హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లీసా గిల్‌ | Justice Lisa Gill appointed as High Court judge | Sakshi
Sakshi News home page

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లీసా గిల్‌

Mar 7 2026 4:16 AM | Updated on Mar 7 2026 4:16 AM

Justice Lisa Gill appointed as High Court judge

రాష్ట్రపతి ఆమోద ముద్ర.. కేంద్రం నోటిఫికేషన్‌ 

వచ్చే వారం ప్రమాణ స్వీకారం 

ప్రస్తుత సీజే ఠాకూర్‌ పదవీ విరమణ తర్వాత సీజేగా నియామకం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లీసా గిల్‌ నియమితులయ్యారు. ఆమె ప్రమాణ స్వీకారంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరుతుంది. జస్టిస్‌ లీసా గిల్‌ ప్రస్తుతం పంజాబ్, హర్యానా హైకోర్టులో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆమెను ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. 

దీంతో జస్టిస్‌ లీసా నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆమె వచ్చే వారం న్యాయమూర్తిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. జస్టిస్‌ లీసా గిల్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం ఇటీవల నిర్ణయం తీసుకుంది. 

మొదట జస్టిస్‌ లీసా గిల్‌ను న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేసి, ఆ తరువాత హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ పదవీ విరమణ చేసిన వెంటనే ఆమెను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే.  జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ఈ ఏప్రిల్‌ 24న పదవీ విరమణ చేయనున్నారు.

అపార అనుభవం
జస్టిస్‌ లీసా గిల్‌ 1966 నవంబర్‌ 15న జన్మించారు. పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్‌  కేంద్రపాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్ల తరఫున  వాదించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

తొలుత న్యాయమూర్తిగా ఎందుకంటే..?
ఒక హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని నిర్ణయించిన న్యాయమూర్తిని సదరు హైకోర్టులో సీజే పోస్టు ఖాళీ అవడానికి కనీసం రెండు నెలల ముందే న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొత్త విధాన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే జస్టిస్‌ లీసా గిల్‌ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేసింది. జస్టిస్‌ లీసా గిల్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైతే ఆమె ఆం«ధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. కాగా, 2028లో పదవీ విరమణ చేసే జస్టిస్‌ లీసా వచ్చే ఏడాది చివరి కల్లా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement