మణి శంకర్‌ అయ్యర్‌ (84) రాయని డైరీ | Sakshi Guest Column On Rayani diary of Mani Shankar Iyer | Sakshi
Sakshi News home page

మణి శంకర్‌ అయ్యర్‌ (84) రాయని డైరీ

Feb 22 2026 12:59 AM | Updated on Feb 22 2026 12:59 AM

Sakshi Guest Column On Rayani diary of Mani Shankar Iyer

మాధవ్‌ శింగరాజు

‘‘మౌనం రాజ్యం ఏలుతోంది...’’ అని కవులు, రచయితలు అభివర్ణిస్తుంటారు. నిజానికి, మౌనం రాజ్యం ఏలదు. మౌనం వెనుక నక్కి ఉండే మనుషులే రాజ్యం ఏలుతుంటారు. ఆ రాజ్యంలో మల్లికార్జున్‌ ఖర్గే, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, మరో 81 మంది మాత్రమే ఉండరు. ఏదో ఒక మూల డబడబమని చప్పుడు చేస్తూ మణి శంకర్‌ అయ్యర్‌లు అనే నా వంటి గొడవ మనుషులూ ఉంటారు. గొడవ మనుషులు మౌనాన్ని – దాని పాటికి దాన్ని – ప్రశాంతంగా రాజ్యం ఏలనివ్వరు. ‘‘రాజ్యంలో మౌనానికి ఏం పని?!’’ అని మౌనాన్ని తరిమికొట్టటానికి వస్తారు.

కనీసం అప్పుడైనా ఖర్గే, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, ఆ మరో 81 మంది మౌనం వీడరు. పవన్‌ ఖేరా వైపు మౌనంగా చూస్తారు. పవన్‌ ఖేరా బయటికి వచ్చి, ‘‘గౌరవనీయులు శ్రీ మణిశంకర్‌ అయ్యర్‌కూ, ఈ రాజ్యానికీ ఏ విధమైన సంబంధమూ లేదు...’’ అని ఒక ప్రకటన విడుదల చేసి, తిరిగి లోపలికి వెళ్లిపోతారు. వీళ్లంతా సీడబ్ల్యూసీ అనే రాజ్యంలోని మౌనవర్గ సభ్యులు. వాళ్లు మాట్లాడరు, ఎవరినీ మాట్లాడనివ్వరు.

విమర్శలకు సమాధానం చెప్పలేని అసమర్థులే మౌనం అనే పూలచొక్కాను ధరిస్తారు. అసమ్మతిని సహించలేని వాళ్లే, గొంతు విప్పేవాడిని తీసుకెళ్లి ఊరి చివర చెట్టుకు కట్టేసి వస్తారు. ఆ చెట్టు పైన అప్పటికే ఉన్న ఒక పిట్ట ఏదైనా, ఆ సమయానికి ఏమీ తోచక కూసినా, ఆ కూయించింది ఈ మాట్లాడే మనిషే అయుంటాడని అనుమానపడతారు. మౌనానికి ఉండే దుర్లక్షణమే ‘అనుమానం’. మౌనంగా ఉండలేని వాడు చెట్టుకు కట్టేస్తే మాత్రం నోరు కట్టేసుకుంటాడా?! ‘‘కేరళలో ఈసారి కూడా కమ్యూనిస్టులదే అధికారం’’ అన్నాన్నేను. అంతేకాదు, కేసీ వేణుగోపాల్‌ని ‘‘రౌడీ’’ అన్నాను. పవన్‌ ఖేరాను ‘‘పలుకుల చిలక’’ అన్నాను. ఖేరా బయటికి వచ్చి మణి శంకర్‌ అయ్యర్‌కూ, మాకూ సంబంధం లేదు అని లోకానికి చాటి చెప్పింది ఇందుకే.

మౌనం రాజ్యమేలే చోట, మనిషిని తప్పించటం కూడా చప్పుడు లేకుండానే జరిగి పోతుంది. ‘‘ఇక్కడ ఒక మనిషి ఉండాలే...’’ అనే సందేహం కూడా అక్కడెవరికీ రాదు! నాకు బాగా గుర్తు. 2023 ఆగస్టు 20. ఖర్గేజీ పార్టీ అధ్యక్షుడు అయిన పది నెలలకు తొలిసారి ఆ రోజు ప్రకటించిన కొత్త సీడబ్ల్యూసీలో నా పేరు లేదు! రెగ్యులర్‌ మెంబర్స్‌ లిస్ట్‌లో లేదు. పర్మినెంట్‌ ఇన్వైటీస్‌ లిస్ట్‌లో లేదు. స్టేట్‌ ఇన్‌ఛార్జిల లిస్ట్‌లో లేదు. కనీసం, అప్పటివరకు నేనున్న స్పెషల్‌ ఇన్వైటీస్‌ లిస్ట్‌లో కూడా లేదు.

మాట్లాడే మనిషిని గొప్ప రాజనీతిజ్ఞతతో ఏమీ కాంగ్రెస్‌ తప్పించదు. నీతి లేనితనంగా తప్పిస్తుంది. ‘‘సీడబ్ల్యూసీలో ఉండే 25 మంది సభ్యుల సంఖ్యను 84కు పెంచి మరీ నిన్ను తొలగించామంటే, చోటు సరిపోక నిన్ను తీసేయటం కాదు, ఈ చోటుకు నువ్వు సరిపడవని తీసేయటమే...’’ అని చెప్పటమది!

నాటి గాంధీజీ సీడబ్ల్యూసీ, ఈనాటి గాంధీల సీడబ్ల్యూసీ ఒకటి కాదు. ఎదురు మాట్లాడేవాళ్లు విరగబూసిన సీడబ్ల్యూసీ అది. నెహ్రూ, సుభాస్‌ చంద్రబోస్‌ నేరుగానే గాంధీజీతో వాదించారు, నేరుగానే గాంధీజీని విమర్శించారు. వారి మాటలకు గాంధీజీ విలువ ఇచ్చారు. ‘‘ఈ పార్టీని తండ్రి, కుమారుడు, సీడబ్ల్యూసీ అనే ఒక పవిత్రాత్మ కలిసి నడిపిస్తున్నారు’’ అని సుభాస్‌ చంద్రబోస్‌ గాంధీనీ, నెహ్రూనూ ఇద్దర్నీ కలిపి అన్నారు. దైవదూషణ వంటి అంత పెద్ద మాటకు కూడా బోస్‌ను ఆనాడు బహిష్కరించలేదు.

వాదించేవాళ్ల వల్లే ఆవిర్భవించి, విభేదించే వాళ్ల వల్లే మనుగడ సాగించిన కాంగ్రెస్‌ పార్టీ... మాట్లాడక, మాట్లాడనివ్వక మౌనంతో రాజ్యం ఏలుతూ క్షీణదశకు చేరుకున్నట్లే ఉంది ఈనాటికి!! మాట ఈదురుగాలి. గట్టిగా లేని ఆకుల్ని రాల్చేస్తుంది. మౌనం వేరుకు పట్టిన చీడ. చెట్టునే కూల్చేస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement