఈ భూముల్లో బరితెగించి లెవలింగ్‌ పనులు పెద్ద ఎత్తున చేస్తోంది. ప్రభుత్వ భూములంటూ పాతిన బోర్డులను సైతం పీకేసింది.

పప్పు బెల్లాలకు భూ పందేరాలు
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రభుత్వ పెద్దల బంధువులు, బినామీలకు భూ పందేరాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి.  పప్పు బెల్లాలకు, 99 పైసలకే భూములిచ్చేస్తున్నారు. పైగా ఎకరం 99 పైసలకు కాదు.. ఆయా సంస్థలకు కావాల్సిన మొత్తం భూమిని 99 పైసలకే ఇస్తామని నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు. రెండు మూడు నెలల క్రితం కంపెనీలు పెట్టి.. వాటి పేరుతో భూ దోపిడీ సాగిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు సైతం భూములు కేటాయించిన ఘనత ఒక్క చంద్రబాబు ప్రభుత్వానికే దక్కింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement