అప్పులు తప్ప దాచడానికి ఏమీ లేదు | Botsa questions why the budget did not show how the deficit would be covered | Sakshi
Sakshi News home page

అప్పులు తప్ప దాచడానికి ఏమీ లేదు

Mar 7 2026 4:43 AM | Updated on Mar 7 2026 4:43 AM

Botsa questions why the budget did not show how the deficit would be covered

శాసనమండలి సాక్షిగా ఒప్పుకున్న ఆర్థికమంత్రి పయ్యావుల

లోటును ఎలా పూడ్చుకుంటారో బడ్జెట్‌లో ఎందుకు చూపించలేదని నిలదీసిన బొత్స 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అప్పులు తప్ప ఏమీ దాచడానికి లేదని శాసనమండలి సాక్షిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌  కుండబద్దలు కొట్టారు. బడ్జెట్‌ను పూర్తి పారదర్శకంగా తీసుకు వస్తున్నామని, ఇందులో ఏమీ దాచడం లేదని రాష్ట్రంలో అప్పులు తప్ప ఇక దాచడానికి ఏమీ లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను దాస్తున్న విషయాన్ని ఆర్థిక మంత్రి పరోక్షంగా అంగీకరించారు. శుక్రవారం మండలిలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా 2026–27 బడ్జెట్‌ పత్రాల్లో బడ్జెట్‌ బయట చేసే అప్పులు (ఆఫ్‌ బడ్జెట్‌ బారో­యింగ్స్‌) దాచిన విషయంపై ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ గట్టిగా నిలదీసింది. 

బడ్జెట్‌ ఇన్‌ బ్రీఫ్‌లో ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ ఎందుకు పేర్కొనలేదని, బడ్జెట్‌లో పేర్కొన్న రెవెన్యూ, ఆర్థిక లోటులను ఏ విధంగా పూడ్చుకుంటారన్న విషయాలు ఎక్కడున్నాయంటూ మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. గత ప్రభుత్వం మాకు రూ.9.74 లక్షల కోట్ల అప్పును వారసత్వంగా ఇచ్చి వెళ్లిందంటూ ఆర్థికమంత్రి కేశవ్‌ పేర్కొంటున్నారని, కానీ ఈ అప్పులు బడ్జెట్‌ పత్రాల్లో ఎక్కడ అంటూ ప్రశ్నించారు. 

బడ్జెట్‌  పత్రాల్లో చూపించకుండా అప్పులు  ప్రభుత్వం విడుదల చేసిన వైట్‌పేపర్‌లో ఉన్నాయంటూ ఎలా చెపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కాగ్‌ గణాంకాల ప్రకారం రాష్ట్రం సొంత ఆదాయార్జనలో 22వ స్థానంలో ఉందని, ఆయా రాష్ట్రాల కాగ్‌ నివేదికలను పరిశీలిస్తే ఇది తెలుస్తుందన్నారు. వాస్తవాలు లేకుండా ఈ బడ్జెట్‌ను పూర్తిగా అంకెలగారడీగా మార్చేశారంటూ దుయ్యబట్టారు.

సూపర్‌ సిక్స్‌లో మూడు సిక్స్‌లు ఔట్‌
సూపర్‌ సిక్స్‌లో కీలకమైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్‌ ఇస్తామన్న హామీలకు బడ్జెట్‌లో ఒక్క రూపాయికూడా కేటాయించలేదంటూ బొత్స ధ్వజమెత్తారు. సూపర్‌ సిక్స్‌లో మూడు సిక్స్‌లను ఎగరగొట్టేసి సూపర్‌ హిట్‌ అంటూ ఎలా ప్రచారం చేసుకుంటారంటూ దుయ్యబట్టారు. కనీసం ఈ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా చెప్పకుండా అమలు చేసేశామంటూ మభ్య పెడుతున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు, రైతులకు సున్నా వడ్డీ రుణాలకు మంగళం పాడేసి మహిళలను లక్షాధికారులను ఎలా చేస్తారంటూ నిలదీశారు. 

రాష్ట్రంలో ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందిపడుతున్న మాట వాస్తవం కాదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్‌ఆర్‌జీఎస్‌ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ వాటా పెట్టకుండా కేంద్రం ఇస్తున్న రూ.8,500 కోట్లను చూపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నడవడానికి ద్రవ్యవినిమయ బిల్లు అత్యంత ప్రాధాన్యమైనది కావడంతో బడ్జెట్‌లో పేర్కొన్న అంకెల గారడీని నిరసిస్తూ మౌనంగా సభలోనే ఉంటామంటూ బొత్స ప్రకటించారు. అంతకుముందు వైఎస్సార్‌సీపీ సభ్యుడు మొండితోక అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ మేనిఫెస్టోలోని పథకాలకు, కేటాయించిన నిధులకు సంబంధం లేదన్నారు. 

ఆ తర్వాత ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. కాగా, వేతనాల పెంపు కోసం అంగన్‌వాడీలు ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం  కల్లబొల్లి మాటలు చెబుతోందంటూ వైఎస్సార్‌సీపీ సభ్యులు మండలిలో విమర్శించారు. అంగన్‌వాడీల వేతనాల పెంపునకు 2024 జనవరిలోనే అప్పటి తమ ప్రభుత్వం అగ్రిమెంట్‌ రూపంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అంగన్‌వాడీలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ తాము సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్టు బొత్స ప్రకటించారు.  

Advertisement
 
Advertisement
Advertisement