అపార కారుణ్యమూర్తి, భక్తవత్సలుడు, సర్వగుణ సంపన్నుడు, భూలోక వైకుంఠ క్షేత్ర నాథుడు అయిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామికి జరిగే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మ్సావ, సంవత్సరోత్సవ సేవలలో అత్యంత ప్రధానమైనది బ్రహ్మోత్సవం.
వైఖానస ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయటం (ధ్వజారోహణం), బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణా నక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు. లోక కల్యాణార్థం సకల శుభ్రప్రాప్తి కోసం అస్మద్ ఆచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో అంగరంగ వైభవంగా... అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల వివరాలు..
విశేష కార్యక్రమాలు అంకురార్పణతో ఆరంభం
స్వర్ణగిరీశుని ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నాడు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభ మయ్యాయి. 17వ తేది వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనాలతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వాహకులు మానేపల్లి రామారావు తెలిపారు.

విశేష కార్యక్రమం వివరాలు
నేటినుంచి పల్లకిసేవ...
12 వ తేది: సింహవాహన సేవ, పరమేష్టివాహనం, నిశాచూర్ణోత్సవం, సాయంత్రం: ఎదుర్కోళ్ల ఉత్సవం, స్వామి వారికి గజవాహన సేవ, అమ్మవారికి హంసవాహన సేవ(లోక కల్యాణం కోసం)
13 వ తేది: పల్లకీ సేవ, సుదర్శన ఇష్టిహవనం, సాయంత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, గరుడవాహన సేవ, అశ్వవాహనసేవ,
14 వ తేది: పల్లకీసేవ, సకల కార్యసిద్ధి కొరకు విష్వక్సేన ఇష్టి, సాయంత్రం హనుమంతవాహన సేవ.
15 వ తేది: పల్లకి సేవ, సకల విద్యాప్రాప్తి కొరకు హయగ్రీవ ఇష్టి.సాయంత్రం అశ్వవాహన సేవ.
16 వ తేది: పల్లకి సేవ, ధన్వంతరి ఇష్టి, సాయంత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం.
17 వ తేది: సర్వభూపాల వాహన సేవ, అష్టోత్తర శత కలశాభిషేకం, చక్రస్నానం. సాయంత్రం పల్లకి సేవ, పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, బలిహరణ మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, సప్తవరణ, మహా కుంభ సంప్రోక్షణ, శాత్తు మొఖై, వేద విన్నపములు, రుత్విక్వరణం, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాద గోష్టితో పూర్తికానున్నాయి.
ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
సుప్రభాత సేవ, ప్రాతఃకాల ఆరాధన, సేవాకాలం, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి, యాగశాలలో ద్వార తోరణం, ధ్వజ కుంభారాధన, చతుస్థానార్చనలు, వేదవిన్నపం, విశేష హోమాలు, పంచసూక్త పరివార,ప్రాయశ్చిత్త హోమాలు, నివేదనలు, నిత్యపూర్ణాహుతి, బలిహరణ, శాత్తుమొలై, ప్రసాద గోష్ఠి
సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, యాగశాలలో ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, విశేష హోమాలు, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హోమాలు, నివేదన, నిత్యపూర్ణాహుతి, బలిహరణ, శాత్తుమొలై, ప్రసాద గోష్ఠి
– యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి


