అమెరికాపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫైర్
ఉద్దేశపూర్వకంగా భారత్‌పై కఠిన ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం
కౌలాలంపూర్: అందరికీ నీతులు చెప్పే అమెరికా మాత్రం వాటిని పాటించట్లేదని భారత విదేశాంగ మంత్రి అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కౌలాలంపూర్‌లో సోమవారం 20వ ఈస్ట్ ఆసియా సదస్సులో పాల్గొన్న సందర్భంగా అమెరికా వైఖరిని జైశంకర్ పరోక్షంగా తూర్పారబట్టారు. ఇంధన వాణిజ్యంతోపాటు ఇతర మార్కెట్లకు విస్తరించకుండా అమెరికా అడ్డుతగులుతోందని జైశంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
భారీ ఎత్తున రష్యన్ చమురును కొంటున్నందుకే భారత్‌పై అదనంగా 25 శాతం టారిఫ్ గుదిబండ పడేశామని ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన అంశాన్ని జైశంకర్ పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ భారత్ అంతర్జాతీ యంగా సరకు రవాణా గొలుసులను పెంచుకోవడానికి, కొత్త మార్కెట్లకు విస్తరించడానికి ప్రయత్నిస్తుంటే కొత్త అవరోధాలు ఎదురవుతు న్నాయి.
సాంకేతికత ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటున్న ఈ తరుణంలో ముడి చమురు వంటి సహజవనరులకు డిమాండ్ పెరుగు తోంది. ఈ సమయంలో ఇంధన వాణిజ్యానికి ఆటంకాలను సృష్టిస్తున్నారు. వాణిజ్య ప్రయోజనా లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారు. కొన్ని కఠిన నిబంధనలు, ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా రుద్దుతున్నారు. నీతులు చెప్ప కొన్ని దేశాలే వాటిని పాటించట్లేవు. ఎంతగా అడ్డుకున్నా మార్పు అనేది ఆగదు. సర్దుబాట్లు జరుగుతుంటాయి’’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు.
అమెరికా విదేశాంగ మంత్రితో భేటీ
భారత దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం అధిక సుంకాల భారం విధించిన నేపథ్యంలో భారత అనుకూల పరస్పర వాణిజ్య ఒప్పందాన్ని సాధించే లక్ష్యంతో జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో చర్చలు జరిపారు. ఇందుకు ఆగ్నేయాసియా కూటమి(ఆసియాన్) శిఖరాగ్ర సదస్సు వేదికైంది. ద్వైపాక్షిక భేటీలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమయ్యారు. ‘‘ ఉదయం కౌలాలంపూర్‌లో మార్కో రూబియోను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ద్వైపాక్షిక సంబందాలుసహా ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు ఫలప్రదంగా సాగాయి’’ అని తర్వాత తన సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతాలో జైశంకర్ ఒక పోస్ట్‌పెట్టారు. వాణిజ్య ఒప్పందంపై ఇరువురు నేతలు ప్రత్యేకంగా చర్చించారు.


