మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం
దేశ జనాభాలో 48%గా ఉన్న మహిళల విద్య, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, భద్రత తదితర అంశాలను తరచుగా సమీక్షించుకుంటూ, లోపాలను సవరించుకుంటూ ముందుకు సాగినప్పుడే దేశం వడివడిగా అభివృద్ధి పథంలోకి సాగుతుంది. మనం ఎంతో గొప్పగా, ఘనంగా చాటుకుంటున్న భారతదేశ ఆర్థికాభివద్ధి కథ (గ్రోత్ స్టోరీ)లో మహిళల భాగస్వామ్యం లేకుంటే అది ఓ అసంపూర్ణ కథాచిత్రంగానే మిగిలిపోతుంది. దేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కావాలన్న కల సాకారం కావాలంటే మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు గణనీయంగా మెరుగుపడక తప్పదు.
మెరుగుదల ఉన్నప్పటికీ...
నిజం చెప్పాలంటే గత ఆరేళ్లలో దేశంలో మహిళల వికాసం, ప్రగతి అంతకు ముందెన్నడూ లేని స్థాయిలో మెరుగుపడ్డాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ప్రపంచ బ్యాంకు నివేదిక వంటి ప్రామాణిక సంస్థలు వెలువరించిన లెక్కల ప్రకారం చూస్తే మహిళల విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రత రంగాలలో పెద్ద అడుగులేముందుకు పడ్డాయి. ముఖ్యంగా... 2023–24 నాటికి దేశంలో మహిళల విద్య 73 శాతానికి పెరిగింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘బేటీ బచావో, బేటీ పఢావో’, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు... రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహిళాసంక్షేమ కార్యక్రమాల వల్ల పాఠశాలల్లో బాలికల ప్రవేశాలు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో గణనీయంగా పెరిగాయి. స్టెవ్‌ు గ్రాడ్యుయేట్‌లలో మహిళల వాటా 43%కు పెరిగింది. ఇది ప్రపంచ దేశాలలోనే అత్యధికం.
2023–24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, మహిళా కార్మికశక్తి భాగస్వామ్యం 2017–18లో 23.3% ఉండగా 2024–25 నాటికి 37%కు పెరిగింది. ఇక చిన్న, సన్నకారు పారిశ్రామిక సంస్థలను నిర్వహించే మహిళా పారిశ్రామికవేత్తలసంఖ్య కోటిన్నరకు పెరిగి తద్వారా పుష్కలంగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలలో... ‘స్టాండ్ అప్‌ఇండియా’, ‘ముద్ర యోజన’, స్వయం సహాయక సంఘాలువంటివి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సహాయం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశ స్థూల ఉత్పత్తిలో ఆర్థికంగా మహిళలు అందిస్తున్న వాటా 18 శాతంగా ఉంది.
మహిళల సాధికారత దిశగా సాగిస్తున్న ప్రయాణం అంతకుముందు కంటే సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ప్రపంచ దేశాలతో, మరీ ముఖ్యంగా దక్షిణాసియా దేశాల కంటే కూడా బాగా వెనుకబడి ఉన్నాం. ఇందుకు అనేక కార ణాలు కనిపిస్తాయి. మహిళల విద్య, వారి భద్రత, ఆరోగ్యం, ఉపాధి రంగాలలో మన దేశం ర్యాంకు సంతృప్తికరంగా లేదు. చైనా,జపాన్‌లే కాదు థాయిలాండ్, శ్రీలంకల కంటే మనం వెనుకబడి ఉన్నాం అన్నది ఓ చేదు వాస్తవం.
కొనసాగుతున్న హింస
మహిళలకు భారతీయ సంస్కృతిలో గొప్ప స్థానం ఉందని చెబుతారు. కానీ ఆచరణలో అది అంతగా కనిపించదు. అయితే మహిళలపై ఒకప్పటిలా తీవ్రస్థాయిలో సాగిన దురాచారాలు,అకృత్యాలు ఇప్పుడు లేకపోవచ్చు గాని నేటికీ మహిళలపై భిన్న రూపాలలో హింస చోటు చేసుకుంటూనే ఉంది. మహిళల భద్రత అంశంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాలలో భారత్ ఒకటిగా ఉంది. ‘నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో’ ప్రకారం 2022–23లో దేశంలో మహిళలపై 4.45 లక్షల నేరాలు జరిగాయి. రికార్డులకు ఎక్కని ఘోరాలు ఇంకా మరెన్నో ఉంటాయి.
‘సమాన పనికి సమాన వేతనం’ అన్న చట్టం అమలులోకి రాకముందు మహిళలకు అతి తక్కువ వేతనాలు ఇవ్వడం భారత దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. భవన నిర్మాణ రంగం, ఇతర రోజువారీ కూలీ పనులలో మగ కూలీకి ఇచ్చే భత్యం కంటే ఆడకూలీకిచ్చే మొత్తం ఇప్పటికీ తక్కువగా ఉంటోంది. నిజానికి మగవారు చేసే పని కంటే ఆడ వారు చేసే పని పొందికగా, నాణ్యతతో, అధిక ఉత్పాదకతతో ఉంటుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది.
అన్ని రంగా లలో మహిళల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచడం ద్వారా సింగపూర్ ఆర్థికాభివృద్ధిలో ఎంతో ముందంజ వేసింది. కాగా, మన దేశంలో ఎటువంటి జీత భత్యాలు లభించని ఇంటి పనుల్లో పనిచేసే ఆడవారి సంఖ్య మగవారి కంటే మూడు నుంచి పది రెట్లు ఎక్కువ అని తేలింది.
రాజకీయ విజయం
దేశ మహిళలకు స్థానిక సంస్థలలో గత కొన్నేళ్లల్లో రాజకీయ భాగస్వామ్యం పెరగటం వారు సాధించిన అతి గొప్ప విజయంగా పరిగణించాలి. మెజారిటీ రాష్ట్రాలు మహిళలకు స్థానిక సంస్థలలో 50 శాతం మేర రిజర్వేషన్లు అందిస్తున్నాయి. దీనివల్ల మొత్తం స్థానిక సంస్థలలో 14 లక్షల మహిళా ప్రజా ప్రతినిధులు భాగస్వాముల య్యారు. మరికొన్నేళ్లలో అసెంబ్లీ, పార్లమెంట్‌లలో సైతం మహిళ లకు 33% సీట్లు లభించనున్నాయి.
ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా మహిళల భాగ స్వామ్యం అన్ని రంగాలలో ఉండాలంటే అందుకు నిర్మాణాత్మకమైన ప్రణాళికతో పాటు కార్యాచరణ అవసరం. ప్రధానంగా మహిళలకు నాణ్యమైన విద్య, సాంకేతిక నైపుణ్యాలు అందించాలి. స్కాలర్ షిప్‌లు, మెంటార్‌షిప్‌లతో వారికి ప్రోత్సాహం కల్పించాలి. స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలలో వారిని పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలి. గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి పొదుపు సంఘాలను మరింతగా ప్రోత్సహించాలి.
మహిళా ఆంట్రప్రెన్యూర్సును తయారు చేయడానికి అవసరమైన బ్యాంకు రుణాలు, మార్కెట్ లింకేజీలు, ఇంక్యుబేషన్లు వంటివి అందించ గలగాలి. పాఠశాలలు, కాలేజీలు, పనిచేసే ప్రాంతాలలో మహిళలకు పూర్తి భద్రత కల్పించాలి. ప్రసిద్ధ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ చెప్పినట్లు – ప్రతి మహిళ తెలివితేటలను, సామర్థ్యాలను ఆర్థిక వనరుగా తీర్చిదిద్ది దేశ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేయాలి. అప్పుడే భారతదేశం ఎదురుచూస్తున్న 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ ముందుగానే సాకారం అవుతుంది.
-వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు
-డా‘‘ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు


