సమాచార హక్కుకు సమాధి? | Sakshi Guest Column On Right to Information | Sakshi
Sakshi News home page

సమాచార హక్కుకు సమాధి?

Mar 3 2026 4:28 AM | Updated on Mar 3 2026 4:28 AM

Sakshi Guest Column On Right to Information

అభిప్రాయం

పనిగట్టుకొని ప్రజల సమాచార హక్కును కాలరాస్తున్నారు. ‘పొమ్మనకుండా పొగబెట్టిన’ చందంగా హక్కును తొలగించకుండానే అది అమలు కాని వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నారు. పాలనలో పారదర్శకతకు తిలోదకాలిచ్చి గోప్యతను మళ్లీ అందలాలెక్కిస్తున్నారు. ఒకవైపు స్వచ్ఛంద సమాచార వెల్లడిని ప్రభుత్వ విభాగాలు నిర్లక్ష్యం చేస్తుంటే మరోవైపు ఆర్టీఐ దరఖాస్తులకు స్పందించాల్సిన అధికారుల జవాబుదారీతనం మంద గిస్తోంది. స్పందన లభించని దరఖాస్తులతో పాటు అప్పీళ్లు పెద్ద సంఖ్యలో పెండింగ్‌ పడుతున్నాయి. రెండో అప్పీళ్లూ సకాలంలో పరిష్కార మవట్లేదు. రాజ్యాంగం హామీ ఇచ్చిన ‘తెలుసుకునే ప్రజల హక్కు’ మసకబారే పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో కళ్లకు కడుతోంది.

దేశ పౌరులు పోరాడి సాధించుకున్న సమాచార హక్కు చట్టం అమలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నీరుగారుతోంది. భయమో, భక్తో... అంతకు ముందు అడగ్గానే సమాచారం ఇచ్చిన అధికారులు కూడా ఇప్పుడు నిరాకరించడం లేదా నిర్లక్ష్యం చేయడం రివాజయింది. ఆర్టీఐ దరఖాస్తులకు స్పందించకపోయినా, సమా చారం ఇవ్వకపోయినా తమకు ఏమీ కాదనే ఓ గిడసబారుతనం అధికార యంత్రాంగంలో పెరిగింది. పారదర్శకతను భంగం చేసే కొత్త చట్టాలు– ఉన్న చట్టంలో మార్పులు, వివిధ స్థాయుల్లో తీసు కునే సర్కారు నిర్ణయాలు, పలు పరిణామాలు... పౌరులు తెలుసు కునే హక్కును పలుచన చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి తోడు సమాచార కమిషన్లు, న్యాయస్థానాల పనితీరు కూడా కొంత మేర కారణమవుతోంది.

వ్యక్తిగత గోప్యత ముసుగులో....
కేంద్రం ‘డిజిటల్‌ వ్యక్తిగత సమాచార భద్రత– డీపీడీపీ చట్టం’ తీసుకువస్తూ సమాచార హక్కు చట్టం నడ్డి విరిచింది. వ్యక్తిగత గోప్యతా భద్రతకు సమాచార హక్కు చట్టం అవరోధమవుతోందంటూ, సదరు చట్టంలో ఇప్పటికే పొందుపరచిన ‘జాగ్రత్త’ను విస్మరించి, పారదర్శకత స్ఫూర్తినే భంగపరుస్తూ నిర్ణయం తీసుకుంది. డీపీడీపీ చట్టంలోని కొన్ని అంశాలు సమాచార హక్కు చట్టం మౌలిక పారదర్శక విధానానికే విరుద్ధం. 2005లో సమాచార హక్కు చట్టం ఏర్పడ్డ తర్వాత తొలిసారి, 2019లో కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలతోనే చట్టం బిగువును సడలించారు. 

కమిషన్‌ పదవీ కాలాన్ని, కమిషనర్ల హోదాని తగ్గించడమే కాకుండా పలు కీలక అంశాలను కేంద్రం పరిధిలోకి తెచ్చు కున్నారు. దాంతో ఆ చట్టానికీ, స్వతంత్ర ప్రతిపత్తికీ కొంతమేర కోరలు పీకినట్టయింది. డీపీడీపీ చట్టంలో పొందుపరచిన అంశాల వల్ల ఆర్టీఐలో వచ్చిన మార్పులు సదరు చట్టం అమలును మరింత నీరుగార్చాయి. పాలనా ప్రక్రియలో అధికారులకు ఏదో రూపంలో వ్యక్తిగత సంబంధం కలదిగా పరిగణించే ఏ సమాచారాన్ని డీపీడీపీ చట్టప్రకారం పౌరులకు ఇవ్వనవసరం లేదనే నిబంధనను కొత్తగా తీసుకువచ్చారు. ‘పర్సన్‌ ’ అనే పదానికి ఇప్పటికే ఉన్న విస్తృతార్థం దృష్ట్యా ఇది వ్యక్తులకే కాకుండా సంస్థలకు, విభాగాలకూ వర్తించి, అలా చాలా చోట్ల సమాచార నిరాకరణకు తాజా నిబంధన ఓ ఆయుధంగా మారుతోంది.

జస్టిస్‌ పుట్టుస్వామి వర్సెస్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా (2017) కేసులో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం వ్యక్తిగత గోప్యతను పౌరుల ప్రాథమిక హక్కులో భాగంగా స్పష్టం చేసింది. దరిమిలా పలు స్థాయి చర్చల తర్వాత డిజిటల్‌ వ్యక్తిగత గోప్య సమాచార భద్ర తకు ప్రత్యేక చట్టం తెచ్చే ప్రక్రియ మొదలైంది. చివరకు 2025 నవంబరు 13న డాటా ప్రొటెక్షన్‌ బోర్డు అమలులోకి వచ్చింది. డీపీడీపీ చట్టం దశల వారీ అమలు ప్రక్రియను ప్రారంభించి, 2025 నవంబరు 14న ఈ చట్ట నిబంధనల్ని (రూల్స్‌) అమలులోకి తెచ్చారు.

ఇదివరకే ఆ భద్రత ఉంది!
పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చడానికి చాలా ముందే ‘సమాచార హక్కు చట్టం’ పౌరుల గోప్యత హక్కును గుర్తించింది. వ్యక్తిగత గోప్యత పౌరుల తెలుసుకునే సమాచార హక్కుకు ప్రతిబంధకం కావొద్దనీ, అదే సమయంలో సమాచారం తెలుసుకునే హక్కు పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగకరం కాకూడదనీ ఎంతో జాగ్రత్త వహించిన తీరు మనకు ‘సమాచార హక్కు చట్టం–2005’లో స్పష్టంగా కనిపిస్తుంది. పౌరులు కోరినప్పటికీ ఏయే సందర్భాల్లో సమాచారం ఇవ్వన వసరం లేదో సమాచార హక్కు చట్టం సెక్షన్‌ 8(1)లో పలు సంద ర్భాలను పేర్కొన్నారు. అందులో, సబ్‌ సెక్షన్‌ 8 (1) జె ఒకటి.

‘ప్రజావ్యవహారాలతో ఏ నిమిత్తం లేని, పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వనవసరం లేదు’ అని అందులో పేర్కొన్నారు. ఇటువంటి సందర్భాల్లో ప్రజా సమాచార అధికారి (పీఐవో) నేరుగా నిరాకరించవచ్చు. కానీ, ‘అలా సమాచారం కోరటం ఒకరి వ్యక్తిగత గోప్యతలోకి అనుచితంగా చొరబడటం కాకుండా నిజంగా సదరు సమాచారానికి– ప్రజా వ్యవహారాలకు ప్రత్యక్ష సంబంధం ఉంటే, నిబంధనతో నిమిత్తం లేకుండా పీఐవో సమాచారం ఇచ్చి తీరాల్సిందే’ అన్న వివరణ ఆర్టీఐ చట్టంలో ఉంది. దీన్ని, ప్రస్తుత డీపీడీపీ చట్టం ద్వారా తొలగించారు. ఫలితంగా ప్రజా వ్యవహారాలతో సంబంధం ఉండే బోలెడు సమాచారాన్ని ‘వ్యక్తిగత గోప్యత’ కారణం చూపి డీపీడీపీ సెక్షన్‌ 44 (3) ప్రకారం నిరాకరించే ఆస్కారం ఏర్పడు తోంది. దీంతో నియామకాల ఫైళ్లు, ప్రొక్యూర్‌మెంట్‌ రికార్డులు, ఆడిట్‌ నివేదికలు, ప్రజానిధుల వ్యయ నివేదికలు... ఇలాంటివేవీ ప్రజలకు అందుబాటులో ఉండవు, ఆర్టీఐ చట్టం ఇప్పించదు. ఇది పాలనలో పారదర్శకతకు భంగకరం.

కోర్టుల మాట పెడచెవిని పెట్టడమే!
కమిషన్లు క్రియాశీలంగా ఉండటం సర్కార్లకు ఇష్టమున్నట్టు లేదు. అందుకే, కమిషనర్ల నియామకం కూడా తరచూ వివాదా స్పదం అవుతోంది. కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగానే కమిషన్లను ఖాళీ ఉంచుతున్నారు. అందరూ రిటైరయి, కనీసం ఒక్క కమిషనర్‌ కూడా విధుల్లో లేని పరిస్థితి తెలంగాణ గత ప్రభుత్వ హయాంలో దాదాపు రెండేళ్లపాటు సాగింది. ‘ఫలానా తేదీ లోపు చర్యలు తీసుకోండి’
అంటూ అప్పటికే హైకోర్టు పలుమార్లు హెచ్చరించింది. 2023లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కమిషనర్ల నియామక ప్రక్రియ చేపట్టి పూర్తి చేసింది. 

జార్ఖండ్‌ ఆర్టీఐ కమిషన్‌ కు సంబంధించిన ఓ కేసు విచారిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలే చేసింది. దేశ వ్యాప్తంగా సమాచార కమిషన్లలో ఉన్న ఖాళీలను సత్వరం భర్తీ చేయడమే కాకుండా, అప్పీళ్ల పెండింగ్‌ పరిస్థితిని బట్టి అవసరమైతే తగు సంఖ్యలో కొత్తగా అదనపు కమిషనర్లను నియమించుకోవాలని ఇదే నెలలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు, పూర్తిస్థాయి ‘అన్‌ లైన్‌ ఆర్టీఐ దరఖాస్తు’ విధానాన్ని ఏపీలో అందుబాటులోకి తెస్తున్నారు. ఎప్పుడో ప్రారంభించిన తెలంగాణలో ఇప్పుడిది అంత ఆశావహమైన స్థితిలో లేదు. ఆన్‌ లైన్‌ పోర్టల్‌ ద్వారా చేసుకున్న దరఖాస్తుల్లో 98 శాతం పరిష్కారానికి నోచుకోకుండా పడి ఉన్నట్టు సమాచారం! ఇదీ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సేకరించిన అధికారిక సమాచారమే! పరిస్థితి ఇలా ఉంటే... ఇక పౌరులకు సమాచారానికి దిక్కేది? ఆర్టీఐ చట్టం అమలుకు దారేది?


దిలీప్‌ రెడ్డి
వ్యాసకర్త ఉమ్మడి ఏపీలో సమాచార కమిషనర్,పీపుల్స్‌ పల్స్‌ రిసెర్చ్‌ సంస్థ డైరెక్టర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement