శాంతిభద్రతలను పరిరక్షిస్తా  | BNP chairman Tarique Rahman on Saturday prioritised law and order in Bangladesh | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలను పరిరక్షిస్తా 

Feb 15 2026 5:45 AM | Updated on Feb 15 2026 5:45 AM

BNP chairman Tarique Rahman on Saturday prioritised law and order in Bangladesh

బీఎన్‌పీ చైర్మన్‌ తారిఖ్‌ రెహ్మాన్‌  

భారత్‌తో సత్సంబంధాల పునరుద్ధరణకు కృషి ! 

ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించే ఛాన్స్‌

ఢాకా: దాదాపు 18 నెలలుగా కొనసాగుతున్న అరాచకత్వ, అనిశ్చితికి చరమగీతం పాడుతూ ఇకపై తమ పరిపాలనలో శాంతిభద్రతకు పెద్దపీట వేస్తామని బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ చైర్మన్‌ తారిఖ్‌ రెహ్మాన్‌ ప్రకటించారు. తాజాగా జరిగిన బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో మూడింట రెండొంతుల స్థానాలను కైవసంచేసుకుని ఘనవిజయం సాధించిన బీఎన్‌పీ పార్టీ త్వరలోనే అధికార పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో రెహ్మాన్‌ శనివారం ఢాకాలో తొలిసారిగా మీడియాతో మాట్లాడారు.

 ‘‘దేశంలో శాంతిభద్రతల స్థాపన కోసం ఎందాకైనా వెళ్తాం. ఇందుకోసం ప్రతి ఒక్కరి సహకారం మాకు కావాలి. అప్పుడే మేం సురక్షితమైన, మానవీయ బంగ్లాదేశ్‌ను సాకారంచేయగలం. ఎంతటి భారీమూల్యం చెల్లించైనాసరే శాంతిభద్రతలను పరిరక్షిస్తాం. అందరి భాగస్వామ్యంతో ఫాసిజంరహిత దేశ ప్రగతి ప్రయాణం ఆరంభమైంది. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువనిస్తాం. సుస్థిర బంగ్లాదేశ్‌ను నిర్మిస్తాం’’అని అన్నారు.

4 రోజుల్లో ప్రమాణస్వీకారం
ప్రధానిగా తారిఖ్‌తో పాటు కేబినెట్‌ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం మరో నాలుగు రోజుల్లో జరగే అవకాశం ఉందని బీఎన్‌పీ నేత మొహమ్మద్‌ షాహబుద్దీన్‌ చెప్పారు. ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌(బంగభవన్‌)లో తారిఖ్‌ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని కేబినెట్‌ కార్యదర్శి షేక్‌ అబ్దుర్‌ రషీద్‌ చెప్పారు. ఫిబ్రవరి 16 లేదా 17వ తేదీన ప్రమాణస్వీకారం ఉండొచ్చని బీఎన్‌పీ సీనియర్‌ నేత ఒకరు అన్నారు. 

భారత్‌తో బంధంపై.. 
తారిఖ్‌ తల్లి, బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలీదా జియా కాలంలో భారత్, బంగ్లాదేశ్‌ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. ఈ నేపథ్యంలో త్వరలో ప్రధాని హోదాలో ఆయన భారత్‌లో ఎలా మెలగాలనుకుంటున్నారని మీడియా ప్రశ్నించింది. ‘‘మా దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూనే భారత్‌తో విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తాం. దక్షిణాసియాలో అతిపెద్ద శక్తులైన భారత్, చైనా, పాకిస్తాన్‌లతో సమస్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తాం.

 వీటిల్లో ఏ ఒక్క దేశాన్ని మాకు గురువుగా పరిగణించబోం. దేశ అత్యుత్తమ ప్రయోజనాలు, దేశ ప్రజల మార్గదర్శకత్వంలోనే మా విదేశాంగ విధానం రూపుదిద్దుకోబోతోంది’’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఢిల్లీలో తలదాచుకున్న మా దేశ మాజీ మహిళా ప్రధాని షేక్‌ హసీనాను తిరిగి అప్పగించడం అనేది చట్టపరమైన ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. సార్క్‌ పునరుజ్జీవానికి కృషి చేస్తా’’ అని అన్నారు. 

ప్రధాని మోదీకి ఆహ్వానం!
భారత్, బంగ్లా సంబంధాల మెరుగుదల కోసం బీఎన్‌పీ ప్రయత్నిస్తోంది. ఇందుకు తారిఖ్‌ ప్రమాణస్వీకారోత్సవ సందర్భాన్ని సది్వనియోగం చేసుకోవాలని భావిస్తోంది. ప్రధానిగా తారిఖ్‌ ప్రమాణస్వీకారోత్సవానికి భారత ప్రధాని మోదీని ఆహ్వానించాలని బీఎన్‌పీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా, పాకిస్తాన్‌ అగ్రనేతలకూ ఆహ్వానాలు పంపాలని పార్టీ ఉన్నత వర్గాలు యోచిస్తున్నాయి. షేక్‌ హసీనా కాలంలో భారత్‌–బంగ్లాదేశ్‌ బంధం బలంగా ఉండేది. ఆ బంధం చిరకాలం పటిష్టంగా కొనసాగాలంటే తారిఖ్‌ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కావడమే ఉత్తమమనే మాటా వినవస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement