2 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన
పరిశ్రమ అయిదు రెట్లు వృద్ధి
2033 నాటికి అంచనాలు
ముంబై: దేశీ ఏరోస్పేస్, డ్రోన్స్, స్పేస్ టెక్ పరిశ్రమ 2033 నాటికి అయిదు రెట్లు వృద్ధి చెందనుంది. 44 బిలియన్ డాలర్లకు చేరనుంది. అదే సమయంలో 2 లక్షలకు పైగా ఇంజనీర్లు, పరిశోధకులు, డేటా సైంటిస్టులకు ఉద్యోగావకాశాలు సృష్టించనుంది. వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ అడెకో ఇండియా ఒక నివేదికలో ఈ అంచనాలను వెలువరించింది.
100కు పైగా క్లయింట్ల నుంచి సేకరించిన గణాంకాలకు మార్కెట్‌పై పరిశోధనల ఫలితాలను జోడించడం ద్వారా అడెకో దీన్ని రూపొందించింది. దీని ప్రకారం ప్రభుత్వ సంస్కరణలు, ప్రైవేట్ రంగం, అంతర్జాతీయ భాగస్వామ్యాల దన్నుతో పరిశోధనల ఆధారిత ధోరణి నుంచి ఏరోస్పేస్, డ్రోన్స్, స్పేస్ టెక్ పూర్తి స్థాయి పరిశ్రమగా ఎదిగింది.
ఈ నేపథ్యంలో స్పేస్ పాలసీ అనలిస్టులు, రోబోటిక్స్ ఇంజనీర్లు, ఏవియోనిక్స్ స్పెషలిస్టులు, జీఎన్‌సీ (గైడెన్స్, నేవిగేషన్, కంట్రోల్) నిపుణుల్లాంటి కొత్త రకం ఉద్యోగాలు వస్తున్నాయని నివేదిక తెలిపింది. వీరంతా అంతరిక్ష రంగంలో దేశ లక్ష్యాల సాధనలో కీలకంగా నిలుస్తున్నారని వివరించింది. ‘ప్రభుత్వ దార్శనికత, క్రియాశీలకమైన స్టార్టప్ వ్యవస్థ దన్నుతో భారత్ అంతర్జాతీయ స్పేస్ హబ్‌గా ఎదగనుంది. దీనితో ఇంజనీరింగ్, రీసెర్చ్, డేటా, బిజినెస్ తదితర విభాగాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాలు రానున్నాయి’ అని అడెకో ఇండియా డైరెక్టర్ దీపేష్ గుప్తా తెలిపారు. నివేదికలో మరిన్ని విశేషాలు..
→ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, పుణేలాంటి ప్రాంతాల్లో అత్యధికంగా అవకాశాలు రానున్నాయి.
→ ఏవియోనిక్స్, క్రయోజెనిక్స్, ఏటీడీసీ (యాటిట్యూడ్ డిటరి్మనేషన్, కంట్రోల్ సిస్టమ్స్), రిమోట్ సెన్సింగ్ నిపుణులు, స్పేస్ హ్యాబిటాట్ ఇంజనీర్లకు భారీ వేతనాలు లభించనున్నాయి. సాధారణ టెక్నికల్ ఉద్యోగులతో పోలిస్తే 20–30% అధికంగా ఉండనున్నాయి.
→ భారతీయ అంతరిక్ష పాలసీ 2023 లాంటి సంస్కరణలు, 250 పైచిలుకు స్పేస్ స్టార్టప్‌లు, ఇన్–స్పేస్ కింద రూ. 1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ మొదలైనవి ఈ పరిశ్రమ వృద్ధికి దన్నుగా నిలుస్తాయి. కొత్త ఆవిష్కరణలు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు తోడ్పడనున్నాయి.
→ అంతరిక్ష రంగంలో సిబ్బందిపరంగా వైవిధ్యం పెరగనుంది. ఇస్రో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం (యువికా), విజ్ఞాన్ జ్యోతి ప్రోగ్రాం, సమృద్ధ్ లాంటి స్కీములతో ఎంట్రప్రెన్యూర్íÙప్, సాంకేతిక, పరిశోధన విభాగాల్లోకి వచ్చే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
→ గగన్‌యాన్ మిషన్, యాక్సియోమ్–4 ఐఎస్‌ఎస్ ప్రోగ్రాంలో భారత్ భాగం కావడం, సొంత స్పేస్ స్టేషన్ నిర్మాణంపై కసరత్తు చేస్తుండటం మొదలైన వాటి వల్ల ఆయా రంగాల్లో ప్రతిభావంతులకు డిమాండ్ మరింతగా పెరగనుంది.
→ ప్రస్తుతం అంతర్జాతీయ స్పేస్ ఎకానమీలో భారత్ వాటా సుమారు 2 శాతంగా ఉంది. 2033 నాటికి 11 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పాటు తన మార్కెట్‌ను 44 బిలియన్ డాలర్లకు పెంచుకోవడంపై భారత్ దృష్టి పెడుతోంది. తద్వారా గ్లోబల్ స్పేస్ ఎకానమీలో 7–8% వాటాను సాధించాలని నిర్దేశించుకుంది.


