వాగ్వాదం.. తోపులాట
● ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు ● ఓటేసిన మంత్రులు, ప్రముఖులు ● చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని 21వ వార్డులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను పంపించివేశారు. స్థానిక శిశుమందిర్ పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రామాయంపేట మున్సిపాలిటీలోని ఏడో వార్డు గోలిపర్తి వద్ద బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య, వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. నర్సాపూర్‌లోని 8వ వార్డు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇదే పట్టణంలోని 15వ వార్డులో బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు గల్లాలు పట్టుకున్నారు. పలువురి చొక్కాలు చిరిగాయి.
పోలింగ్ ఏజెంట్‌కు ఫిట్స్
మెదక్ మున్సిపాలిటీలో ఒకటో వార్డు పోలింగ్ కేంద్రంలో అపశృతి చోటు చేసుకుంది. బీజేపీ పోలింగ్ ఏజెంట్ క్రాంతికుమార్‌కు ఫిట్స్ రావడంతో అతన్ని పోలీసులు మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
19 మున్సిపాలిటీల్లో పోలింగ్..
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. జోగిపేటలో మంత్రి దామోదర రాజనర్సింహ, హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంగారెడ్డిలోని పాతజైలు సమీపంలో ఉన్న పోలింగ్ బూత్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఓటు వేశారు.
కాంగ్రెస్ అభ్యర్థిపై కానిస్టేబుల్ దాడి
పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు
పటాన్‌చెరు టౌన్: ఓ పార్టీ అభ్యర్థిపై కానిస్టేబుల్ దాడి చేయడంతో ఆయన వర్గీయులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన ఇంద్రేశం మున్సిపాలిటీలోని రామేశ్వరంబండ వీకర్ సెక్షన్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా... 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఐలాపురం నాగరాజు.. మంగళవారం రాత్రి పోలింగ్ బూత్‌కు సమీపంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కొంత మంది గుంపుగా ఉండటంతో అక్కడి నుంచి పంపించేయాలని పోలీసులను కోరాడు. అనంతరం అక్కడి నుంచి వస్తున్న క్రమంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ వచ్చి కొట్టాడని, తాను అభ్యర్థినని చెబుతున్నా వినిపించుకోలేదని నాగరాజు చెప్పాడు. వెంటనే అతడ్ని పటాన్‌చెరులోని అమేధా ఆస్పత్రికి తరలించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి తనపై దాడి చేయించాడని ఆయన ఆరోపించారు. కాగా నాగరాజు వర్గీయులు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.
పోలింగ్ స్టేషన్ వద్ద బందోబస్తు
రామేశ్వరంబండ 6వ వార్డు వద్ద పోలీసులు బందోబస్తును పెంచారు. బుధవారం పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాన్ని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్, క్రైమ్ డీసీపీ ముత్యం రెడ్డి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పోలింగ్‌పై ఆరా తీశారు.


