Crude Imports
-
ఇరాన్‌కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా?
ఇరాన్, అమెరికా యుద్ధంలో నేపథ్యంలో ప్రస్తుతం అన్ని దేశాల దృష్టి హార్మూజ్ జలసంధిపైనే ఉంది. జలసంధిని తెరిచి నౌకల రాకపోకలు జరగాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. కానీ, ఇరాన్ మాత్రం.. హార్మూజ్ అంతర్జాతీయ జలమార్గం కాదని.. అది తమ భూభాగానికి చెందిన సముద్ర ప్రాంతమంటూ కొత్త పలుకు ఎత్తుకుంది. అందువల్ల నౌకలు వెళ్లడానికి ఇరాన్ అనుమతి అవసరమని, అలాగే టోల్ వసూలు చేసే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. ఇలాంటి తరుణంలో మొట్టమొదటి సారిగా హార్మూజ్ అంశంపై ఇరాన్ మిత్ర దేశం చైనా స్పందించింది. ఇరాన్‌కు షాక్ ఇచ్చే విధంగా జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.హార్మూజ్‌పై ఇరాన్ వ్యాఖ్యల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్.. హర్మూజ్‌ను అంతర్జాతీయ జలమార్గంగా అభివర్ణించారు. హార్మూజ్ జలసంధిని సాధారణ రాకపోకలకు తెరిచి ఉంచాలి. వెంటనే జలసంధిని తెరవాలని ఇరాన్‌కు సూచించారు. ఇది ప్రాంతీయ దేశాలు, అంతర్జాతీయ సమాజ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. తక్షణ, సమగ్ర కాల్పుల విరమణను చైనా సమర్థిస్తుందన్నారు. శాంతిని పునరుద్ధరించడానికి దోహదపడే అన్ని ప్రయత్నాలకు చైనా మద్దతు ఇస్తుంది. రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని సూచిస్తోందని పేర్కొన్నారు. కాగా, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడం, ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన తర్వాత చైనా అధ్యక్షుడు తొలిసారిగా ప్రకటన చేయడం విశేషం.అయితే, హార్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియాలో తీవ్రమైన ఇంధన కొరతకు దారితీసింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇరాన్ చమురును ప్రధానంగా దిగుమతి చేసుకునే చైనా, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది.నౌకపై దాడులు.. చైనా ఆందోళనమరోవైపు అమెరికా నావికా దిగ్బంధాన్ని ధిక్కరిస్తూ, చైనా నుంచి ఇరాన్ ఓడరేవుకు వెళ్తున్న ఒక సరకు రవాణా నౌకపై అమెరికా నేవీ కాల్పులు జరపడంపైనా చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటాయని, ఘర్షణలను రెచ్చగొట్టడం, ఉద్రిక్తతలను పెంచడం వంటివి మానుకుంటాయని భావిస్తున్నాం. అలాగే హార్మూజ్ జలసంధిలో సాధారణ నౌకాయానాన్ని పునఃప్రారంభించడానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తాయని మేము ఆశిస్తున్నాం’ అని పేర్కొంది.హార్మూజ్ మూసివేతతో చైనాకు నష్టాలు👉ఎనర్జీ సరఫరా అంతరాయం: చైనా క్రూడ్ ఆయిల్లో సుమారు 50% గల్ఫ్ దేశాల నుండి వస్తుంది. హార్మూజ్ మూసివేయడం లేదా దాడులు పెరిగితే, చైనాకు రోజుకు లక్షల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా ఆగిపోతుంది.👉ఆర్థిక ప్రభావం: ఇంధన ధరలు పెరగడం వల్ల చైనా పరిశ్రమలు, రవాణా, విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. ఇది GDP వృద్ధిని మందగింపజేస్తుంది. చైనా ఆర్థిక వృద్ధి 0.5–1% వరకు తగ్గే అవకాశం ఉంది.👉వాణిజ్య నష్టం: ఇరాన్, గల్ఫ్ దేశాలతో చైనా వాణిజ్యం 40–50% వరకు తగ్గింది. ఇది చైనా ఎగుమతులు, దిగుమతులపై నేరుగా ప్రభావం చూపుతోంది. వాణిజ్యం తగ్గడం వల్ల చైనాకు బిలియన్ల డాలర్ల నష్టం జరుగుతుంది.👉జియోపాలిటికల్ ఒత్తిడి: అమెరికా-ఇరాన్ ఘర్షణల కారణంగా హార్మూజ్ అస్థిరత పెరిగింది. చైనా తన నౌకలు, వాణిజ్య మార్గాలను రక్షించుకోవడానికి అదనపు ఖర్చు పెట్టాలి.చైనా ప్రధాన ప్రత్యామ్నాయ మార్గాలు..1. పైప్లైన్లురష్యా–చైనా పైప్లైన్లు: సైబీరియా నుండి చైనాకు నేరుగా ఆయిల్, గ్యాస్ సరఫరా.మధ్య ఆసియా పైప్లైన్లు: కజకిస్తాన్, టుర్క్‌మెనిస్తాన్ నుండి గ్యాస్ సరఫరా. ఇవి హార్మూజ్ మీద ఆధారాన్ని తగ్గిస్తాయి.2. ఆర్కిటిక్ సముద్ర మార్గంరష్యా "నార్తర్న్ సీ రూట్" ద్వారా చైనాకు ఆయిల్, LNG సరఫరా పెరుగుతోంది. ఈ మార్గం హార్మూజ్, మలక్కా వంటి "చోక్పాయింట్"లను తప్పించగలదు.3. స్ట్రాటజిక్ రిజర్వులుచైనా వద్ద 90 రోజులకు సరిపడే ఆయిల్ రిజర్వులు ఉన్నాయి. హార్మూజ్ మూసివేత వంటి తక్షణ షాక్‌లను ఎదుర్కోవడానికి వీటిని ఉపయోగిస్తోంది.4. ఎనర్జీ డైవర్సిఫికేషన్పునరుత్పాదక శక్తి (సోలార్, విండ్)లో భారీ పెట్టుబడులు.సూపర్‌గ్రిడ్ ప్రాజెక్ట్: దేశీయ విద్యుత్ ఉత్పత్తి పెంచి, ఆయిల్ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటోంది. -
హార్మూజ్‌పై ఇరాన్ భారీ ట్విస్ట్.. దిమ్మ తిరిగే ప్లాన్!
టెహ్రాన్: ఇరాన్, అమెరికా మధ్య మాటల దాడి నడుస్తోంది. సై అంటే సై అని ఇరు పక్షాల నేతలు వాదించుకుంటున్నారు. యుద్ధం, దాడుల విషయంలో తగ్గేదేలే అంటూ ప్రతి సవాల్ చేసుకుంటున్నారు. రెండో దఫా చర్చలకు అమెరికా సిద్ధమైన వేళ ఇరాన్ చెక్ పెట్టింది. చర్చలకు వచ్చేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు.. హార్మూజ్ జలసంధిపై సస్పెన్స్ కొనసాగుతోంది. జలసంధి తెరవాల్సిందేనని ట్రంప్ పట్టుబడుతుంటే.. అదంతా జాంతా నై అని ఇరాన్ మొండి పట్టుతో ఉంది. ఇలాంటి తరుణంలో జలసంధిపై మరింత పట్టు బిగించాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది.అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిపై మరింత పట్టు కోసం ఇరాన్ ప్రణాళికలు, కొత్త చట్టాలను అన్వేషిస్తోంది. ఇప్పటి వరకు ఇరాన్‌కు నష్టం కలిగించిన ఇజ్రాయెల్ సహా పలు దేశాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్దమైంది. జలసంధిపై నియంత్రణను కట్టుదిట్టం చేసే కొత్త చట్టాన్ని ఇరాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. తాజాగా ఇరాన్ పార్లమెంటరీ సివిల్ ఇంజనీరింగ్ కమిటీ చైర్మన్.. ఈ మేరకు మహమ్మద్ రెజాయ్ కూచీ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలపై పూర్తి నిషేధంతో పాటు ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై కఠిన నిబంధనలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కొత్త ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేసిందన్నారు. ఈ ముసాయిదా చట్టం తుది రూపం దాల్చే దశకు చేరుకుందని వెల్లడించారు.అలాగే, అతి త్వరలోనే దీనిని ఇరాన్ పార్లమెంట్ ఆమోదించనున్నట్లు తెలిపారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న నౌకలను హార్మూజ్ గుండా ప్రయాణించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తే లేదన్నారు. ఇరాన్ శత్రు దేశాలుగా పరిగణించే దేశాల నౌకలు ప్రయాణించాలంటే ఆ దేశ జాతీయ భద్రతా మండలి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. గతంలో ఇరాన్‌కు నష్టం కలిగించిన దేశాల నౌకలు ఆ నష్టపరిహారాన్ని చెల్లించే వరకు జలసంధి గుండా ప్రయాణించడానికి వీలు లేదన్నారు. జలసంధి గుండా వెళ్లే నౌకలు తమ రవాణా రుసుమును కేవలం ఇరాన్ కరెన్సీలో చెల్లించాల్సి ఉంటుందని బాంబు పేల్చారు.ఉచితం కాదు: ఇరాన్ఇదే సమయంలో హార్మూజ్ జలసంధిలో నౌకల భద్రత ఉచితం కాదని ఇరాన్ ఉపాధ్యక్షుడు మహ్మద్ రెజా ఆరిఫ్ అన్నారు. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ ప్రపంచ దేశాలు తమ నౌకల భద్రతను ఉచితంగా ఆశించడం కుదరదని తేల్చిచెప్పారు. తమ చమురు ఎగుమతులపై ఉన్న ఆర్థిక, సైనిక ఒత్తిడిని తొలగిస్తేనే ప్రపంచ చమురు ధరలు అదుపులోకి వస్తాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అమెరికా చేస్తోన్న నౌకాదళ దిగ్బంధనం కొనసాగినంత కాలం జలసంధిలో సరఫరా పునరుద్ధరణ కష్టమని తేల్చి చెప్పారు. ఇప్పుడు ప్రపంచం ముందు రెండే దారులు ఉన్నాయి. అందరికీ స్వేచ్ఛా యుత చమురు మార్కెట్ ఉండాలి లేదంటే భారీ మూల్యాన్ని చెల్లించుకోవడానికి సిద్ధపడాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్ వ్యతిరేక దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
భారత్‌కు పుతిన్ భారీ సాయం
ఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ చమురు నిల్వలు భారత్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రష్యా మరోసారి భారత్‌కు అండగా నిలిచింది. ఇరాన్‌తో యుద్ధం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో భారత్‌కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధంగా ఉంది. ఏకంగా 95 లక్షల బ్యారెళ్ల చమురు కొన్ని వారాల్లోనే భారత్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్న నేపథ్యంలో హార్మోజ్ జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోయింది. భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో దాదాపు 40% హార్మోజ్ ద్వారా జరుగుతోంది. భారత్ వద్ద ప్రస్తుతం కేవలం 25 రోజులకు సరిపడ ముడి చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధమైనట్టు తెలిసింది. భారతీయ సముద్ర జలాలకు సమీపంలోనే ఉన్న నౌకలలోని దాదాపు 95 లక్షల బ్యారెళ్ల చమురు కొన్ని వారాల్లోనే భారత్ చేరుకోగలదని పరిశ్రమ వర్గాలు రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపాయి.అయితే.. రష్యన్ చమురు నౌకల అసలు గమ్యస్థానం వివరాలను మాత్రం వెల్లడించడానికి సదరు పరిశ్రమ వర్గాలు నిరాకరించాయి. దీంతో, రిఫైనరీ సంస్థలకు ఊరట కలిగిస్తూ కొన్ని వారాల్లోనే ఈ చమురు నౌకలు భారత్ చేరుకుంటాయని మాత్రం వారు వెల్లడించారు. అదేవిధంగా గ్యాసాయిల్, గ్యాసోలిన్, ఎల్పీజీ కూడా పరిమిత పరిమాణంలోనే రిఫైనరీల వద్ద ఉన్నాయి. రానున్న 10-15 రోజులు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగితే ప్రత్యామ్నాయ సరఫరా కోసం భారత ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.ప్రస్తుతం యుద్ధం కారణంగా జలసంధి మార్గం దాదాపు మూతపడడంతో ప్రత్యామ్నాయ సరఫరా కోసం భారత్ అన్వేషించక తప్పని పరిస్థితి నెలకొంది. భారతీయ రిఫైనరీలు రోజుకు సుమారు 56 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తాయి. అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు దరిమిలా ఇరాన్ ప్రతిదాడులకు పాల్పడడంతో హార్మోజ్ జలసంధి సమీపంలో వందలాది చమురు నౌకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు చమురు సరఫరాకు రష్యా అంగీకరించినట్టు సమాచారం. -
రిలయన్స్‌కి వెనెజులా చమురు
న్యూఢిల్లీ: వెనెజులా నుంచి ముడి చమురు నేరుగా దిగుమతి చేసుకునేందుకు దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి అమెరికా నుంచి లైసెన్సు లభించింది. కంపెనీకి చెందిన జామ్‌నగర్ రిఫైనరీకి అనువైన ఈ క్రూడాయిల్ని డిస్కౌంటు రేటుకు పొందడం వల్ల రిలయన్స్ రిఫైనింగ్ మార్జిన్లు మరింత మెరుగుపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఇప్పటివరకు ట్రేడర్ల ద్వారా మాత్రమే విక్రయించడానికి అమెరికా అనుమతిస్తూ వస్తోంది. తాజాగా జనరల్ లైసెన్సు ఇవ్వడం వల్ల ఇప్పటికే ఆయిల్‌ని వెలికితీసిన సంస్థ నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. వాస్తవానికి 2019–20 వరకు వెనెజులా నుంచి రిలయన్స్ క్రూడాయిల్ని కొనుగోలు చేసింది. ఆ దేశంపై అమెరికా ఆంక్షలతో కొన్నాళ్లు నిలిపివేసి, వాటిని సడలించాక 2024లో కొనుగోలు చేసింది.మళ్లీ ఈ ఏడాది ట్రేడర్ల ద్వారా వెనెజులా ఆయిల్ అమ్మకాలు ప్రారంభమయ్యాక 2 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించిన తర్వాత ఆ దేశ ఇంధన రంగంపై ఆంక్షలను అమెరికా సడలించింది. -
రష్యా చమురు కొనబోమని భారత్ హామీ: రూబియో
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని భారత్ హామీ ఇచ్చిందని అమెరికా పునరుద్ఘాటించింది. వాణిజ్య ఒప్పందం దిశగా ఇరుదేశాల నడుమ జరిగిన చర్చల్లో భారత్ ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. శనివారం మ్యూనిక్‌లో సెక్యూరిటీ సదస్సు సందర్భంగా ఆయన ఈ మేరకు పేర్కొన్నట్టు రష్యా వార్తా సంస్థ టాస్ తెలిపింది. అయితే, చమురుతో సహా అన్ని అంశాల్లోనూ భారత్ ఎప్పుడూ స్వతంత్ర నిర్ణయాలే తీసుకుంటుందని అదే సదస్సు వేదికగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొనడం విశేషం. ‘‘ప్రపంచ చమురు మార్కెట్లు అతి సంక్లిష్టమైనవి. కనుక చమురు కంపెనీలు చాలా అంశాలను మదింపు చేసిన మీదట తమ అత్యుత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరుపుతాయి’’ అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగాక ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లను భారత్ భారీగా పెంచుకోవడం తెలిసిందే. అందుకు నిరసనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25 శాతం అదనపు టారిఫ్‌లు విధించారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కీలక ముందడుగు పడ్డ నేపథ్యంలో వాటిని తాజాగా రద్దు చేశారు. రష్యా చమురు కొనుగోళ్లను ఆపేస్తానని భారత్ స్పష్టమైన హామీ ఇచ్చిందని ఆ సందర్భంగా ట్రంప్ కూడా చెప్పుకొచ్చారు. రష్యా మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతూ వచ్చింది. కొనుగోళ్లు నిలిపేస్తామంటూ భారత్ తమకు అధికారికంగా వర్తమానం ఇవ్వలేదని పలుమార్లు స్పష్టం చేసింది. కేంద్రం కూడా ఈ విషయంలో మొదటినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
నీతులు చెప్పేవాళ్లే పాటించట్లేదు
కౌలాలంపూర్: అందరికీ నీతులు చెప్పే అమెరికా మాత్రం వాటిని పాటించట్లేదని భారత విదేశాంగ మంత్రి అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కౌలాలంపూర్‌లో సోమవారం 20వ ఈస్ట్ ఆసియా సదస్సులో పాల్గొన్న సందర్భంగా అమెరికా వైఖరిని జైశంకర్ పరోక్షంగా తూర్పారబట్టారు. ఇంధన వాణిజ్యంతోపాటు ఇతర మార్కెట్లకు విస్తరించకుండా అమెరికా అడ్డుతగులుతోందని జైశంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. భారీ ఎత్తున రష్యన్ చమురును కొంటున్నందుకే భారత్‌పై అదనంగా 25 శాతం టారిఫ్ గుదిబండ పడేశామని ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన అంశాన్ని జైశంకర్ పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ భారత్ అంతర్జాతీ యంగా సరకు రవాణా గొలుసులను పెంచుకోవడానికి, కొత్త మార్కెట్లకు విస్తరించడానికి ప్రయత్నిస్తుంటే కొత్త అవరోధాలు ఎదురవుతు న్నాయి. సాంకేతికత ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటున్న ఈ తరుణంలో ముడి చమురు వంటి సహజవనరులకు డిమాండ్ పెరుగు తోంది. ఈ సమయంలో ఇంధన వాణిజ్యానికి ఆటంకాలను సృష్టిస్తున్నారు. వాణిజ్య ప్రయోజనా లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారు. కొన్ని కఠిన నిబంధనలు, ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా రుద్దుతున్నారు. నీతులు చెప్ప కొన్ని దేశాలే వాటిని పాటించట్లేవు. ఎంతగా అడ్డుకున్నా మార్పు అనేది ఆగదు. సర్దుబాట్లు జరుగుతుంటాయి’’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ మంత్రితో భేటీభారత దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం అధిక సుంకాల భారం విధించిన నేపథ్యంలో భారత అనుకూల పరస్పర వాణిజ్య ఒప్పందాన్ని సాధించే లక్ష్యంతో జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో చర్చలు జరిపారు. ఇందుకు ఆగ్నేయాసియా కూటమి(ఆసియాన్) శిఖరాగ్ర సదస్సు వేదికైంది. ద్వైపాక్షిక భేటీలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమయ్యారు. ‘‘ ఉదయం కౌలాలంపూర్‌లో మార్కో రూబియోను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ద్వైపాక్షిక సంబందాలుసహా ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు ఫలప్రదంగా సాగాయి’’ అని తర్వాత తన సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతాలో జైశంకర్ ఒక పోస్ట్‌పెట్టారు. వాణిజ్య ఒప్పందంపై ఇరువురు నేతలు ప్రత్యేకంగా చర్చించారు. -
రష్యా చమురు కొనుగోళ్లు ఆపలేదు
అమెరికా టారిఫ్‌ల బెదిరిస్తున్నప్పటికీ రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయలేదని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ ఏఎస్ సాహ్ని తెలిపారు. ఆర్థిక ప్రయోజనాల ప్రాతిపదికనే ఐవోసీలాంటి రిఫైనింగ్ సంస్థలు కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. టారిఫ్‌ల నేపథ్యంలో కొనుగోళ్లను తగ్గించాలని గానీ లేదా మరింతగా పెంచాలని గానీ తమకు ఎలాంటి సూచనలు రాలేదని సాహ్ని చెప్పారు.రష్యా చమురుపై ఎలాంటి ఆంక్షలు లేవని, వాటికి విరుద్ధమైనవేమీ భారత్ చేయలేదని పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరికి ముందు భారత చమురు దిగుమతుల్లో 1 శాతం కన్నా తక్కువగా రష్యా వాటా ఉండేది. కానీ ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ ఇంధనంపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన తర్వాత నుంచి ఇది 30 శాతానికి పెరిగింది. ఇదీ చదవండి: రూపాయి 79 ఏళ్ల ప్రస్థానంఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఐవోసీ రిఫైనరీలు ప్రాసెస్ చేసిన క్రూడాయిల్లో 22–23 శాతం వాటా రష్యా దిగుమతులది ఉంటోంది. అటు బీపీసీఎల్ క్రూడాయిల్ రిఫైనింగ్‌లో 34 శాతంగా నమోదైంది. మరోవైపు రష్యా చమురుపై డిస్కౌంట్లు, బ్యారెల్‌పై 1.5 డాలర్లకు తగ్గడంతో గత నెల దిగుమతులు కొంత తగ్గినట్లు బీపీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) వెత్సా రామకృష్ణ గుప్తా తెలిపారు. -
బంగారం దిగుమతులు డౌన్
న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి నాలుగు నెలల్లో.. ఏప్రిల్ నుంచి జూలై వరకు 12.64 బిలియన్ డాలర్ల (రూ.1.05 లక్షల కోట్లు సమారు) విలువైన బంగారం దిగుమలు నమోదయ్యాయి. 2023 ఏప్రిల్–జూలై మధ్య దిగుమతులు 13.2 బిలియన్ డాలర్లతో పోలి్చనప్పుడు 4.23 శాతం తగ్గాయి. ఒక్కజూలై నెల వరకే చూస్తే పసిడి దిగుమతులు 10.65 శాతం తగ్గి 3.13 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023 జూలైలో 3.5 బిలియన్ డాలర్ల దిగుమతులు నమోదు కావడం గమనించొచ్చు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశి్చతులకు తోడు, అధిక ధరలే బంగారం దిగుమతులపై ప్రభావం చూపించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పండుగల సీజన్ నేపథ్యంలో సెపె్టంబర్ నుంచి దిగుమతులు పెరగొచ్చని, దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తగ్గించడం సైతం ఇందుకు మద్దతుగా నిలుస్తుందని ఓ జ్యుయలరీ వర్తకుడు అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి ఇటీవలి బడ్జెట్లో భాగంగా కేంద్రం తగ్గించడం తెలిసిందే. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023–24) మొత్తం మీద బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మన దేశానికి దిగుమతి అవుతున్న బంగారంలో 40 శాతం స్విట్జర్లాండ్ నుంచి వస్తుంటే, యూఏఈ 16 శాతం, దక్షిణాఫ్రికా 10 శాతం వాటా కలిగి ఉన్నాయి. మన దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 5 శాతంగా ఉంది. గణనీయంగా వెండి దిగుమతులు ఏప్రిల్ నుంచి జూలై మధ్య మన దేశం నుంచి 9.1 బిలియన్ డాలర్ల విలువైన రత్నాలు, ఆభరణాల ఎగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే 7.45 శాతం తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 648 మిలియన్ డాలర్ల విలువైన వెండి దిగుమతులు జరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 215 బిలియన్ డాలర్లతో పోల్చి చూసినప్పుడు రెండు రెట్లు పెరిగాయి. యూఏఈతో 2022 మే 1 నుంచి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచి్చంది. దీంతో ఆ దేశం నుంచి బంగారం, వెండి దిగుమతులు పెరిగిపోయాయి. దీనిపై పరిశ్రమ నుంచి ఆందోళన వ్యక్తం అవుతుండంతో కొన్ని నిబంధనలను సమీక్షించాలని భారత్ కోరుతోంది. పెరిగిన వాణిజ్య లోటు ఏప్రిల్ నుంచి జూలై వరకు దేశ వాణిజ్య లోటు 85.58 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక్క జూలై నెలకే 23.5 బిలియన్ డాలర్లుగా వాణిజ్యలోటు నమోదైంది. చైనా తర్వాత బంగారం వినియోగంలో భారత్ రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ప్రధానంగా జ్యుయలరీ పరిశ్రమ నుంచి బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంటోంది. -
పసిడికి అక్షయ తృతీయ శోభ
ముంబై: అక్షయ తృతీయ పండుగ సందర్భంగా డిమాండ్ పెరగడంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. ముంబైలో పసిడి రూ.1,506 పెరిగి రూ.73,008 చేరింది. కిలో వెండి ధర రూ. 1873 ఎగసి రూ.84,215 కి చేరింది.పసిడి దిగుమతులు 30 శాతం అప్ కాగా భారత్ పసిడి దిగుమతులు మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో 30 శాతం పెరిగాయి. విలువలో 45.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీయ పటిష్ట డిమాండ్ దీనికి కారణం. భారత్‌కు దిగుమతుల విషయంలో స్విట్జర్లాండ్ (40%) మొదటి స్థానంలో నిలుస్తుండగా, తరువాతి స్థానాల్లో యూఏఈ (16%), దక్షిణాఫ్రికా (10%) ఉన్నాయి. దేశం మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా దాదాపు 5 శాతం. పసిడిపై ప్రస్తుతం 15శాతం దిగుమతుల సుంకం అమలవుతోంది. చైనా తర్వాత భారత్ అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉంది. కాగా, 2023–24లో వెండి దిగుమతుల విలువ 2.72 శాతం పెరిగి 5.4 బిలియన్ డాల ర్లుగా నమోదైంది. -
తగ్గేదేలే! భారత్‌కు చమురు సరఫరాలో రష్యానే టాప్
భారత్‌కు ముడి చమురు సరఫరా చేయటంలో సౌదీ అరేబియా, ఇరాక్లను వెనక్కి నెట్టింది రష్యా. ఈ ఏడాది అక్టోబరులో అత్యధిక చమురు సరఫరా చేసిన దేశంగా నిలిచింది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2 శాతం. అదే ఈ ఏడాది అక్టోబరులో రోజుకు 9,35,556 పీపాల చమురును దిగుమతి చేసుకోవడం గమనార్హం. దీంతో దేశ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 22 శాతానికి చేరింది. మరోవైపు.. ఇరాక్ నుంచి 20.5 శాతం, సౌదీ అరేబియా నుంచి 16 శాతం మాత్రమే ముడి చమురును దిగుమతి చేసుకుంది భారత్. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టిన తర్వాత మాస్కో నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతి గణనీయంగా పెరిగింది. పశ్చిమ దేశాలు రష్యా చమురు ఎగమతులపై ఆంక్షలు విధించడంతో రాయితీ ధరకు విక్రయించేందుకు ముందుకొచ్చింది మాస్కో. అందిపుచ్చుకున్న భారత్ భారీ ఎత్తున దిగమతులను పెంచుకుంది. డిసెంబరు 2021లో రష్యా నుంచి భారత్‌కు రోజుకి 36,255 పీపాల చమురు మాత్రమే వచ్చింది. అదే ఇరాక్ నుంచి 1.05 మిలియన్లు, సౌదీ అరేబియా 9,52,625 బ్యారెళ్ల చమురు దిగుమతి జరిగింది. ఈ ఏడాది మార్చిలో రష్యా నుంచి భారత్‌కు రోజుకు 68,600 పీపాల ముడి చమురు రాగా.. మే నెలలో అది 2,66,617 పీపాలకు పెరిగింది. జూన్ నాటికి గరిష్ఠంగా 9,42,694కు చేరింది. మరోవైపు.. ఆ నెలలో రోజుకు 1.04 మిలియన్ బీపీడీలతో ఇరాక్ అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. రష్యా రెండో స్థానానికి చేరింది. ఇదీ చదవండి: చుక్కలనంటుతున్న అద్దెలు, కట్టలేక ఖాళీ చేస్తున్న జనాలు -
పెట్రోలియం, క్రూడాయిల్ దిగుమతుల భారం
న్యూఢిల్లీ: భారత పెట్రోలియం, క్రూడాయిల్ దిగుమతుల విలువ ఫిబ్రవరిలో భారీగా 67 శాతం పెరిగింది. విలువలో 15 బిలియన్ డాలర్లకు చేరింది. సమీప భవిష్యత్‌లో భారత్‌లో ధరల పెరుగుదలకు సంకేతంగా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన ఫిబ్రవరి ఎగుమతులు–దిగుమతుల గణాంకాల్లో ఈ అంశం కీలకాంశంగా ఉంది. గణాంకాల్లో కీలకాంశాలు... ► ఫిబ్రవరిలో మొత్తం ఎగుమతుల విలువ 22.36 శాతం పెరిగి 33.81 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక దిగుమతుల విలువ 35 శాతం పెరిగి 55 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు భారీగా 21.19 డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ కేవలం 13.12 బిలియన్ డాలర్లు. ► ఎగుమతుల్లో ఇంజనీరింగ్ (31.34 శాతం పెరిగి 9.27 బిలియన్ డాలర్లు), పెట్రోలియం (66.29 శాతం పెరిగి 4.1 బిలియన్ డాలర్లు), రసాయన రంగాలు (25 శాతం పెరిగి 2.4 బిలియన్ డాలర్లు) మంచి పనితీరును ప్రదర్శించాయి. కాగా, ఫార్మా ఎగుమతులు 3.13 శాతం క్షీణించి 1.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ► ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతులు 29 శాతం పెరిగి 6.24 బిలియన్ డాలర్లకు చేరింది. 400 బిలియన్ డాలర్ల లక్ష్యం సాకారం! ఇక భారత్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల కాలంలో (2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకూ) 374.05 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 45.80 శాతం అధికం. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 59.21 శాతం పెరిగి 550.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరిసి వాణిజ్యలోటు 176.07 బిలియన్ డాలర్లుగా ఉంది. తాజా గణాంకాల ప్రకారం, భారత్ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మీ పెట్రోల్ బిల్లు తగ్గబోతుంది.. ఎలా?
న్యూఢిల్లీ : వాహనాదారులకు పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. తగ్గేటప్పుడు ఒకటి, రెండు పైసల్లో తగ్గినా.. పెరిగేటప్పుడు మాత్రం రెండకెల్లోనే ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ ధరల ప్రభావంతో, మన దేశంలో కూడా ఆయిల్ ధరలు వాహనదారులకు వాత పెడుతున్నాయి. ద్రవ్యోల్బణానికి, కరెంట్ అకౌంట్ లోటుకు పెను ముప్పులా మారుతున్న ఈ పెట్రోల్ ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా నీతి ఆయోగ్ పెట్రోల్ ధరలు తగ్గించేందుకు ఓ సరికొత్త ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. దీంతో నెలవారీ మీ పెట్రోల్ బిల్లు తగ్గిపోనుందట. అదే మిథనాల్. ప్రతి ఒక్క వాహనదారుడు కచ్చితంగా తమ వాహన పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్ కలిపి వాడేలా ఆదేశాలు జారీచేయాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. దీనికి సంబంధించి కేబినెట్ నోట్‌ను కూడా కేంద్రం ముందు ఉంచింది. ఒకవేళ కేంద్ర కేబినెట్ దీన్ని ఆమోదిస్తే, మీ నెలవారీ పెట్రోల్ బిల్లు కనీసం 10 శాతం తగ్గిపోనుందట. అంతేకాక ప్రభుత్వ ఆయిల్ దిగుమతి బిల్లు కూడా క్రమంగా తగ్గేందుకు ఇది సహకరించనుందని తెలిసింది. దీనిపై జూలై చివరి వారంలోనే ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా దీనిపై సీనియర్ ప్రభుత్వ అధికారులతో సమావేశం జరిపారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘మిథనాల్ ఎకానమీ’ రోడ్‌మ్యాప్‌ను కూడా నీతి ఆయోగ్ రూపొందించింది. రవాణా వ్యవస్థ, గృహ అవసరాలకు 15 శాతం మిశ్రమ ఇంధనాన్ని వాడితే 2030 నాటికి క్రూడ్ దిగుమతుల్లో వార్షికంగా 100 బిలియన్ డాలర్ల తగ్గింపు పొందవచ్చని నీతి ఆయోగ్ తన ప్రణాళికలో తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 10 శాతం ఎథనాల్ మిశ్రమ ఇంధనాన్ని వాడుతున్నారు. ఎథనాల్ ధర లీటరు 42 రూపాయలు. ఒకవేళ మిథనాల్ మిశ్రమం వాడితే లీటరుకు 20 రూపాయల కంటే తక్కువగానే నమోదు కానుంది. దీంతో పెట్రోల్ ధరలు 10 శాతం తగ్గిపోనున్నాయి. మిథనాల్ వాడకంతో ఇంధన ధరలు, దేశీయ వార్షిక ఆయిల్ దిగుమతి బిల్లు తగ్గడమే కాకుండా.. కాలుష్యం కూడా నిర్మూలించవచ్చు. మిథనాల్‌తో 20 శాతం క్రూడ్ వినియోగాన్ని రీప్లేస్ చేస్తే, దేశీయ కాలుష్యం 40 శాతం తగ్గిపోనుందని నీతి ఆయోగ్ చెబుతోంది. ఒక్కసారి నీతి ఆయోగ్ రూపొందించిన ఈ పైలట్ ప్రాజెట్లు విజయవంతమైతే, ప్రభుత్వం ఈ మిథనాల్ కమర్షియల్ ప్రొడక్షన్‌ను బొగ్గు నుంచి చేపట్టడం ప్రారంభించనుంది. బొగ్గు నుంచి మిథనాల్ ఉత్పత్తి చేసే కమర్షియల్ ప్రొడక్షన్‌కు పుణే, హైదరాబాద్, తిరుచ్చి ప్రాంతాల్లో రూ.100 కోట్లతో మూడు ఆర్ అండ్ డీ ప్రాజెక్ట్‌లను సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ నడుపుతోంది. అంతేకాక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లలో కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్‌లు సిద్ధమై ఉన్నాయి. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు గనులను కేటాయించాయి. అయితే మిథనాల్‌ను సరఫరా చేయడమే మన రాష్ట్ర ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాల్ అని ఓ ఆయిల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కాగ, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆయిల్ దిగుమతిదారి దేశంగా భారత్ ఉంది. 2900 కోట్ల లీటర్ల పెట్రోల్, 9000 కోట్ల లీటర్ల డీజిల్‌ను వార్షికంగా మన దేశంలో వినియోగిస్తున్నాం. -
ఇరాన్ నుంచి ఇంధనం వద్దు
వాషింగ్టన్: ఇరాన్ నుంచి ముడిచమురును దిగుమతి చేసుకోవడాన్ని భారత్, చైనా సహా అన్ని దేశాలూ నవంబర్ 4 కల్లా పూర్తిగా నిలిపేయాలని అమెరికా హెచ్చరించింది. ఆ తర్వాత కూడా ఇరాన్ నుంచి ముడిచమురు పొందే దేశాలపై ఆంక్షలు విధిస్తామంది. ప్రస్తుతం ఇరాక్, సౌదీ అరేబియాల తర్వాత భారత్‌కు ముడిచమురును అత్యధిక స్థాయిలో సరఫరా చేస్తున్న దేశం ఇరానే. 2017 ఏప్రిల్– 2018 జనవరి కాలంలో 1.84 కోట్ల టన్నుల ముడి చమురును ఇరాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ఇరాన్ అణు పరీక్షలు జరపకుండా నిలువరించే ఒప్పందం నుంచి అమెరికా గత నెలలో వైదొలగి ఇరాన్‌పై ఆంక్షలు విధించింది. అన్ని దేశాలూ గరిష్టంగా 180 రోజుల్లోపు ఇరాన్‌తో ముడిచమురు వ్యాపారాన్ని మానేయాలని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపేసేలా ప్రస్తుతం అమెరికా ఇతర దేశాలపై ఒత్తిడి పెంచుతోంది. భారత్, చైనాలు ఇందుకు మినహాయింపు కాదనీ, ఇరాన్‌పై తమ ఆంక్షలకు వ్యతిరేకంగా వ్యాపారాలు జరిపితే భారత్, చైనాల్లోని కంపెనీలపై చర్యలు తీసుకుంటామని అమెరికా తెలిపింది. ఇతర దేశాలు ఇరాన్ నుంచి ముడిచమురు కొనకుండా చూడటాన్ని తాము అత్యంత ప్రధాన జాతీయ భద్రతాంశంగా పరిగణిస్తున్నామన్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఇరకాటంలోకి నెట్టి, ఆ దేశ దుష్ప్రవర్తనను ఆ ప్రాంతంలోని వారికి తెలియజేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. -
త్వరలో పెట్రోల్ దిగుమతి అవసరం ఉండదట!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం భారత్ కేవలం రూ. 4.5 లక్షల కోట్ల ముడిచమురును మాత్రమే దిగుమతి చేసుకుంటోంది. గతంలో దాదాపు రూ. 7.54 లక్షల కోట్ల మేర ముడిచమురును దిగుమతి చేసుకుంటే తప్ప మన అవసరాలు తీరేవి కావు. కానీ, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధిపై దేశం దృష్టి పెట్టడంతో ముడిచమురు దిగుమతి గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఇక త్వరలోనే ముడిచమురు దిగుమతి చేసుకొనే అవసరం భారత్ కు ఉండబోదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. 'పెట్రోలియం దిగుమతులు అవసరమే లేని దేశంగా భారత్ ను మేం అభివృద్ధి చేయబోతున్నాం. ఎథనాల్, మెథనాల్, బయో సీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వాడకాన్ని మేం ప్రోత్సహిస్తున్నాం. దీనివల్ల గ్రామీణ, వ్యవసాయ రంగాలకు ఊతం లభిస్తుంది. పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది' అని కేంద్ర రోడ్డురవాణా శాఖమంత్రి గడ్కరీ బుధవారం తెలిపారు. మెథనాల్ ఇంధన వనరు వినియోగంపై నీతి ఆయోగ్ సంస్థ నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. గతంలో భారత్ రూ. 7.5 లక్షల కోట్ల ముడిచమురును దిగుమతి చేసుకునేదని, ఇప్పుడు కేవలం రూ. 4.5 లక్షల ముడిచమురు మాత్రమే దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగాఈ వృద్ధి చెందుతున్న భారత్ కు.. వ్యవసాయం, వెదురు ఉత్పత్తి, మిగులు బొగ్గు గనులను ఉపయోగించుకునే సువర్ణావకాశం లభించిందని తెలిపారు. ఇందుకోసం వ్యవసాయ రంగాన్ని విభిన్నరీతిలో ఇంధన అవసరాలు తీర్చే దిశగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని చెప్పారు.


