రూ. 5,100 రయ్ ..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిమాండ్ నెలకొనడంతో వెండి ధర వరుసగా మూడో రోజు బలపడి, రూ. 2 లక్షల మార్కుకు మరింత చేరువలోకి వచి్చంది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం శుక్రవారం న్యూఢిల్లీ మార్కెట్లో కిలోకి ఏకంగా రూ.5,100 మేర పెరిగి రూ. 1,99,500 వద్ద క్లోజయ్యింది. ఇది సరికొత్త రికార్డు స్థాయి. ‘దేశీ మార్కెట్లో స్పాట్ వెండి ధరలు మరో కొత్త గరిష్టానికి ఎగిశాయి.
అటు బంగారం కూడా భారీగా పెరిగి, రికార్డు స్థాయికి దగ్గర్లో ట్రేడవుతోంది. గత కొద్ది రోజులుగా కన్సాలిడేట్ అవుతున్న పసిడి రేటు, రూపాయి బలహీనంగా ఉండటం లాంటి అంశాల కారణంగా, మళ్లీ పెరగడం మొదలైంది‘ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్టు దిలీప్ కుమార్ తెలిపారు. స్థానిక బులియన్ స్పాట్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,100 పెరిగి రూ. 1,33,600 వద్ద క్లోజయ్యింది.
అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 58.61 డాలర్లు (1.37 శాతం) పెరిగింది. 4,338.40 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి రేటు 64.95 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గించడంతో పసిడి, వెండి ధరలు తదనుగుణంగా స్పందిస్తున్నట్లు కోటక్ సెక్యూరిటీస్ హెడ్ (కరెన్సీ, కమోడిటీ) అనింద్య బెనర్జీ పేర్కొన్నారు.


