పుర తీర్పు నేడే | Municipal elections Results On 13th Feb 2026 in Telangana | Sakshi
Sakshi News home page

పుర తీర్పు నేడే

Feb 13 2026 2:58 AM | Updated on Feb 13 2026 5:03 AM

Municipal elections Results On 13th Feb 2026 in Telangana

సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కోసం చేసిన ఏర్పాట్లు..

ఉదయం 8 గంటలకే మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం  

తేలనున్న 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం 

3 నుంచి 8 రౌండ్లలో ఫలితాలు 

కాంగ్రెస్‌ దూకుడు ప్రదర్శిస్తుందా? బీఆర్‌ఎస్‌ పట్టునిలుపుకొనేనా? బీజేపీ నిలబడేనా?

ఫలితాలపై సర్వత్రా ఆసక్తి

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసిన వేలాది మంది అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. లోక్‌సభ ఎన్నికల తరువాత రాజకీయ పార్టీల గుర్తులపై జరిగిన ఈ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తలపడ్డాయి. ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 12,993 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఓటర్లు తమ ఓట్లను బ్యాలెట్‌ పేపర్లలో నిక్షిప్తం చేయగా, బ్యాలెట్‌ బాక్స్‌లను ఆయా ప్రాంతాల్లోని స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. 

అక్కడ భద్రంగా ఉన్న బ్యాలెట్‌బాక్స్‌లను ఉదయం అభ్యర్థుల సమక్షంలో గట్టి బందోబస్తు మధ్య కౌంటింగ్‌ కేంద్రాలకు తరలిస్తారు. కౌంటింగ్‌ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది ప్రజాతీర్పుతో వెల్లడికానుంది. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 73.01 శాతం ఓట్లు పోలైన విషయం విదితమే. 
 
ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం 
మున్సిపల్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడమనేది అన్ని ప్రధాన పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల కావొస్తుండటంతో రాబోయే రెండున్నరేళ్లకు సంబంధించి పట్టణ ప్రజలు ఏవిధమైన తీర్పు ఇవ్వబోతున్నారనేది చర్చనీయాంశమైంది. అదేవిధంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించిన బీఆర్‌ఎస్‌ అదే ఒరవడిని కొనసాగించి గణనీయమైన సంఖ్యలో స్థానాలు గెలుచుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. లోక్‌సభ ఎన్నికల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల దాకా మంచి ప్రదర్శన కనబరిచినందున, పట్టణప్రాంతాల్లో పట్టు ఉందని భావిస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగా ఫలితాలను సాధించగలదా అన్న చర్చ సాగుతోంది. 

ఈ నేపథ్యంలో ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయి? ఎవరికి ప్రతికూలంగా ఉంటాయన్న వాడీవేడీ చర్చ జరుగుతోంది. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవడం ద్వారా తనపట్టు నిలుపుకోవాలని అధికార కాంగ్రెస్‌ యత్నిస్తుంటే.. బీఆర్‌ఎస్‌ మాత్రం పూర్వవైభవం కోసం ప్రయతి్నస్తోంది. మరోవైపు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వీటిని నిచ్చెనగా వినియోగించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. దీనికితోడు ఎంఐఎం తన పరిధిని విస్తరించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఎన్నికల ఫలితాల తరువాత చైర్‌పర్సన్‌/ మేయర్‌ పదవులు దక్కించుకోవడానికి ఆయా పార్టీలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. సీట్లు తగ్గే మున్సిపాలిటీల్లో గెలిచిన వారికి ఎరవేసే కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలనేలా పార్టీలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ప్రతీ వెయ్యి ఓట్లకు ఒక రౌండ్‌.. 
116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణీ కుముదిని వెల్లడించారు. ఉదయం 8 గంటలకు బ్యాలెట్‌ ఓట్లను వార్డుల వారీగా ఒకచోట వేసి వాటిని కలిపిన తరువాత 25 బ్యాలెట్‌ పత్రాలను ఒక బండిల్‌గా చేస్తామని, ఆవిధంగా 40 బండిల్స్‌ను ఒకచోట చేరుస్తామన్నారు. ప్రతీ వెయ్యి ఓట్లకు ఒక రౌండ్‌గా లెక్కించనున్నారు. మున్సిపాలిటీల్లో మూడు నాలుగు రౌండ్లలో వార్డు ఫలితం తేలుతుందని, అదే కార్పొరేషన్లలో అధికంగా ఓట్లు ఉన్నందున అక్కడ ఏడెనిమిది రౌండ్లకు వెళ్లే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్‌ చెప్పింది. 

ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థికి వచ్చిన వ్యాలిడ్‌ ఓట్లను వంద లెక్కన కట్టనున్నట్లు తెలిపింది. నోటా, ఇన్‌వ్యాలిడ్‌ ఓట్లను కూడా వంద లెక్కన బండిల్స్‌గా చేస్తామని పేర్కొంది. ప్రతీ బ్యాలెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే.. ఓటు వచ్చిన అభ్యర్థికి కేటాయించిన కంపార్ట్‌మెంట్‌లో వేస్తారని పేర్కొంది. కౌంటింగ్‌ పూర్తయిన తరువాత.. సంబంధిత అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల నుంచి సంతకాలు తీసుకున్న తరువాత ఫలితాన్ని ప్రకటిస్తామని చెప్పింది. అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారణ చేసుకున్న తరువాత గెలిచిన అభ్యర్థికి సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.  

మొబైల్‌ ఫోన్‌లకు అనుమతి నో.. 
కౌంటింగ్‌ కేంద్రంలోకి కౌంటింగ్‌ సూపర్‌వైజర్, సిబ్బంది, అభ్యర్థులు, వారి ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తామని ఎన్నికల కమిషనర్‌ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్‌ ఫోన్‌లు, ఎల్రక్టానిక్‌ గాడ్జెట్స్‌ను అనుమతించబోమన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163 (సీఆర్‌పీసీ 144) అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చెప్పింది. అందువల్ల ఫలితాల అనంతరం అభ్యర్థులు ఎవరూ కూడా ఊరేగింపులు, సంబరాలు చేసుకోవడం నిషేధమని స్పష్టం చేసింది. ఏడు కార్పొరేషన్లలో 414 డివిజన్లు. 116 మునిసిపాలిటీల్లో 2,582 వార్డులున్నాయి. కార్పొరేషన్లలో కరీంనగర్‌లో అత్యధికంగా 66 డివిజన్లు ఉండగా, అత్యల్పంగా నల్లగొండలో 48 ఉన్నాయి.   

Advertisement
 
Advertisement
Advertisement