బాధ్యతెరిగి.. ఓటేసి..
వైజాగ్ నుంచి వచ్చి..
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాల్వ ప్రణిత విశాఖపట్నం నుంచి వచ్చి తొలిసారి ఓటు హక్కును వినియో గించుకున్నారు. పట్టణానికి చెందిన కాల్వ శ్రీనివాస్ కూతురు ప్రణిత వైజాగ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. అక్కడి నుంచి వచ్చి బుధవారం 18వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. తొలిసారిగా ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందని, మొదటిసారి ఓటు వృథా కావొద్దనే ఉద్దేశంతో వచ్చానని పేర్కొన్నారు.
బెంగుళూరు నుంచి..
జోగిపేట(అందోల్): బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న మహ్మద్ ఆరీఫ్ మున్సిపల్ ఎన్నికలకు జోగి పేటకు వచ్చి ఓటు వేశారు. ఫ్లైట్‌లో మంగళవారం జోగిపేటకు చేరుకొని బుధవారం సీపీఎస్ పోలింగ్ కేంద్రంలోని 15వ వార్డులో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటు విలువ చాలా గొప్పదని చాటేందుకే తాను బెంగుళూరు నుంచి వచ్చి ఓటు వేశానని తెలిపారు.
విజయవాడ నుంచి కుటుంబ సమేతంగా...
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు విజయవాడ నుంచి వచ్చారు. పట్టణంలోని 7వ వార్డుకు చెందిన బస్వరాజ్ కూతురు మానస సరోవరి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంది. దీంతో కుటుంబమంతా అక్కడే ఉంటున్నారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు బస్వరాజ్ అతని కుటుంబం మెదక్‌కు చేరుకొని ఓటువేశారు. కాగా పట్టణంలోని 19వ వార్డులో 90 ఏళ్ల వృద్ధురాలు శివ్వ కిష్టమ్మ తన ఓటు హక్కునువినియోగించుకున్నారు.


