ప్రజల ఒత్తిడే యుద్ధాల్ని ఆపగలదు! | Sakshi Guest Column On Russia-Ukraine War four years Completed | Sakshi
Sakshi News home page

ప్రజల ఒత్తిడే యుద్ధాల్ని ఆపగలదు!

Feb 24 2026 5:22 AM | Updated on Feb 24 2026 5:22 AM

Sakshi Guest Column On Russia-Ukraine War four years Completed

నేటితో ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి చేసి, నాలుగేళ్లు పూర్తవుతున్నాయి. ఉక్రెయిన్‌ వరకూ చూస్తే – లక్ష మందికి పైగా సైనికులు చనిపోయారు. మూడు లక్షల మందికి పైగా గాయపడ్డారు. 15 వేల మందికి పైగా పౌరుల ప్రాణాలు పోయాయి. 40 వేల మందికి పైగా గాయపడ్డారు. రష్యా సైన్యంలో లక్షకు పైగా మరణాలు జరిగి ఉండవచ్చనీ, గాయపడిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సమాచారాన్ని ఆ యా ప్రభుత్వాలు చెప్పవు. ఐక్యరాజ్య సమితి, ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ వార్, బ్రోకింగ్స్‌ ఇనిస్టిట్యూషన్‌ వంటి పరిశోధనా సంస్థల ద్వారా బైటకొచ్చిన సమాచారం ఇది. ‘ఉక్రెయిన్‌ నాటోలో సభ్యత్వం తీసుకోకూడదు! క్రిమియా, డొనెత్‌స్క్, లుహాన్‌స్క్, జపోర్జియా, ఖెర్సాన్‌ వంటి ప్రాంతాలను రష్యాకి చెందినవిగా ఉక్రెయిన్‌ అంగీకరించాలి! పెద్ద పెద్ద ఆయుధాల్ని, అలాగే పాశ్చాత్య దేశాల మద్దతుని తగ్గించాలి’ లాంటి రష్యా పెట్టే షరతులకు తలొగ్గడానికి ఉక్రెయిన్‌ సిద్ధంగా లేదు. ఆ షరతులకు తలొగ్గనిదే దిగిరావడానికి రష్యా సిద్ధంగా లేదు.

అమెరికా ఒక పక్కన ఇరాక్, సిరియా, యెమెన్‌ లాంటి మధ్య ప్రాచ్య దేశాల పైన దాడులు చేస్తూ... ‘రష్యా దాడి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన’ అనడమూ; ‘ఉక్రెయిన్‌ భౌగోళిక సమగ్రతను కాపాడాలి’ అనడమూ హాస్యాస్పదం. ఉక్రెయిన్‌కు ఇప్పటివరకు అమెరికా నుంచి సైనిక, ఆర్థిక సహాయం 100 బిలియన్‌  డాలర్లు పొందింది. 500 బిలియన్‌ డాలర్ల (దాదాపు 45 లక్షల కోట్లు) దాకా అమెరికాలో ఆయుధ వ్యాపారం జరిగి ఉంటుందని అంచనా. ఇవి ‘స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్, డిఫెన్స్‌ సెక్యూరిటీ కార్పొరేషన్‌ ఏజెన్సీ, యూ.ఎస్‌. డిపార్టుమెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ లాంటి సంస్థలు ప్రకటించిన సంగతులే!  

ఇంక భారత దేశానికి వస్తే, ‘సమతుల్య తటస్థత’ అనే ఎత్తుగడని పాటిస్తూ, చాలా సందర్భాల్లో ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన వోటింగ్‌లో పాల్గొనకుండా, రష్యాను ఖండించే తీర్మానాలపైన కూడా ఓటు వేయలేదు. భారత ప్రధాని మోదీ 2022లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలిసినప్పుడు ‘ఇది యుద్ధ కాలం కాదు’ అని ఒక వ్యాఖ్యానం చేసి మౌన వ్రతాన్ని పాటించారు. ఇండియాకు రష్యా నుండి చౌకగా క్రూడ్‌ ఆయిల్‌ కావాలి. అలాగే రక్షణ రంగంలో సహకారం కావాలి. అందుకోసం దానితో స్నేహం తప్పదు. అలాగే పాశ్చాత్య దేశాలతో కూడా దానికి కొన్ని అవసరాలు ఉన్నాయి అంటే; ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో భద్రత, సముద్ర మార్గాల స్వేచ్ఛ, చైనా ప్రభావాన్ని పరోక్షంగా సమతుల్యం చేయడం, టెక్నాలజీ, వ్యాక్సిన్లు, సరఫరా వంటి అంశాల్లో సహకారం కావాలి. 

దానికోసమే క్వాడ్‌ (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి) వంటి వేదికల్లో పాల్గొనడం. వీటన్నిటికీ మించి చైనాతో ఇండియాకు 76 ఏళ్ళ పోరు ఉంది. అంతర్జాతీయ సంస్థలు కూడా యుద్ధాన్ని ఆపడానికి నిజాయితీగా ఏ ప్రయత్నాలూ చేయడం లేదు. పౌర ప్రాణాలకన్నా ఏదీ ముఖ్యం కాదు కాబట్టి, ముందైతే ‘కాల్పుల విరమణ’ జరగాలి. అది జరగాలి అంటే ఆయా దేశాల ప్రభుత్వాల మీద ప్రజల ఒత్తిడి పెరగాలి. అది మాత్రమే యుద్ధాన్ని ఆపగలదు. 
– నన్నూరి వేణుగోపాల్‌ ‘ మానవ హక్కుల కార్యకర్త (రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధానికి నేటితో నాలుగేళ్లు) 

Advertisement
 
Advertisement
Advertisement