సాక్షి,హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసరలో మాంజా ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక మల్లికార్జున నగర్ కాలనీలో నివసించే పినింటి సుధాకర్‌రెడ్డి కుమారుడు జశ్వంత్‌రెడ్డి, ఇంటర్ చదువుతున్న విద్యార్థి. శుక్రవారం సాయంత్రం బైక్‌పై పొలం వైపు వెళ్తుండగా, అకస్మాత్తుగా మాంజా దారం మెడకు తగిలింది.
ఈ ఘటనలో జశ్వంత్‌రెడ్డి మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అతన్ని కీసరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. మాంజా దారం ప్రమాదకరంగా మెడ చుట్టుకుపోయింది. దీంతో జశ్వంత్ మెడకు సుమారు 20 కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనతో ప్రాంతంలో కలకలం రేగింది. మాంజా దారాల వాడకం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


