వంగ దేశం హసించునా? | Sakshi Guest Column On Bangladesh New PM Tariq Rahman | Sakshi
Sakshi News home page

వంగ దేశం హసించునా?

Feb 19 2026 12:33 AM | Updated on Feb 19 2026 12:33 AM

Sakshi Guest Column On Bangladesh New PM Tariq Rahman

బంగ్లాదేశ్‌ నూతన ప్రధాని తారిఖ్‌ రహమాన్‌

సందర్భం

బంగ్లాదేశ్‌ రాజకీయాలు సుస్థిరంగా, ప్రజాస్వామికంగా మారి, ఆ దేశం అభివృద్ధి మార్గంలో ప్రయాణించే పరిస్థితులు ఏర్పడితే, అది బంగ్లాదేశ్‌ ప్రజలకే గాక దక్షిణాసియా అంతటికీ సంతోషించదగ్గ విషయమవుతుంది. అక్కడ రెండేళ్ల కిందటి జెన్‌–జీ ఉద్యమంతో ఆరంభించి, గత వారం వెలువడిన ఎన్నికల ఫలితాల వరకు గల పరిణామాలన్నింటిని సమీక్షించినప్పుడు, ఆ వర్ధమాన దేశం ఒక కొత్త మలుపు తీసుకోగల అవకాశాలైతే స్థూలమైన దృష్టికి కనిపిస్తున్నాయి. 

‘దిగంబర’ ఉద్యమం
55 ఏళ్ల చరిత్ర గల బంగ్లాదేశ్‌లో ఒక సరికొత్త స్థితి రెండేళ్ల నాటి జెన్‌–జీ ఉద్యమంతో మొదలైంది. అంతకుముందు అంతా కుట్రలు, సైనిక నియంతృత్వాలు, అప్రజాస్వామికతలే. ప్రజలు మాత్రం వెనుకబాటుతనంలో, అవినీతి, అణచివేతలో మగ్గిపోతూ వచ్చారు. భౌగోళిక రాజకీయ వ్యూహాలలో ఒక కీలక స్థానంలో ఉన్న ఆ ప్రాంతం పెద్దవారి క్రీడలకు రంగస్థలమైంది. ఇదంతా ఇపుడు రాత్రికి రాత్రి మారిపోయి నవోదయమవుతుందని కాదు. కానీ, జెన్‌–జీ ఉద్యమ పరిణామాలు బంగ్లాదేశ్‌ సమాజానికీ, రాజకీయాలకూ ఒక గట్టి కుదుపును ఇచ్చాయన్నది గుర్తించాలి. 

ఆ ఉద్యమం స్వయంగా ఒక ప్రత్యామ్నాయ వేదికను సృష్టించకపోవచ్చు, కకా వికలమై మరెవరితోనో కలిసి కేవలం ఆరు సీట్లే గెలిచి ఉండవచ్చు. కానీ చరిత్ర పరిణామాలను సవ్యంగా అర్థం చేసుకునేందుకు గీటు రాళ్లు అవి కావు. ఒక పోలిక చెప్పాలంటే – బంగ్లాదేశ్‌ జెన్‌–జీ ఉద్యమ ప్రభావం రాజకీయాలలో, సమాజంలో ‘దిగంబర కవిత్వం’ కవిత్వం వంటిది. కుళ్లిన గతంపై తిరుగుబాటు చేసి కుదిపి వేసి, సరి కొత్త పరిణామాలకు దారులు తెరవటం వంటిది. ఆ చారిత్రక పాత్రను నిర్వర్తించిన వెనుక దిగంబర కవిత మిగలలేదు. ఇపుడు జెన్‌–జీ మిగలలేదు.

ఆరు రంగాల్లో సంస్కరణలు
కానీ, 55 సంవత్సరాల బంగ్లాదేశ్‌లో ఒక పరిస్థితి ఏర్పడినట్ల యితే కనిపిస్తున్నది. క్రమంగా ఏదైనా జరగవచ్చు గాక! ప్రస్తుతాని కైతే ఒక ఆశాభావం ఏర్పడుతున్నది. అందుకు నిర్దిష్టమైన కార ణాలూ ఉన్నాయి. ఉద్యమం దరిమిలా సైన్యం అధికారాన్ని చేజిక్కించుకోవటం గాక, ఉద్యమకారుల అభీష్టం మేరకు ఒక తాత్కాలిక పౌర ప్రభుత్వం ఏర్పడింది. భవిష్యత్తులో ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం ఏర్పడినా అనుసరించటం కోసం 6 రంగాలలో సంస్క రణల కోసం కమిషన్లు ఏర్పడ్డాయి. 

అవి ఎన్నికల సంస్కరణలు, న్యాయ వ్యవస్థ సంస్కరణలు, పాలనా సంస్కరణలు, పోలీస్‌ సంస్కరణలు, అవినీతి నిరోధక సంస్కరణలు, రాజ్యాంగ సంస్కరణలు. వీటిపై సిఫారసులన్నింటినీ ‘జాతీయ ఏకీభావ కమిషన్‌’ పరిధిలోకి తెచ్చి దేశంలోని మొత్తం 33 చిన్నా పెద్దా పార్టీలు, కూటములతో చర్చించి 84 సిఫారసులతో సుదీర్ఘమైన నివేదికను ప్రకటించారు. ఏ సిఫారసును ఎవరు ఆమోదించారు, ఎవరు కాదన్నారు అనే వివరాలు కూడా అందులో ఉన్నాయి. 

అంతిమంగా ఆమోదం పొందినందున వాటన్నింటినీ రాజ్యాంగ సవరణ ఆ మేరకు జరిగిన వెనుక కొత్త ప్రభుత్వం అమలుపరచవలసి ఉంటుందన్నారు. ‘జూలై ఛార్టర్‌’ పేరిట ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ ఆరు విధాలైన సంస్కరణలపై చర్చల క్రమంలో ప్రధాన పార్టీలైన బంగ్లా దేశ్‌ నేషనల్‌ పార్టీ, జమాతే ఇస్లామీ కూడా పాల్గొని అన్నింటినీ ఆమోదించటం గమనించదగ్గది. గత వారం పార్లమెంటుకు జరిగిన ఎన్నికలతో పాటు ఈ ‘ఛార్టర్‌’పై కూడా జరిగిన రెఫరెండంలో 60 శాతానికి పైగా అనుకూలత లభించింది.

అందుకు కట్టుబడి ఉన్నట్లు కొత్త ప్రధాని తారిఖ్‌ రహమాన్‌తో పాటు, జమాత్‌ నాయకుడైన ప్రతిపక్ష నాయకుడు షఫీఖుర్‌ రహమాన్‌ పునరుద్ఘాటించటం గమనించదగ్గది. మునుముందు ఆచరణ ఎట్లుండగలదన్నది వేచి చూడవలసిన విషయమే అయినా, అసలు ఒక ఉద్యమాన్ని పురస్కరించుకుని ఇన్ని విధాలైన సంస్కరణ కమి షన్లు, వాటిపై అన్ని పార్టీలతో చర్చల ద్వారా ఎన్నికలకు ముందే ఏకీభావ సాధన అన్నదే దానికదిగా ఒక అద్భుతమైన విషయం. 

దీనంతటికీ తగినట్లు, బంగ్లాదేశ్‌లో ఎన్నికలు 17 సంవత్సరాల తర్వాత పూర్తి స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగినట్లు అక్కడి యువత, ప్రజలతో పాటు అంతర్జాతీయ పరిశీలకులంతా ప్రకటించటం విశేషం. తాము గెలిచినా, ఓడినా ఫలితాలను అంగీకరించగలమని బీఎన్‌పీ, జమాతే పార్టీలు రెండూ ఎన్నికలకు ముందే ప్రకటించాయి. విజయోత్సవాలు వద్దని బీఎన్‌పీ నాయకత్వం, ఓటమిపై నిరసన ప్రదర్శనలు వద్దని జమాతే నాయకత్వం నిర్ణయించటం వంటివి మనం ఇటీవలి సంవత్సరాలలో లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, పశ్చిమ దేశాలలో ఎక్కడా చూడనిది.

సమాన సత్సంబంధాలు
కొత్త నాయకత్వం ఎన్నికలకు ముందు, ఆ తర్వాత 14వ తేదీ నాటి మొదటి మీడియా సమావేశంలో అంతర్గత విధానాల గురించి, విదేశాలతో సంబంధాల విషయమై కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. అంతర్గతంగా ఆర్థికాభివృద్ధి, మెరుగైన పాలన, ఉద్యోగ కల్పన, అవినీతి నియంత్రణ, ప్రజాస్వామిక విధానాలు, అన్ని మతాల పట్ల సమాన దృష్టితో సహా జూలై ఛార్టర్‌లోని అంశాలకు కట్టుబడి ఉండటం తమ ప్రాధాన్యాలని ప్రకటించింది. అభివృద్ధి, ఉద్యోగ కల్పన జరిగితే మతతత్త్వ ధోరణులు అవే బలహీన పడ తాయని పరోక్షంగా జమాతేను ఉద్దేశించి ఆసక్తికరమైన విశ్లేషణ చేసింది. పై స్థాయిలో అవినీతిని అరికడితే కింది వరకు ఆ సూచనలు పోగలవన్నది మరొక ముఖ్యమైన సూచన. 

ఇండియా, చైనా, పాకిస్తాన్, అమెరికా సహా అన్ని దేశాలతో సమానమైన సత్సంబంధాలు తమ విధానమని తారిఖ్‌ రహమాన్‌ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌ కొత్తమలుపు తిరిగేందుకు తప్పనిసరి అయిన, సరైన విధానం అదే కూడా! ఈ అవసరాన్ని ఇతరులు కూడా గుర్తెరిగి సహకరిస్తే బంగ్లాదేశ్‌తో పాటు మొత్తం దక్షిణాసియాకు మేలు కలుగుతుంది.

టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement