"కోటికి పైగా ప్రజలకు ఒకే ఒక్కడు" | Nitai Roy Chowdhury The Only Hindu MINISTER In Bangladesh | Sakshi
Sakshi News home page

"కోటికి పైగా ప్రజలకు ఒకే ఒక్కడు"

Feb 18 2026 9:39 AM | Updated on Feb 18 2026 10:28 AM

Nitai Roy Chowdhury  The Only Hindu MINISTER In Bangladesh

నిన్న (మంగళవారం) తారిఖ్ రెహ్మాన్ ప్రధానమంత్రి ప్రమాణస్వీకారం ఢాకాలో జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. పలువురు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే  భారత్ చూపు మాత్రం నితై రాయి చౌదరిపైనే ఉంది. ఎందుకంటే ఆ దేశంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక హిందువు చౌదరినే.  ఈ నేపథ్యంలో ఆయన పొలిటికల్ కెరీర్ పై ఓ లుక్ వేద్దాం పదండి.

బంగ్లాదేశ్ లో గత రెండేళ్లుగా చెలరేగిన రాజకీయ అస్థిరత, హింసకు  తెరపడింది.  బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ  ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  అయితే ఇంతకాలం అక్కడ చెలరేగిన హింసలో మైనార్టీలే తీవ్రంగా నష్టపోయారు. అక్కడి మత ఛాందస వాదులు చెలరేగి అక్కడి హిందువులపై దాడులు చేసి చంపడంతో పాటు వారి ఆస్తులను, ఆలయాలను ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన BNP ప్రభుత్వం ఇప్పుడు హిందువుల సంరక్షణకు ఏ చర్యలు తీసుకుంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.  ఈ నేపథ్యంలోనే  తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వం  తన మంత్రివర్గంలో  హిందూ నేత నితై రాయి చౌదరికి చోటు కల్పించింది.

వ్యక్తిగత జీవితం

నితైరాయి చౌదరి 1949 జనవరి 7న జన్మించారు. తన వివాహం జూమా అనే మహిళతో జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు. నితై రాయి వృత్తి రీత్యా న్యాయవాది. వారి కుమారుడు దేబాసిష్ రాయ్ చౌదరి ప్రస్తుతం బంగ్లాదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె నిపున్ రాయ్ చౌదరి రాజకీయ నాయకురాలు బీఎన్ పీలో  ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా ఉన్నారు. ఆమె భర్తసైతం ప్రస్తుతం బీఎన్ పీ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. మరో కుమారుడు మిథున్.

పొలిటికల్ కెరీర్ 

నితై రాయి రాజకీయ జీవితం క్షేత్రస్థాయి నుంచే మెుదలైంది. అక్కడి నుంచే  ఆయన  జాతీయ నాయకునిగా ఎదిగారు. 1988లో తొలిసారిగా  మాగురా-2 నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అనంతరం 1990 లలో మూడు నెలల పాటు యువజన, క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు. హుస్సేన్ మహ్మద్ ఎర్షాద్ పాలన అనంతరం BNPలో చేరారు. అక్కడి నుండి అంచెలంచలుగా ఎదుగుతూ ఆ పార్టీ ఉపాధ్యాక్షుని స్థాయి వరకూ ఎదిగారు.

BNPలో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. పార్టీకి సంబంధించిన నిర్ణయాల రూపకల్పణలో తన సలహాను అందిస్తారు. అయితే గతంలో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హాసీనాని  బహిరంగంగా విమర్శించేవారు. ఆమెది ఫాసిస్ట్ పాలనని నియంతృత విధానాలని విమర్శించేవారు. 2001లో బీఎన్పీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు హిందువులపై దాడి చేయించిందని ఆరోపించారు.

భారత్ సంబంధాలు
అయితే భారత్ - బంగ్లా సంబంధాలపై నితైరాయి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. భారత్ కు వ్యూహాత్మక పరంగా బంగ్లాదేశ్ ఎంతో ప్రముఖమైన స్థానంలో ఉందన్నారు. అందుకే భారత్ బంగ్లాతో మెత్రి కోరుకుంటుందని తెలిపారు. అయితే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సైతం ఆ సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భావిస్తోందని తెలిపారు. అయితే ఇంతకాలం అక్కడ మైనార్టీలపై దాడులు జరిగిన నేపథ్యంలో కొత్తగా కొలువుదీరిన రెహ్మాన్ ప్రభుత్వం వాటిపై ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి. అయితే మంత్రి పదవి చేపట్టిన నితైరాయి చౌదరికి  సైతం  ఆ దేశంలోని హిందువులను కాపాడాల్సిన బాధ్యత ఉంది.

భారత్- బంగ్లా సంబంధాలు
బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రి తారిఖ్ రెహ్మాన్‌ను  భారత ప్రధాని మోదీ ఆయనను భారత్‌కు ఆహ్వానించారు. నిన్న మంగళవారం ఢాకాలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రభుత్వ ప్రతినిధిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన వ్యక్తిగత లేఖను ఆయనకు స్వయంగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో బంగ్లాదేశ్ తో భారత్ మైత్రిని కోరుకుంటుందని ప్రధాని మోదీ చాటిచెప్పారు. అయితే ఈ నేపథ్యంలో  తారిఖ్ రెహ్మాన్ సర్కార్ ఇండియాపై  ఏ వైఖరి అవలంభిస్తోందో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement