'పోలింగ్‌పై నిఘా'..పెళ్లి వేడుకల్లో పాగా.. | Jubilee Hills Bypoll Take Place Under Drones, Drone Revolution New Era In Photography, Surveillance, And Agriculture | Sakshi
Sakshi News home page

Drones used for election surveillance: 'పోలింగ్‌పై నిఘా'..పెళ్లి వేడుకల్లో పాగా..

Nov 12 2025 12:00 PM | Updated on Nov 12 2025 12:53 PM

Telangana Jubilee Hills Bypoll Take Place Under Drones

పెళ్లి, పేరంటం.. విందు.. వినోదం.. అన్న తేడా లేకుండా ఆయా సందర్భాన్ని.. ఆయా వేడుకలను డ్రోన్ల ద్వారా షూట్‌ చేయడం ఇప్పుడు కొత్త విషయం కాకపోవచ్చు. దీంతో పాటు ఇటీవల కాలంలో నిఘా కోసం పోలీసులు సైతం డ్రోన్లను వినియోగిస్తున్నారు. అలాగే వ్యవసాయంలోనూ పురుగుమందులు, ఎరువుల పిచికారీకి డ్రోన్లను వినియోగించడం పెరిగింది. అయితే ఈ టెక్నాలజీ వినియోగం నగరంలో మరింత పెరిగింది.. పెళ్లి సమయంలో వధూవరులు మార్చుకునే పూల దండల్ని వెరైటీగా డ్రోన్‌లను వినియోగించి మోసుకురావడం.. డ్రోన్లతో గిఫ్ట్‌ ప్యాకింగ్స్‌ అందజేయడం వంటి ట్రెండ్స్‌ నడుస్తున్నాయి. కాగా ఎన్నికల ప్రచారాల్లోనూ డ్రోన్ల సాయంతో షూట్‌ చేయడం.. పోలింగ్‌ సమయంలో నిఘా కోసం వాడడం.. కొత్త పరిణామంగా చెప్పుకోవచ్చు.. రానురానూ విస్తృతమవుతున్న డ్రోన్ల వినియోగం నగర జీవనంలో ఓ భాగమవుతోందని విశ్లేషకులు చెబుతోన్న మాట. 

నిషాంత్‌ పేరిట దేశీయ డ్రోన్‌ పరిచయమై దాదాపు మూడు దశాబ్దాలు కావస్తోంది. మన నగరానికి పరిచయమైన డ్రోన్‌ వయసు అందులో సగం ఉండొచ్చు. స్వల్పకాలంలోనే వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగం గణనీయమైన వృద్ధిని చవిచూస్తోంది. ఎన్నికల నిఘా, చట్టం అమలు, భూ సర్వేలు, వ్యవసాయం ఇలా ఏ రంగమూ డ్రోన్‌ అడుగుపెట్టేందుకు కాదు అనర్హం అన్నట్లు మారింది పరిస్థితి. 

పోలింగ్‌లో ఫస్ట్‌.. 
దేశంలోనే తొలిసారిగా నగరంలోని జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక సజావుగా, పారదర్శకంగా ప్రక్రియ జరిగేలా చూసేందుకు 407 పోలింగ్‌ కేంద్రాల్లో రియల్‌–టైమ్‌ నిఘా కోసం 139 డ్రోన్‌లను మోహరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు గ్రామాల్లో భూమి రికార్డుల కోసం డ్రోన్‌ ఆధారిత వైమానిక సర్వేలను ఉపయోగించి పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతం వెలుపల ఉన్న 20 పట్టణ స్థానిక సంస్థల మాస్టర్‌ ప్లాన్ల కోసం బేస్‌ మ్యాప్‌లను సిద్ధం చేయడానికి కూడా డ్రోన్‌ మ్యాపింగ్‌ను వినియోగిస్తున్నారు. 

పోలీస్‌ నుంచి ఆర్మీ వరకూ.. 
గత కొంత కాలంగా నగర పోలీసులు సైతం విభిన్న అవసరాలకు డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. సాధారణ శాంతిభద్రతల నిఘా మొదలుకుని పార్కింగ్‌ సమస్యల వరకూ, కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పర్యవేక్షణకు పోలీస్‌ విధుల్లో డ్రోన్స్‌ భాగం అవుతున్నాయి. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ ఆధ్వర్యంలో స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి సైనిక డ్రోన్‌ల కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేస్తోంది. పైలట్‌ శిక్షణ, కార్యాచరణ ట్రయల్స్‌ కోసం నగరంలో డ్రోన్‌ పోర్ట్‌ను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్రోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 

సినిమాలకూ.. సేద్యానికీ.. 
ఇటీవల షూటింగ్స్‌లో డ్రోన్స్‌ వాడకం భారీగా పెరిగింది. టాలీవుడ్‌కి హైదరాబాద్‌ క్యాపిటల్‌ కావడంతో సహజంగానే డ్రోన్లకు డిమాండ్‌ ఊపందుకుంది. మరోవైపు వ్యవసాయంలో పత్తి, మిరప వంటి పంటలకు డ్రోన్‌లతో స్పాట్‌ స్ప్రేయింగ్‌ కోసం రాష్ట్రం పైలట్‌ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించడానికి రైతు సహకార సంఘాలు డ్రోన్లను స్వీకరిస్తున్నాయి. వ్యోమిక్‌ డ్రోన్‌ మారుత్‌ డ్రోన్‌ వంటి సిటీ స్టార్టప్‌లు పురుగుమందుల స్ప్రే చేయడం, పంట ఆరోగ్య విశ్లేషణ, వరి మొక్కలను నేరుగా నాటడం కోసం సృష్టించిన డ్రోన్స్‌ అవార్డులను పొందాయి. 

పెళ్లి, పేరంటాలకు.. 
ప్రీ–వెడ్డింగ్‌ షూట్స్‌ మొదలు పెళ్లి వేడుకలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన సందర్భాల్లోనూ డ్రోన్‌ వినియోగం సర్వసాధారణం అయ్యింది. వధూవరులు మార్చుకునే పూల దండల్ని అందించడం లాంటి సరదాలను జత చేసేందుకు వీటిని వినియోగిస్తున్నారు. అలాగే ఇటీవల నగరంలో నిర్వహించిన ఒక చిన్నారి నామకరణ మహోత్సవానికి డ్రోన్‌ ద్వారా పేరును జారవిడవడం ఆకట్టుకుంది. ఇలాగే రకరకాలుగా డ్రోన్లను వాడుతున్న నేపథ్యంలో డ్రోన్‌ పరిశ్రమకు సిటీ ప్రధాన కేంద్రంగా మారింది. 

వినియోగంలో జాగ్రత్త.. 

దేశంలో డ్రోన్‌ రూల్స్‌–2021 తరువాతి సవరణల ప్రకారం సగటు డ్రోన్‌ (250 గ్రాముల బరువు మించితే డీజీసీఏ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌) కోసం రిజిస్టర్‌ చేసి ఉండాలి. 

డ్రోన్‌ వినియోగించే ముందు డ్రోన్‌ ఆపరేటర్‌కి రిమోట్‌ పైలట్‌ సర్టిఫికెట్‌ ఉందో లేదో పరిశీలించాలి. పలు ప్రాంతాల్లో ముఖ్యంగా వీఐపీలు నివసించే ప్రాంతాల్లో, రాకపోకలు సాగించే సందర్భాల్లో డ్రోన్ల వినియోగంపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. వీటిపై ముందుగానే అవగాహన పెంచుకోవాలి. 

స్వయం ఉపాధిగా..
నగరంలో డ్రోన్‌–ఫొటోగ్రఫీకి స్పెషలైజ్డ్‌ ఫొటోగ్రాఫర్స్, స్పెషల్‌–ఈవెంట్‌ ఏజెన్సీలు అవతరించాయి. సాధారణంగా ఒక రోజు/ఈవెంట్‌కి హైదరాబాద్‌లో డ్రోన్‌ బేసిక్‌ నానో/ఆర్మ్‌–కెమెరా అద్దె రూ.1,500 నుంచి రూ.5,000 వరకూ ఉంటోంది. ప్రొఫెషనల్‌ కెమెరాతో ఉన్న వాటి ప్యాకేజీలు రూ.7,500 నుంచి రూ.30,000 వరకు అంతకంటే ఎక్కువగానూ ఉన్నాయి. 

కావలసిన డ్రోన్‌ మోడల్, కెమెరా రిజొల్యూషన్, ఎడిటింగ్‌ బట్టి వీటి ధరల్లో మార్పు చేర్పులు ఉంటాయి. ఇక కొనుగోలు చేయాలంటే మాత్రం రూ.లక్షల్లో పలుకుతున్నాయి. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా ప్రయోజనాల కోసం వీఐపీల సందర్శనల సమయంలో కూడా డ్రోన్‌లపై తాత్కాలిక నిషేధాలు తరచూ విధిస్తుంటారు.

(చదవండి: Delhi Fort Incident: పేలుడుకు కొన్ని నిమిషాల ముందు...)

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement