జోగిపేటలో కాంగ్రెస్‌కే మొగ్గు!
● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి దామోదర ● బలమైన అభ్యర్థులను పెట్టడంలో బీఆర్‌ఎస్, బీజేపీ విఫలం!
జోగిపేట(అందోల్): అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు అధికార పార్టీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వార్డుల రిజర్వేషన్ల తారుమారుతో కాంగ్రెస్‌లో పార్టీ క్యాడర్ ఇబ్బంది పడ్డా చివరి నాలుగు రోజులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ జోగిపేటలోనే మకాం వేసి వ్యూహరచన చేయడం పార్టీకి కలిసి వచ్చిందనే విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ బలమైన అభ్యర్థులను పోటీలో నిలపలేదన్న ఆరోపణలున్నాయి. బీజేపీ 14 వార్డుల్లో పోటీ చేస్తున్నా కేవలం నాలుగు వార్డుల్లోనే పోటీనిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 14 నుంచి 15 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందోలు పరిధిలోని ఐదు వార్డుల్లో నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఒక బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలున్నాయి. జోగిపేటలోని 11, 13,19,14,10 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో ఎన్నిక జరిగిందని చెబుతున్నారు.
కాంగ్రెస్ బీఆర్‌ఎస్ చెరో సగం!
పటాన్‌చెరు : పటాన్‌చెరు నియోజకవర్గంలో మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం పోలింగ్ కాంగ్రెస్ బీఆర్‌ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదు మున్సిపాలిటీలో రెండిట్లో మాత్రమే స్పష్టంగా ఫలితాలు ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు. ఇస్నాపూర్‌లో కాంగ్రెస్‌కు ఆధిపత్యం కనిపించగా గడ్డపోతారంలో బీఆర్‌ఎస్ ఆధిపత్యం కనిపిస్తోంది. ఇంద్రేశం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌కు సగం సగం స్థానాలు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జిన్నారంలో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత కనిపించడం లేదు. స్వతంత్ర అభ్యర్థులు రెండు చోట్ల బీజేపీ కౌన్సిలర్లు మూడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ జిన్నారంలో స్పష్టమైన ఆధిపత్యం ఉందని మొదటి నుంచి అనుకుంటున్నప్పటికీ పోలింగ్ జరిగిన తర్వాత కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యత లభించే అవకాశం లేదని అంచనాలు వేస్తున్నారు.
నారాయణఖేడ్‌లో హోరాహోరీ
నారాయణఖేడ్: నారాయణఖేడ్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు పలు వార్డుల్లో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యేఅవకాశాలున్నట్లు పోలింగ్ సరళి బట్టి తెలుస్తోంది. ఖేడ్‌లో మొత్తం 15 వార్డులకుగాను కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు అన్ని వార్డుల్లోనూ పోటీకి నిలపగా...కొన్ని వార్డుల్లో ఆయా పార్టీల నుంచి రెబెల్స్ పోటీ చేశారు. వీరి ఓట్ల చీలికపై ప్రధాన పార్టీల గెలుపోటములు తారుమారయ్యే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య, మరికొన్ని వార్డుల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కై వసం చేసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కొన్ని వార్డులను బీఆర్‌ఎస్ కై వసం చేసుకోనుంది. తొలిసారి ఖేడ్‌లో బీజేపీ బోణీ కొట్టే అవకాశముందని చెబుతున్నారు.


