రష్యా చమురు కొనబోమని భారత్‌ హామీ: రూబియో | S Jaishankar denies India has lost strategic autonomy | Sakshi
Sakshi News home page

రష్యా చమురు కొనబోమని భారత్‌ హామీ: రూబియో

Feb 15 2026 6:19 AM | Updated on Feb 15 2026 6:19 AM

S Jaishankar denies India has lost strategic autonomy

మావెప్పుడూ స్వతంత్ర నిర్ణయాలే

మంత్రి జైశంకర్‌ నర్మగర్భ వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని భారత్‌ హామీ ఇచ్చిందని అమెరికా పునరుద్ఘాటించింది. వాణిజ్య ఒప్పందం దిశగా ఇరుదేశాల నడుమ జరిగిన చర్చల్లో భారత్‌ ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. శనివారం మ్యూనిక్‌లో సెక్యూరిటీ సదస్సు సందర్భంగా ఆయన ఈ మేరకు పేర్కొన్నట్టు రష్యా వార్తా సంస్థ టాస్‌ తెలిపింది. అయితే, చమురుతో సహా అన్ని అంశాల్లోనూ భారత్‌ ఎప్పుడూ స్వతంత్ర నిర్ణయాలే తీసుకుంటుందని అదే సదస్సు వేదికగా విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పేర్కొనడం విశేషం. 

‘‘ప్రపంచ చమురు మార్కెట్లు అతి సంక్లిష్టమైనవి. కనుక చమురు కంపెనీలు చాలా అంశాలను మదింపు చేసిన మీదట తమ అత్యుత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరుపుతాయి’’ అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగాక ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లను భారత్‌ భారీగా పెంచుకోవడం తెలిసిందే. అందుకు నిరసనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై 25 శాతం అదనపు టారిఫ్‌లు విధించారు. 

మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కీలక ముందడుగు పడ్డ నేపథ్యంలో వాటిని తాజాగా రద్దు చేశారు. రష్యా చమురు కొనుగోళ్లను ఆపేస్తానని భారత్‌ స్పష్టమైన హామీ ఇచ్చిందని ఆ సందర్భంగా ట్రంప్‌ కూడా చెప్పుకొచ్చారు. రష్యా మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతూ వచ్చింది. కొనుగోళ్లు నిలిపేస్తామంటూ భారత్‌ తమకు అధికారికంగా వర్తమానం ఇవ్వలేదని పలుమార్లు స్పష్టం చేసింది. కేంద్రం కూడా ఈ విషయంలో మొదటినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement