ఎగుమతులకు మెక్సికో టారిఫ్‌ల దెబ్బ | Mexico new import duties put pressure on auto component exporters | Sakshi
Sakshi News home page

ఎగుమతులకు మెక్సికో టారిఫ్‌ల దెబ్బ

Dec 13 2025 5:27 AM | Updated on Dec 13 2025 6:50 AM

Mexico new import duties put pressure on auto component exporters

ఆటో, మెటల్, ఎలక్ట్రానిక్స్‌ రంగాలపై ప్రభావం 

న్యూఢిల్లీ: దేశీ ఎగుమతులపై మెక్సికో ప్రకటించిన టారిఫ్‌ల పెంపు ప్రధానంగా ఆటో, ఆటో విడిభాగాలు, మెటల్, ఎల్రక్టానిక్స్, కెమికల్స్‌ రంగాలపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దక్షిణ అమెరికా దేశమైన మెక్సికో తాజాగా భారత్‌ దిగుమతులపై సుంకాల పెంపును చేపట్టింది. ఇవి 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 

మెక్సికోతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం పరిధిలోలేని దేశాలపై 5 నుంచి 50 శాతంవరకూ దిగుమతి సుంకాలు వర్తించనున్నాయి. భారత్‌సహా చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, ఇండోనేసియా దేశాలలోని వివిధ రంగాలు, పరిశ్రమలపై ఈ టారిఫ్‌లు ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గతేడాది(2024–25) మెక్సికోకు 5.75 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులను భారత్‌ చేపట్టింది. అయితే తాజా టారిఫ్‌ల పెంపు కారణంగా మెక్సికోకు ఎగుమతులు వ్యయభరితమయ్యే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.  

గతేడాది ప్రయాణికుల వాహన ఎగుమతులు 938.35 మిలియన్‌ డాలర్లుకాగా.. 20 శాతం నుంచి 35 శాతం మధ్య టారిఫ్‌ పెంపు వర్తించనున్నట్లు గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనేíÙయేటివ్‌(జీటీఆర్‌ఐ) తెలియజేసింది. దీంతో ధరల పోటీతత్వం నీరసించవచ్చని అభిప్రాయపడింది. ఆటో విడిభాగాలపై ఇది మరింత అధికంగా కనిపించనున్నట్లు పేర్కొంది. ఆటో విడిభాగాల ఎగుమతులు 507.26 మిలియన్‌ డాలర్లుకాగా.. 10–15% సుంకాలు 35 శాతానికి పెరగనున్నట్లు జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ తెలియజేశారు. ఇదేవిధంగా 390.25 మిలియన్‌ డాలర్ల విలువైన మోటార్‌సైకిళ్ల ఎగుమతులు సైతం సవాళ్లను ఎదుర్కోనున్నట్లు తెలియజేశారు. వీటిపై సుంకాలు 20% నుంచి 35 శాతానికి పెరగనున్నట్లు వెల్లడించారు.  

ఆటో విడిభాగాలపై ఎఫెక్ట్‌ 
దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమపై తాజాగా మెక్సికో చేపట్టిన దిగుమతి సుంకాల పెంపు ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు పరిశ్రమల సమాఖ్య ఏసీఎంఏ పేర్కొంది. భారత్‌ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి అర్ధభాగంలో 37 కోట్ల డాలర్ల విలువైన ఆటో విడిభాగాలను మెక్సికోకు ఎగుమతి చేసింది. సుంకాలు భారత్‌ ఎగుమతులపై 35–50% స్థాయిలో పెరగనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొ న్నాయి. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక చర్చలు వృద్ధిలో ఉన్న ఆటోమోటివ్‌ వాణిజ్యానికి నిలకడను తీసుకురాగలదని విశ్వసిస్తున్నట్లు దేశీ ఆటోమోటివ్‌ విడిభాగ తయారీదారుల అసోసియేషన్‌(ఏసీఎంఏ) డైరెక్టర్‌ జనరల్‌ విన్నీ మెహతా చెప్పారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement