విశ్వగురు
అమెరికన్ గాయని, గీత రచయిత, నటి బియాన్స్ నౌల్స్ జాతి వివక్షను ఎదుర్కొంటూ పైకెదిగిన మహిళామణి. పురుషాధిపత్య వినోద ప్రపంచంలో తన ప్రతిభా పాటవాలు నిరూపించుకున్న వ్యాపారవేత్త. గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి ఆమె చేసిన వర్చువల్ ప్రసంగ సంక్షిప్త పాఠం.
ప్రియతమ పట్టభద్రులారా! మీ తరంతో సిసలైన మార్పు మొదలైంది. మునుపటి తరం కలలకు మీరు ప్రతిరూపాలు. మీలా విద్యావంతులు కావాలని వారు చేసిన ప్రార్థనలు మీ రూపంలో ఫలించాయి. విద్యాలయాన్ని వీడిన తర్వాత మనలోని అసలైన సామర్థ్యం బయట పడుతుంది. ఆ ప్రక్రియ అంత తేలికైనదేమీ కాదు. అది నాకూ తెలుసు. సినీ వ్యాపారంలో పురుషాధిపత్యం ఎక్కువ. ఫలితంగా, నాకు మహిళా ‘స్ఫూర్తి దాతలు’ ఎవరూ లేకపోయారు. ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారంలో పైకొచ్చాను. సొంత కంపెనీ ఏర్పాటు చేసుకోగలిగాను. తర్వాత, నా లాంటి మహిళలతో పాటు ఇతరులకూ అవకాశం ఇచ్చే భాగ్యం నాకు లభించింది. మహిళలు కావడం వల్ల, లేదా జాతి వివక్ష కారణంగా అనేక మంది ప్రతిభా సంపత్తులుండి కూడా అవకాశాలకు నోచుకోని సంగతులు నాకు తెలుసు.
విమర్శలే ప్రేరణ!
ప్రతిభను కనబరచండి. మీ బలహీనతను చూసి భయపడకండి. శక్తి సామర్థ్యాలను పునర్నిర్వచించండి. హృదయం చెప్పినట్లుగా నడుచుకోండి. మన ప్రతిభను చాటేందుకు అనేక మార్గాలు న్నాయి. ప్రతి ఒక్కరికీ భగవంతుడు ఏదో ఒక వరాన్ని ఇచ్చి ఉంటాడు. రూపలావణ్యాల విషయంలో జనాభిప్రాయాన్ని పట్టించుకోకండి. ఫలానా విధంగా మాట్లాడితేనే తెలివైనవారం అనిపించు కుంటామని అనుకోకండి. మీ స్వీయ ప్రతిభ ఏదైతే ఉందో దాన్ని మిగిలిన ప్రపంచానికి చాటండి. అవకాశాలు లభించని వర్గంలో ఉన్నవారు విచారిస్తూ కూర్చో కండి. మీకు మీరే ఒక వేదికను నిర్మించుకోండి. మిగిలినవారు మిమ్మల్ని చూసేటట్లు చేసుకోండి. విభిన్నంగా ఉండటం కూడా అందమేనని గ్రహించండి.
తోటివారిని అర్థం చేసుకోవడం, వారి పట్ల దయతో వ్యవహరించడం, వారి తరఫున పోరాడటం కూడా సౌంద ర్యమే. గొంతు పెగలనివారు, అనాకారులు, స్థూలకాయులు, పనికి మాలినవారు, ప్రతిభా సంపత్తులేమీ లేనివారుగా ఎవరైనా ఎప్పుడైనా మీ గురించి మాట్లాడినా నీరుగారిపోవద్దు. అంటే అననివ్వండి. వచ్చే నష్టం ఏమీ లేదనే ధీమా కనబరచండి. అంతేగానీ ఎదుటివారి ప్రతికూలతలు, సంశయాలు మీపై రుద్దడానికి ప్రయత్నిస్తే అందుకు వీలు కల్పించకండి. మీరు నిర్దేశించుకున్న లక్ష్యం నుంచి చెదిరిపోకండి. మనల్ని ఎవరైనా మాటలంటే మనకు కష్టంగా ఉంటుంది. అది నాకూ తెలుసు. కానీ, అటువంటి విమర్శలనే ప్రేరణగా చేసుకుని ముందుకు సాగండి.
గౌరవం... ప్రాథమిక సూత్రం
గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోని చోట బాంధవ్యాలు నిలబడవు. మిమ్మల్ని మీరు ఎంత గౌరవించుకుంటారో ప్రపంచం మిమ్మల్ని అంత గౌరవప్రదంగా చూస్తుంది. ఉద్యమాలు కూడా గౌరవం ప్రాథ మిక సూత్రంగా ఉన్నప్పుడే విజయవంతమవుతాయి. విజయాల కంటే అపజయాలే ఎక్కువగా ఉంటే ఉండనివ్వండి. నేను 24 గ్రామీ అవార్డులు సొంతం చేసుకున్న అదృష్టవంతురాలిని. నాకు అవి 46 సార్లు దక్కకుండా పోయిన సందర్భాలూ ఉన్నాయి.
విజయం దక్కి తీరాలని ఎన్నడూ అనుకోకండి. కానీ, విజయ సాధనకు మరింత శ్రమించండి. చేతిలో ఉన్న పేకముక్కలతోనే ఆడగలం. ఉన్న శక్తియుక్తులతోనే సాధిద్దామని భావించాలి. అదే ఏనుగంత బలాన్ని ఇస్తుంది. మిమ్మల్ని మరెవరితోనూ పోల్చుకోకండి. జీవితంలో లాభాలు, నష్టాలు, కన్నీళ్ళు, సంతోషాలు అన్నీ ఉంటాయి. అలాగే, విజయం తనతోపాటు సవాళ్లనూ మోసుకొస్తుంది. మీ విజయాలు చూశాక ఓర్వలేక మిమ్మల్ని ఎలా పడ గొట్టాలా అని కొందరు వారి సమయాన్ని, శక్తిని వెచ్చిస్తూపోయినా ఆశ్చర్యపోనక్కర లేదు. పరిస్థితులు మీ నియంత్రణలో లేవని లేదా ప్రపంచం మీకు వ్యతిరేకంగా ఉందని ఎన్నడైనా అనిపిస్తే, ఆ బలహీనతను ప్రేరణగా తీసుకుని ఉన్నతిని సాధించేందుకు ప్రయత్నించండి. నాలోని సిస లైన శక్తిని నేను అలాగే కనుగొన్నాను. నేను ఎప్పుడూ ‘పనిలో పురోగతి’గానే ఉండేదాన్ని. అదే, వృద్ధి చెందడంలో ఉండే అందం.
బాధ్యతలో భాగం తీసుకోవాలి!
జీవితాన్ని దాని గతిన అది సాగనిచ్చి తదుపరి అడుగు ఎటు వెయ్యాలో సూచించే పనిని దానికే వదిలేసినపుడు నాకు జీవితం చాలా సంతోషంగా గడిచింది. ప్రతికూలతల గురించే ఆలోచిస్తూ, మాట్లాడుతూ, వాటినే మననం చేసుకోవడంలో విలువైన కాలాన్ని వెళ్ళబుచ్చితే నిష్ప్రయోజనం తప్ప వచ్చేది ఏమీ ఉండదు. ఒక నల్ల జాతి వ్యక్తికి(జార్జ్ ఫ్లాయిడ్) జరిగిన అన్యాయంపై సమష్టిగా పోరాడటం వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటో మీరు గమనించారు. ఒక లక్ష్యం నిమిత్తం అందరూ చేతులు కలిపితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. కానీ, మార్పు తీసుకురావలసిన బాధ్యత మనపైనే ఉంది.
మనకు మనమే జవాబుదారీ వహించాలి. మరో పదేళ్ళలో లేదా ఇరవై ఏళ్లలో ప్రఫంచం ఏ రూపం తీసుకున్నా దానిలో భాగమయ్యేదీ, లేనిదీ మన చేతుల్లోనే ఉంది. ఇంట్లో, ఆఫీసులో, ఉద్యమంలో, ఆధ్యాత్మికతలో ఎక్కడ ఆశా కిరణాలు కని పించినా వాటిని అనుసరించాలి. ఈ విషయంలో మీరు ఎన్నడూ ఒంటరివారు కారని తెలుసుకోండి. మీరు చేయదలచుకున్నవాటిపై ఉత్తినే కలలుకంటూ కూర్చుంటే ప్రయోజనం లేదు. ఇతరుల నుంచి తోడ్పాటు లేదని వారిని విమర్శించను కూడా వద్దు. మీ కృషిని మీరు కొనసాగించండి. కోరుకుంటున్న మార్పు మీరే అయి చూపించండి.
మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేందుకు కూడా కొంత సమ యాన్ని, ధనాన్ని వెచ్చించుకోవాలి. అదే సమయంలో, సమాజానికి తిరిగి కొంత అందించడంలోని విలువను గ్రహించాలి. మీకు చేత నైనంతగా మీ సమాజాన్ని మీరు నిర్మించుకోవాలి. ఇతర వర్గాలకు చెందినవారి జీవితాలకూ విలువ నివ్వాలి. భయాలను పక్కనపెట్టి, ముందుకు సాగండి. నిరంతరం మిమ్మల్ని మీరు తీర్చిదిద్దు
కుంటూనే ఉండండి. సాధించి తీరగలనని మీపై మీరే పందెం కాసుకోండి. అభినందనలు.


