రష్యాలో 'దోసకాయల' సెగ.. కిలో ఎంతో తెలుసా? | Prices Of Cucumbers Soar In Russia Amid Wartime Inflation, Check Out Price Details Inside | Sakshi
Sakshi News home page

రష్యాలో 'దోసకాయల' సెగ.. కిలో ఎంతో తెలుసా?

Feb 18 2026 1:20 AM | Updated on Feb 18 2026 4:49 PM

Prices Of Cucumbers Soar In Russia Amid Wartime Inflation

మూడేళ్ల‌గా ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం కార‌ణంగా రష్యా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.  పాశ్చాత్య దేశాల ఆంక్షలు, పడిపోతున్న చమురు ఆదాయం, భారీ సైనిక వ్యయం వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. అధిక ద్రవ్యోల్బణం, కార్మికుల కొరత రోజురోజుకు పెరిగిపోతుంది.

దీంతో నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రష్యాలో దోసకాయల ధ‌ర‌లు భారీగా పెరిగిపోయాయి. ర‌ష్య‌న్స్ దోస‌కాయ‌ల‌ను న్యూ గోల్డ్‌గా పిలుచుకుంటున్నారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నాటికి దోసకాయల ధరలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం కిలో దోసకాయల సగటు ధర 300 రూబిళ్లు (భార‌త కరెన్సీలో సుమారు 356) పలుకుతోంది. 

కొన్ని ప్రాంతాల్లో ఇది అంతకంటే ఎక్కువగా ఉంది. ఫోర్బ్స్ రష్యా నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఒక కిలో దోసకాయల ధర, ఒక కిలో చికెన్ ధరతో సమానంగా ఉంది. మరికొన్ని చోట్ల అరటిపండ్లు వంటి విదేశీ పండ్ల కంటే కూడా దోసకాయలే ఖరీదైనవిగా మారాయి. దోస‌కాయ‌ల ధ‌ర‌లపై సోష‌ల్ మీడియాలో అక్క‌డి ప్ర‌జ‌లు సెటైర్‌లు వేస్తున్నారు. 

ఇప్పుడు దోసకాయలే మా బంగారు ఆభరణాలు" అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మ‌రి కొందరు దోసకాయలతో ఫోటోలు దిగి వాటిని ఖరీదైన లగ్జరీ వస్తువుల్లా చూపిస్తూ రష్యా ఆర్థిక పరిస్థితిని ఎగతాళి చేస్తున్నారు. ధరల పెరుగుదల కారణంగా సైబీరియాలోని కొన్ని సూపర్ మార్కెట్లు ఒక్కో కస్టమర్ త‌క్కువ ప‌రిమాణంలోనే  దోసకాయలు కొనాలని నిబంధనలు కూడా విధించాయి.

దోస‌కాయ ధ‌ర‌లు పెర‌గ‌డానికి కార‌ణాలు ఇవే..
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దిగుమతులపై ఆంక్షలు పెరగడం, స‌ప్లై చైన్ దెబ్బ‌తిన‌డం ప్ర‌ధాన కార‌ణం. అదేవిధంగా  రష్యాలో విద్యుత్ సంక్షోబం కూడా నెల‌కొంది. విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగాయి. దీంతో దోసకాయల వంటి సీజ‌న‌ల్ పంట‌లు పండించ‌డానికి అవ‌స‌ర‌మయ్యే  విద్యుత్ ఖ‌ర్చును రైతులు భ‌రించలేక‌పోతున్నారు. కాగా భార‌త్‌లో ప్ర‌స్తుతం కిలో దోస‌కాయ ధ‌ర రూ.50గా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement