ఏడాది పాలనలోనే చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక అరాచకం
365 రోజుల్లో 357 రోజులూ చేబదుళ్లతోనే ఆర్థిక నిర్వహణ
కేవలం 8 రోజులే కనీస నగదు బ్యాలెన్స్ నిర్వహణ
2024–25లో చేబదుళ్లకు ఏకంగా రూ.303 కోట్లు వడ్డీ చెల్లింపు
చేబదుళ్లను సకాలంలో చెల్లించక పోవడంతోనే వడ్డీ భారం
బాబు సర్కారు అసమర్థ ఆర్థిక నిర్వహణకు ఇది నిదర్శనం
వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ వినియోగం రూ.1,75,532 కోట్లు
2024–25 అకౌంట్స్‌ను వెల్లడించిన కాగ్
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ఏడాది పాలనలోనే ఆర్థిక ఆరాచకం సృష్టించారు. ఏడాదిలో 365 రోజుల్లో 357 రోజులు చేబదుళ్లతోనే ఆర్థిక నిర్వహణను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించిందని కాగ్ నివేదిక పేర్కొంది. పైగా చేబదుళ్లకు కూడా భారీగా వడ్డీలు చెల్లించిందని వెల్లడించింది. సాధారణంగా ఎవరైనా వ్యక్తులు డబ్బులు చేబదులు తీసుకుంటే చెప్పిన సమయానికి తిరిగి చెల్లించేస్తారు. అందుకు వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యక్తుల తరహాలనే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆర్బీఐ చేబదుళ్లకు వెసులుబాటు కల్పిస్తుంది.
ఆ వెసులుబాటు సమయం వరకు చేబదుళ్లు వాడుకుని తిరిగి చెల్లించేస్తే ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే చంద్రబాబు సర్కారు తొలి ఏడాది పాలనలోనే సకాలంలో చేబదుళ్లు తిరిగి ఇవ్వలేక భారీగా వడ్డీలు చెల్లించిందని 2024–25 ఆర్థిక ఏడాది బడ్జెట్ అకౌంట్స్‌పై కాగ్ నివేదిక స్పష్టం చేసింది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పొందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ వద్ద కేవలం ఎనిమిది రోజులు మాత్రమే కనీస నగదు నిల్వను నిర్వహించడం ఘోరమని కాగ్ నివేదిక వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్‌బీఐ స్ఫెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలను కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలో కనీస నగదు బ్యాలెన్స్ రూ.1.94 కోట్లలోపు ఉంటే ఈ సౌకర్యాలను వినియోగించుకుంటాయి.
ఆర్థిక అరాచకానికి నిదర్శనం
2024–25 ఆర్థిక ఏడాదిలో చంద్రబాబు సర్కారు 71 రోజులు రూ.42,004 కోట్ల మేర స్పెషల్ వేస్ అండ్ మీన్స్, 179 రోజులు రూ.73,897 కోట్ల మేర వేస్ అండ్ మీన్స్ వినియోగించుకుందని కాగ్ వెల్లడించింది. 107 రోజులు రూ.56,631 కోట్ల మేర ఓవర్ డ్రాఫ్ట్‌ను వినియోగించుకుందని స్పష్టం చేసింది. ఈ మొత్తాలను నిర్దేశిత సమయంలోగా తిరిగి చెల్లించక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.303 కోట్ల మేర వడ్డీగా ఆర్‌బీఐకి చెల్లించినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది.
చేబదుళ్లకే వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిందంటే ఆర్థిక నిర్వహణ ఎంత దారుణంగా దిగజారిపోయిందో అర్థం అవుతోంది. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్‌ను వినియోగించుకోవడంలో తప్పులేదు కానీ ఆ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా వడ్డీ భారం పడకుండా చూడాలి. అందుకు భిన్నంగా ఏడాదిలోనే చేబదుళ్లకు ఏకంగా రూ.303 కోట్లు వడ్డీ చెల్లించడం అంటే బాబు ప్రభుత్వ ఆర్థిక అరాచకానికి నిదర్శనం.

స్ఫెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్
42,004 (24%)
189
వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్
73,897 (43%)
82
మొత్తం
1,72,532
303
ఓవర్ డ్రాఫ్ట్
56,631 (33%)
32


