3 గంటల్లో ముగిసిన ఇరాన్, అమెరికా చర్చలు | USA-Iran talks end in Geneva | Sakshi
Sakshi News home page

3 గంటల్లో ముగిసిన ఇరాన్, అమెరికా చర్చలు

Feb 18 2026 5:04 AM | Updated on Feb 18 2026 5:04 AM

USA-Iran talks end in Geneva

జెనీవాలోని ఒమన్‌ రాయబారి ఇంట్లో పరోక్ష అణు చర్చలు 

చర్చల వేళ హార్ముజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్‌ 

జెనీవా: వివాదాస్పద అణు కార్యక్రమానికి ఇరాన్‌ చరమగీతం పాడాలన్న ప్రధాన డిమాండ్‌తో గతంలో జరిగిన తొలి దఫా పరోక్ష అణు చర్చలకు కొనసాగింపుగా మంగళవారం జెనీవాలో ఇరాన్, అమెరికాల మధ్య మరోదఫా చర్చలు జరిగాయి. జెనీవాలోని ఒమర్‌ దౌత్యవేత్త అధికారిక నివాసంలో ఒమన్‌ మధ్యవర్తులతో వేర్వేరుగా అమెరికా, ఇరాన్‌ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈసారి రెండో రౌండ్‌ చర్చలు కేవలం మూడు గంటల్లోనే ముగియడం గమనార్హం. చర్చల ఫలితాలను ఇంకా అధికారికంగా వెల్లడించలదు.

అణుబాంబు తయారీ కోసం ప్రయత్నిస్తున్న ఇరాన్‌ను నిలువరించడంతోపాటు ఆ దేశంలో పౌర హక్కుల ఉల్లంఘనలకు స్వస్తిపలుకుతూ ప్రజారంజక పాలన అందించడం, ఖమేనీ ప్రభుత్వం గద్దె దిగడం వంటి డిమాండ్లతో అమెరికా ప్రతినిధి బృందం జనీవాకు తరలివచ్చిందని ఇప్పటికే వార్తలొచ్చాయి. రెండో రౌండ్‌ భేటీలో ఏఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయో తెలియరాలేదు. పరోక్ష చర్చల్లో అమెరికా తరఫున అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్నర్, పశ్చిమాసియాలో ట్రంప్‌ దూత స్టీవ్‌ విట్కాఫ్‌లు పాల్గొన్నారు. ఇరాన్‌ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ముడి చమురు రవాణా నౌకల రాకపోకలను స్తంభింపజేస్తూ హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ కొన్ని గంటలపాట మూసేసింది!

Advertisement
 
Advertisement
Advertisement