హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం గాడినపడింది. ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు, కీలకమైన ప్రాజెక్ట్‌ల కార్యాచరణ, అందుబాటు ధరలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, కాస్మోపాలిటన్ కల్చర్ వంటి కారణాలు అనేకం. ఈ ఏడాది నవంబర్‌లో 6,923 నివాస సముదాయాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటి విలువ రూ.4,904 కోట్లు. ఈ ఏడాదిలో ఈ నెలలోనే అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే ప్రాపర్టీల ధరలు సగటున 9 శాతం మేర వృద్ధి చెందాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది.
గతేడాది నవంబర్‌లో రూ.3,504 కోట్ల విలువ చేసే 5,528 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అంటే గతేడాది నవంబర్‌తో పోలిస్తే 25 శాతం మేర, అంతకుముందు నెల అక్టోబర్‌తో పోలిస్తే 12 శాతం రిజిస్ట్రేషన్లు పెరిగాయి. అలాగే రిజిస్టర్డ్ ప్రాపర్టీల విలువ గతేడాది ఇదే నెలతో పోలిస్తే 40 శాతం మేర వృద్ధి చెందాయి.
విశాలమైన ఇళ్లు..
విస్తీర్ణమైన ఇళ్ల కొనుగోళ్లకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నవంబర్‌లో రిజిస్ట్రేషన్ జరిగిన ప్రాపర్టీలో 17 శాతం వాటా 2 వేల చ.అ.ల కంటే విస్తీర్ణమైన యూనిట్లే అత్యధికంగా ఉన్నాయి. ఇక, విస్తీర్ణాల వారీగా చూస్తే.. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో అత్యధికంగా 1,000–2,000 చ.అ. ప్రాపర్టీల వాటా 67 శాతం కాగా.. 500–1,000 చ.అ. యూనిట్ల వాటా 14 శాతం, 500 చ.అ.ల్లోపు ప్రాపర్టీల వాటా 2 శాతంగా ఉంది.
లగ్జరీదే హవా..
విశాలమైన, విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నవంబర్‌లో జరిగిన రిజిస్ట్రేషన్లలో 87 శాతం ఈ విభాగానివే కావడమే ఇందుకు ఉదాహరణ. గత నెలలో రూ.కోటి కంటే ఎక్కువ విలువైన 1,487 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటి విలువ రూ.2,491 కోట్లు. ఇక, రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్నవి 1,735 యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా వీటి విలువ రూ.1,244 కోట్లు, రూ.50 లక్షల్లోపు ధర ఉన్నవి 3,701 యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా వీటి విలువ రూ.1.169 కోట్లు.


