బీఆర్‌ నాయుడికి భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్‌ | Bhumana Karunakar Reddy Fires On Br Naidu And Kiran Royal | Sakshi
Sakshi News home page

బీఆర్‌ నాయుడికి భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్‌

Mar 7 2026 5:11 PM | Updated on Mar 7 2026 5:51 PM

Bhumana Karunakar Reddy Fires On Br Naidu And Kiran Royal

సాక్షి, తిరుపతి: భగవద్గీతపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ నాయుడు, కిర‌ణ్ రాయ‌ల్‌కు లేదని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసభ్య వీడియోలు తీసే వారితో భగవద్గీత గురించి మాట్లాడించడం దురదృష్టకరమన్నారు. యువతకు సులభంగా అర్థమయ్యే విధంగా భగవద్గీత సారాన్ని సరళమైన భాషలో పుస్తకంగా ప్రచురించామని భూమన పేర్కొన్నారు.

టీటీడీ మాన్యువల్ ప్రకారం విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేయాలనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. తాము టీటీడీ నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఆ పుస్తకాలు ముద్రించబడ్డాయి. ఆ పుస్తకంలో తన పేరు, అప్పటి ఈవో ధర్మారెడ్డి ముందుమాట ఉండడంతో బీఆర్ నాయుడు అసహనం వ్యక్తం చేసి పుస్తకాన్ని విసిరేశారు. భగవద్గీత సారాన్ని 26 పేజీల పుస్తకంగా అందించాం. పండితులతో చర్చకు సిద్ధమని, ఈ గ్రంథం గీతా భావాలకు విరుద్ధమని నిరూపిస్తే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా’’ అంటూ భూమన సవాల్‌ విసిరారు.

ఈ పుస్తకానికి రూ.50 కోట్లు ఖర్చయ్యాయన్న ఆరోపణలను భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. రూ.50 కోట్లు ఖర్చు అయ్యిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన స‌వాల్ చేశారు. ఐదు భాషల్లో భగవద్గీత సారాన్ని ముద్రించి భక్తులకు పంపిణీ చేయడం చట్టబద్ధమైన కార్యక్రమం. బీఆర్ నాయుడు చేస్తున్న అన్యాయాలపై పోరాటం కొనసాగుతుందని భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి స్పష్టం చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement