మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదు | Case Filed On Former MLA Jagga Reddy | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదు

Feb 12 2026 5:23 PM | Updated on Feb 12 2026 5:46 PM

Case Filed On Former MLA Jagga Reddy

సంగారెడ్డి: ఎన్నికల సంఘం ఆదేశాలతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. సంగారెడ్డి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని నిన్న(బుధవారం) రాత్రి 9గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం అధికారి వినయ్‌ కుమార్‌. 

జగ్గారెడ్డిపై బీఎన్‌ఎస్‌ 223,351,352,132,329,191(2) సెక్షన్లతో పాటు 215(1)(b) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. FIR లో A1గా జగ్గారెడ్డి, A2గా అడ్డు అలియాస్ హమీద్‌లను చేర్చారు. దీనిపై సీఐ శివకుమార్ వివరణ ఇచ్చారు. అడ్డు అలియాస్ హామీద్ అనే వ్యక్తి పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ తీసుకుని తరచుగా వస్తుండటంతో రావొద్దని చెప్పామని సీఐ శివకుమార్‌ స్పష్టం చేశారు. అయినా మాట వినకుండా ఎన్నికల సిబ్బందిని బెదిరించి ప్రశాంత వాతావరణానికి  ఇబ్బంది కలిగించారని, గేటు వద్ద కూడా పోలీసులు, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడన్నారు. 

విధి నిర్వహణలో ఉన్న సీఐ శివకుమార్ అతన్ని వారించడంతో తాను జగ్గారెడ్డి మనిషినని చెప్పాడని, తననే ఆపుతావా.. ఎన్నికలు ఎలా జరుగుతాయో చూస్తానని బెదిరించాడన్నారు. విషయం జగ్గారెడ్డికి తెలియడంతో ఆయన తన అనుచరులతో ఇంద్రానగర్ పోలింగ్ కేంద్రానికి వచ్చారని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అక్కడ విషయాన్ని పెద్దది చేశారన్నారు. అంతటితో ఆగకుండా తనపై దాడి చేసేందుకు యత్నించారని సీఐ శివకుమార్ తెలిపారు.

ఇంకా జగ్గారెడ్డిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదు
జగ్గారెడ్డిని పోలీసులు ఇంకా ఎందుకు అరెస్ట్‌ చేయలేదని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ ప్రశ్నించారు. నిన్న జగ్గారెడ్డితో ఉన్నది గోల్కొండ రౌడీ షీటర్లేనని, కౌంటింగ్‌ సందర్భంగా తమపై దాడులు జరిగే ప్రమాదముందన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు రక్షణ కల్పించలని డీజీపీని కోరామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement