లాంఛనంగా జాతికి అంకితం
ఈశాన్యంలో తొలి హైవే–రన్‌వే
గరి్వంచదగ్గ క్షణాలివి: ప్రధాని
గువాహటి/మోరాన్: ఈశాన్య భారతదేశంలో నిర్మితమైన తొలి హైవే–రన్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో మోరాన్ సమీపంలో నేషనల్ హైవే 37పై సిద్ధం చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్‌ఎఫ్)పై వాయుసేనకు చెందిన సీ–130జె రవాణా విమానంలో ప్రధాని దిగారు. అనంతరం దాన్ని లాంఛనంగా జాతికి అంకితం చేశారు. ఈశాన్య భారతదేశానికి తొలి ఈఎల్‌ఎఫ్ సదుపాయం అందుబాటులోకి రావడం నిజంగా గరి్వంచదగ్గ విషయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రాకృతిక విపత్తులు తదితర సమయాల్లో ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుందని హర్షం వెలిబుచ్చారు.
అబ్బురపరిచిన ఏరియల్ షో
మోదీ ఒక రోజు పర్యటన నిమిత్తం శనివారం అస్సాం చేరుకున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి ఆయన చబువా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్నారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి.సింగ్, రాష్ట్ర మంత్రులు తదితరులు ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం సీ–130జె హెర్క్యులస్ విమానంలో ఆయన ఈఎల్‌ఎఫ్‌కు చేరుకున్నారు.
రన్‌వేపై దిగాక సమీపంలో సిద్ధం చేసిన వేదికకు చేరుకున్నారు. అనంతరం ఈఎల్‌ఎఫ్‌పై వాయుసేన నిర్వహించిన ప్రత్యేక ఏరియల్ షోను వీక్షించారు. 20 నిమిషాలకు పైగా సాగిన ఈ షో ఆహూతులకు కనువిందు చేసింది. యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పైలట్లు ఈఎల్‌ఎఫ్‌పై కచి్చతత్వంతో ల్యాండింగ్, టేకాఫ్‌తో పాటు పలు విన్యాసాలు నిర్వహించారు. స్థానికులు భారీ సంఖ్యలో వాటిని వీక్షించారు.
తొలుత సుఖోయ్ –30 ఎంకేఐ, దాని వెనకే రఫేల్ ఈఎల్‌ఎఫ్ నుంచి టేకాఫ్ అయ్యాయి. తర్వాత ఏఎన్–32 హెలికాప్టర్ టచ్ అండ్ గో విన్యాసాలు ప్రదర్శించింది. తర్వాత మూడేసి చొప్పున తొలుత సుఖోయ్, తర్వాత రఫేల్ యుద్ధ విమానాలు ప్రత్యేక విన్యాసాలతో అలరించాయి. విపత్తుల వేళ చేపట్టే సహాయక చర్యల సన్నద్ధతను ప్రత్యేకంగా తయారు చేసిన అధునాతన దేశీయ హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్) కళ్లకు కట్టాయి. అనంతరం ప్రధాని గువాహటి చేరుకున్నారు.
ఎన్నోవిధాలుగా కీలకం
అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో నిర్మించిన ఈఎల్‌ఎఫ్ వ్యూహాత్మకంగా ఎన్నోవిధాలుగా అత్యంత కీలకమైనది. ఈ ఈఎల్‌ఎఫ్ చైనాకు 300 కి.మీ., మయన్మార్‌కు కేవలం 200 కి.మీ. దూరంలో ఉంటుంది. 4.2 కి.మీ. పొడవైన ఈ హైవే–రన్‌వేను రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించారు. సైనిక, పౌర అవసరాలు రెండింటికీ పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా వాయుసేన సహకారంతో దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పొరుగు దేశాలతో ఘర్షణల వేళ ప్రత్యర్థులు సమీపంలోని వైమానిక స్థావరాలపై దాడులు చేస్తే బలగాల తరలింపు తదితరాలకు తక్షణ సదుపాయంగా ఈఎల్‌ఎఫ్ కీలకపాత్ర పోషిస్తుంది.
విపత్తులు, ఎమర్జెన్సీ సమయాల్లో దిబ్రూగఢ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా కూడా పని చేస్తుంది. దిబ్రూగఢ్–మోరాన్ జాతీయ రహదారి–37పై నిర్మించిన ఈఎల్‌ఎఫ్‌పై అన్నిరకాల యుద్ధ, రవాణా విమానాలనూ సులువుగా దించవచ్చు. రఫేల్, సుఖోయ్‌తో పాటు పలు భారీ రవాణా విమానాలు కూడా దీనిపై విజయవంతంగా ట్రయల్ రన్స్ నిర్వహించాయి. 40 టన్నుల బరువైన యుద్ధ విమానాలతో పాటు ఏకంగా 74 టన్నుల రవాణా విమానాలు కూడా దీనిపై సునాయాసంగా దిగవచ్చు. భారత్‌లో తొలి ఈఎల్‌ఎఫ్ రాజస్తాన్‌లోని బార్మేర్ జిల్లాలో 2021లో నిర్మితమైంది. అనంతరం మధ్య, ఉత్తర భారతంలో కూడా పలు ఈఎల్‌ఎఫ్‌లు అందుబాటులోకి వచ్చాయి.


